భూ వ్యవహరం.. సర్పంచ్‌పై ఎమ్మెల్యే రసమయి బూతు పురాణం..వీడియో

by Anukaran |   ( Updated:2023-03-24 19:10:54.0  )
భూ వ్యవహరం.. సర్పంచ్‌పై ఎమ్మెల్యే రసమయి బూతు పురాణం..వీడియో
X

దిశ, మానకొండూరు : ఓ భూ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారి చివరకు పోలీసులపై ఆరోపణలు చేసే పరిస్థితికి తెచ్చింది. అంతేకాకుండా తన భూమి వ్యవహారంలో ఎమ్మెల్యే రసమయి ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ అధికార పార్టీ సర్పంచ్ ఆరోపణలు చేశారు.

సంఘటన వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం కరీంపేట గ్రామ సర్పంచ్ వనపర్తి మల్లయ్యకు చెందిన భూమిలో ఆదివారం జేసీబీతో పనులు చేయిస్తుండగా ఎస్ఐ ప్రవీణ్ రాజ్ అడ్డుకున్నాడు. జేసీబీ ఓనర్ అయిన తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం మాజీ సర్పంచ్ ఎల్కపల్లి సంపత్‌పై చేయి చేసుకున్నాడు.

ఎస్ఐ చేయిచేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సమాచారం అందుకున్న డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ కేశవపట్నం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. దీంతో హుజురాబాద్ సీఐ కిరణ్ కేశవపట్నం పోలీస్ స్టేషన్‌కు చేరుకొని పరిస్థితిని సమీక్షించి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

భూమి వెనక కథ..

తనకు చెందిన భూమిలో 18 ఏళ్లుగా ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నానని కరీంపేట సర్పంచ్ మల్లయ్య తెలిపారు. ఇంటి నిర్మాణం చేసుకున్నప్పుడు వెనక భాగంలో వాస్తుకు లేదని కొంతభూమిని వదిలేశానని, అయితే ఆ స్థలంలో గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు షెడ్డు వేసుకున్నారని తెలిపారు. తన భూమిలో వేరే వ్యక్తులు షెడ్డు వేసుకోవడంతో దానిని కూల్చివేశానని వివరించారు.

తిరిగి మళ్లీ అదే చోట షెడ్డు నిర్మాణం జరపడంతో షెడ్డును కూల్చేందుకు మొగిలిపాలెం మాజీ సర్పంచ్ సంపత్ జేసీబీని అద్దెకు మాట్లాడుకున్నానని తెలిపాడు. అయితే, జేసీబీని గ్రామంలోని ఓ చోట పార్క్ చేసి స్థలాన్ని చూసేందుకు సంపత్ వెల్లాడని అన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న ఎస్ఐ ప్రవీణ్ రాజ్ కరీంపేటకు చేరుకొని జేసీబీ యజమాని సంపత్‌పై చేయిచేసుకున్నాడని ఆరోపించారు. అంతేకాకుండా జేసీబీతో పాటు సంపత్, అతని స్నేహితులను స్టేషన్‌కు తరలించాడని మల్లయ్య తెలిపారు.

డీసీసీ ఆందోళన..

జేసీబీ యజమాని సంపత్ కాంగ్రెస్ నాయకుడు కూడా కావడంతో ఈ సమాచారం అందుకున్న డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ నాయకులతో కలిసి పోలీసు స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఈ నేఫథ్యంలో స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమాచారం అందుకున్న హుజురాబాద్ సీఐ కేశవపట్నం చేరుకొని ప్రాథమిక విచారణ చేపట్టారు.

ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రసమయి వల్లే ఇంత రాద్దాంతం జరిగిందని, పోలీసులను ఈ వ్యవహారంలో జోక్యం చేశాడని ఆరోపించారు.

సర్పంచ్, రసమయి వాగ్వాదం..

కరీంపేట సర్పంచ్‌కు, మానకొండూరు ఎమ్మెల్యే రసమయికి మధ్య ఫోన్‌లో వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకున్నారు. రౌడీషీటర్లను తీసుకొచ్చావంటూ రసమయి.. మల్లయ్యపై సీరియస్ అయ్యారు. నీవేం చేస్తున్నావో అందరికీ తెలుసంటూ మల్లయ్య కూడా ఎదురు దాడికి దిగారు.

రాజీనామా..

టీఆర్ఎస్ పార్టీలో ఉన్న తన భూమి విషయంలో స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కరీంపేట సర్పంచ్ వనపర్తి మల్లయ్య ప్రకటించారు. తనను అసభ్య పదజాలంతో ఎమ్మెల్యే రసమయి మాట్లాడటం బాధించిందని అన్నారు.

Advertisement

Next Story