మాకు పదవులు కాదు.. ప్రజలే ముఖ్యం : ఎమ్మెల్యే పెద్ది

by Shyam |   ( Updated:2021-11-12 07:25:17.0  )
మాకు పదవులు కాదు.. ప్రజలే ముఖ్యం : ఎమ్మెల్యే పెద్ది
X

దిశ, నర్సంపేట : రైతు శ్రేయస్సు కోరని సమాజం బాగుపడదని తనకి పదవి ముఖ్యం కాదని, రైతుల పక్షాన పోరాడటానికి ఎల్లవేళలా సిద్ధమని నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నర్సంపేటలో నిర్వహించిన రైతు మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్న రైతులనుద్దేశించి మాట్లాడిన పెద్ది.. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. వరి ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం ద్వంద వైఖరిని అవలంభిస్తోందని మండిపడ్డారు. కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం వరి ధాన్యం కొనమని తెగేసి చెబుతుంటే తెలంగాణ బీజేపీ నాయకులు మాత్రం రైతులు వరి పంట వేయాలని, కేసీఆర్‌ను నిలదీయాలని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కేంద్రం పరిధిలో ఉండగా వరి కొనుగోలు బాధ్యత మాత్రం రాష్ట్రానిదనడం ప్రజలు గమనించాలన్నారు. వానకాలంలో వేసిన వరి పంటను కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కొనుగోలు కేంద్రాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. పత్తి పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మరిచినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పత్తికి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తోందన్నారు.నర్సంపేట నియోజకవర్గంలోని పాకాల, రంగాయ చెరువు పై ప్రాజెక్టుల అనుమతుల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిందన్నారు. రైతులకు ఉచిత కరెంట్, సబ్సిడీలు, బీమా ఇవ్వకుండా మోసం చేయడానికి సిద్ధమవుతుందన్నారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏంటని ఎమ్మెల్యే మండిపడ్డారు.

రైతులకు బీజేపీ ప్రభుత్వం చేసిన మేలేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పాలనలో రైతులకు అనేక సంక్షేమ పథకాలు, ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, రైతు బీమా, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి నీళ్లందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అనంతరం ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అంటే పోరాటాల పార్టీ అని, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రైతుల కోసం పోరాటాలు చేయడానికి తాము ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటామన్నారు. రైతుల కోసం అవసరమైతే తమ పదవులను త్యాగం చేయడానికి సిద్ధమేనని మాలోతు కవిత స్పష్టం చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ ఆకుల శ్రీనివాస్, జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, టీఆర్ఎస్ జిల్లా నాయకులు బీరం సంజీవరెడ్డి, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామి నాయక్, నియోజకవర్గ నాయకులు రాయిడి రవీందర్ రెడ్డి, మారం రాము, మున్సిపల్ ఛైర్మన్ గుంటి రజని కిషన్, వైస్ ఛైర్మన్ వెంకట్ రెడ్డి, లెక్కల విద్యాసాగర్ రెడ్డి, నియోజకవర్గంలోని టీఆర్ఎస్‌కు చెందిన ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, రైతు సమన్వయ సమితి సభ్యులు, మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed