కంటైన్మెంట్ క్లస్టర్లను పరిశీలించిన మంత్రి వేముల

by Shyam |
కంటైన్మెంట్ క్లస్టర్లను పరిశీలించిన మంత్రి  వేముల
X

దిశ, నిజామాబాద్: కరోనా వ్యాప్తి నివారణ కోసం ప్రజలందరూ ఇండ్లలోనే ఉండి సహకరించాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కోరారు. బుధవారం ఆయన బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్, బాల్కొండ మండల కేంద్రంలో కరోనా నేపథ్యంలో ఏర్పాటు చేసిన కంటైన్మెంట్ క్లస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలందరూ లాక్‌డౌన్‌ను గౌరవించి.. కరోనాను నిర్మూలించేందుకు అందరూ సహకరించాలని కోరారు. కంటైన్మెంట్ క్లస్టర్లలో ఉన్న వారికి అవసరమైన నిత్యావసర సరుకులు, కూరగాయలు ఇంటి వద్దకే తీసుకువచ్చి అధికారులు అందజేస్తారని చెప్పారు. ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ క్లస్టర్లుగా ఏర్పాటు చేసి వ్యాధి వ్యాప్తి లేకుండా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ మండల కేంద్రంలో ఇద్దరికి, భీమ్‌గల్ పట్టణంలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో వారిని హైదరాబాద్‌కు తరలించామన్నారు. బాల్కొండలో కరోనా సోకిన ఇద్దరు మరో 25 మందిని కలిశారన్నారు. భీమ్‌గల్‌లో కరోనా సోకిన వ్యక్తి ఇతరులను కలిశాడన్నారు. ఇలా అతనితో దగ్గరగా కలిసిన వారిలో 53 మందిని గుర్తించినట్టు తెలిపారు. ఇతరులకు వ్యాధి సోకరాదనే ఉద్ధేశంతో కంటైన్మెంట్ క్లస్టర్‌లో నలుగురు అధికారులతో ప్రజలకు ఇండ్ల వద్దకే సేవలందించే ఏర్పాట్లు చేశామన్నారు. సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన లాక్‌డౌన్‌ను ప్రజలందరూ క్రమశిక్షణతో పాటించడంతో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదన్నారు. కానీ దూరదృష్టవశాత్తు ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్లిన వారి మూలంగా వ్యాప్తి చెందిందని తెలిపారు. కరోనా సొకిన వ్యకి ఇంటి నుంచి చుట్టూ అర కి.మీ నుంచి కి.మీ పరిధిలో ప్రధాన రోడ్ల వెంట తిరుగుతూ మంత్రి ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడక్కడ పలువురు స్థానికులతో మాట్లాడారు. బాబాపూర్‌లో క్వారెంటైన్ కేంద్రం ఏర్పాటు చేయాలని, ఈ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రజాప్రతినిధులు, నాయకులకు సూచించారు. వైద్య సిబ్బందికి గ్లౌజులు, ఇతర కిట్లు అందించే ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో రమేశ్, ఆర్డీవో శ్రీనివాస్‌లకు సూచించారు. అంతకు ముందు వేల్పూర్‌లో తన నివాసంలో నియోజకవర్గంలో కరోనా నివారణపై కొనసాగుతున్న చర్యల పై ఉన్నతాధికారులతో సమీక్షించారు.

Tags: Minister vemula prashanth reddy, examined, containment, clusters, corona,nzb

Advertisement

Next Story

Most Viewed