పాడి పశువుల పెంపకాన్ని చేపట్టాలి: తలసాని

by Shyam |
పాడి పశువుల పెంపకాన్ని చేపట్టాలి: తలసాని
X

దిశ, న్యూస్‌బ్యూరో: వ్యవసాయానికి అనుబంధంగా పాడి పశువుల పెంపకాన్ని చేపట్టేందుకు రైతులను ప్రోత్సహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. శనివారం పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఆఫీస్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో పశు గణాభివృద్ది సంస్థ కార్యకలాపాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అవసరాలకు సరిపడా పాల ఉత్పత్తి మన రాష్ట్రంలోనే జరగాలన్నారు. రైతులు పాడి పశువుల పెంపకాన్ని చేపట్టే విధంగా ప్రోత్సహిస్తే ప్రతిరోజూ ఆదాయం లభింఛి ఆర్ధికంగా డెవలప్ అవుతారన్నారు. నాణ్యమైన పాలను ఉత్పత్తి చేయడం కోసం మేలుజాతి పశువుల అభివృద్దికి కృషి చేయాలన్నారు. పశుగణాభివృద్ది సంస్థను బలోపేతం చేయడం ద్వారా పాడిరంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు వీలవుతుందని, దీనిలో భాగంగా 32జిల్లాలకు పశుగణాభివృద్ది సంస్థ పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. దీనికోసం పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అధ్యక్షతన టీఎస్ఎల్‌డీఏ చైర్మన్, సీఈవో, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్, విజయ డెయిరీ ఎండీలతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త కమిటీలకు అవసరమైన ఆఫీస్‌లు, సిబ్బంది, సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గోపాలమిత్రల ద్వారా రైతుల ఇంటివద్దనే కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

కరీంనగర్‌లోని పశు వీర్య ఉత్పత్తి కేంద్రంలో సంవత్సరానికి 16లక్షల డోసుల ఉత్పత్తి జరుగుతుందని, కంసానిపల్లిలో నిర్మిస్తున్న గనీకృత పశు వీర్య ఉత్పత్తి కేంద్రం మూడు నెలల్లో అందుబాటులో వస్తుందని మంత్రి తెలిపారు. విజయ డెయిరీ, ముల్కనూర్, కరీంనగర్ డెయిరీలతో సమన్వయం చేసుకొని అవసరమైన చోట్ల పాలు, పాల ఉత్పత్తులను ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సరఫరా చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశుసంవర్ధక, పశుగణాభివృద్ది, విజయ డెయిరీ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని అప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని మంత్రి చెప్పారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, టీఎస్ఎల్‌డీఏ చైర్మన్ రాజేశ్వర్ రావు, సీఈవో మంజువాణి, విజయ డెయిరీ ఎండీ శ్రీనివాసరావు, వివిధ జిల్లాల పశుగణాభివృద్ది సంస్థ చైర్మన్లు పాల్గొన్నారు.

Advertisement

Next Story