‘ప్రజలను దోచుకుని దాచుకోవడమే కాంగ్రెస్ పని’

by Shyam |   ( Updated:2020-08-26 08:21:54.0  )
‘ప్రజలను దోచుకుని దాచుకోవడమే కాంగ్రెస్ పని’
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: ప్రజల్ని దోచుకొని.. దాచుకోవడమే కాంగ్రెస్ నేతల పని అని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బుధవారం పర్యటించిన ఆయన అనుముల మండలం కొత్తపల్లి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యతో కలిసి పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. అనంతరం నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని పెద్దచెరువులో చేప పిల్లలను వదిలారు. మత్స్యకారులను ఆదుకోవడంలో సీఎం కేసీఆర్ ముందున్నారని…

మత్స్య కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.900 కోట్లతో సొసైటీలను ఏర్పాటు చేశారని తెలిపారు. రాష్ట్ర మత్స్య సంపద ఇతర రాష్ట్రాల కన్నా ముందంజలో ఉందని వెల్లడించారు. అనంతరం పశువులకు కృత్రిమ గర్భధారణ కేంద్రాన్ని ప్రారంభించారు. అధికారంలో ఉన్నపుడు ఏనాడు కాంగ్రెస్ నాయకులకు రైతులు గుర్తుకు రాలేదని తలసాని దుయ్యబట్టారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, పుష్కలంగా నీళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం అని అన్నారు. సీఎం కేసీఆర్ ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొడుతూ ఇంటింటికీ సురక్షిత నదీ జలాలను అందిస్తున్నారన్నారు. కరోనా కష్ట కాలంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను నిరాఘాటంగా కొనసాగిస్తున్న కేసీఆర్‌కు ప్రతిఒక్కరూ ఋణపడి ఉంటారని తలసాని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed