20 శాతం బెడ్లు పేదలకు కేటాయించాల్సిందే- మంత్రి శ్రీనివాస్ గౌడ్

by vinod kumar |   ( Updated:2021-05-21 04:54:04.0  )
20 శాతం బెడ్లు పేదలకు కేటాయించాల్సిందే- మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, మహబూబ్ నగర్ : కరోనా వైద్యం అందిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు తమ ఆసుపత్రులలో ఉన్న బెడ్లలో 20శాతం పేదల కోసం కేటాయించాలని రాష్ట్ర ఎక్సైజ్ యువజన సర్వీసులు, క్రీడలు, సాంస్కృతిక శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కొన్ని ఆసుపత్రుల నిర్వాహకులు భారీ మొత్తంలో బిల్లులు వసూలు చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ విషయమై తమకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ విపత్కర పరిస్థితులలో మానవతా దృక్పథంతో వైద్యం చేయాల్సింది పోయి అందినంత దండుకోవడం సమంజసం కాదని మంత్రి పేర్కొన్నారు. ఇకనుండి వైద్యం పేరుతో దోచుకోవడానికి తమ ప్రభుత్వం ఎంతమాత్రం సహించబోమని, స్కానింగ్ 1,999 రూపాయలకే చేయాలని ఆదేశించారు.

ప్రతి ఆస్పత్రిలో తమకు ఉన్న బెడ్ లలో 20 శాతం బెడ్లను పేదలకు కేటాయించి వారి నుండి నామమాత్రం ఫీజులు వసూలు చేయాలని మంత్రి సూచించారు. ప్రాథమిక పరీక్షలు, మందులు, ఆరు రోజుల వైద్యసేవలకు ఆక్సిజన్ లేకుండా 30 వేల రూపాయలు, ఆక్సిజన్ సౌకర్యంతోనైతే 60 వేల రూపాయలు ఫీజులు వసూలు చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇంతకన్నా ఎక్కువ చెల్లించమని అడిగితే సంబంధిత ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఆస్పత్రుల నిర్వహణ తీరును పరిశీలించేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ కమిటీ ద్వారా నివేదికలను ఎప్పటికప్పుడు తెప్పించు ఉంటామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed