New Zealand: ఆర్థిక మాంద్యంలోకి జారిన న్యూజిలాండ్

by S Gopi |
New Zealand: ఆర్థిక మాంద్యంలోకి జారిన న్యూజిలాండ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ద్వీప దేశం న్యూజిలాండ్ దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తాజాగా మూడో త్రైమాసికంలో ఆ దేశ జీడీపీ క్షీణించడంతో మాంద్యంలోకి ప్రవేశించింది. ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో న్యూజిలాండ్ జీడీపీ 1 శాతానికి పడిపోయింది. ఇది మార్కెట్ అంచనాల కంటే తక్కువ. ఆ దేశ ఆర్థిక కార్యకలాపాలు ఊహించిన దానికంటే బలహీనపడటం, న్యూజిలాండ్ డాలర్ రెండేళ్ల కనిష్టానికి పతనం కావడం వల్ల జీడీపీ క్షీణించింది. అంతకుముందు జూన్ త్రైమాసికంలోనూ న్యూజిలాండ్ జీడీపీ 1.1 శాతం కుదేలవడంతో సాంకేతిక మాంద్యంలోకి ప్రవేశించింది. ఈ పరిణామాలతో న్యూజిలాండ్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నాయి. 16 భారీ పరిశ్రమల్లో కీలక నిర్మాణ, తయారీ, సేవలు, వస్తు ఉత్పత్తి రంగాలు భారీగా నష్టాల్లో ఉన్నాయి. తయారీ కంపెనీలు ఉత్పత్తిని సగానికి తగ్గించడంతో పాటు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. వ్యవసాయ రంగం మాత్రమే మెరుగైన వృద్ధిని సాధించగలిగింది. అయితే, న్యూజిలాండ్ ఆర్థికవ్యవస్థ మాంద్యంలోకి జారుతుందని ఎవరూ ఊహించలేదు. నిపుణులు వృద్ధి రేటు 2.4 శాతం నమోదవ్వొచ్చని అంచనా వేసినప్పటికీ, ఇంకా తక్కువే నమోడైంది. ప్రజల ఆదాయం పడిపోవడంతో కొనుగోలు శక్తి క్షీణించింది. ఈ స్థాయి పతనంతో 1991 నాటి మాంద్యం స్థాయిలో జీడీపీ మందగించిందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. అధిక ద్రవ్యోల్బణం వల్ల ఆర్థికవ్యవస్థ ఈ స్థాయిలో క్షీణించిందని న్యూజిలాండ్ ఆర్థిక మంత్రి నికొలా విల్లీస్ చెప్పారు. వచ్చే త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనీ, 2025లో మరింత బలమైన వృద్ధి ఉంటుందని ఆమె అంచనా వేశారు.

Advertisement

Next Story

Most Viewed