స్మృతి మంధాన, రిచా ఘోష్ విధ్వంసం.. టీ20 సిరీస్ మనదే

by Harish |
స్మృతి మంధాన, రిచా ఘోష్ విధ్వంసం.. టీ20 సిరీస్ మనదే
X

దిశ, స్పోర్ట్స్ : అమ్మాయిలు అదరగొట్టారు. వెస్టిండీస్‌పై టీ20 సిరీస్ దక్కాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశారు. నిర్ణయాత్మక మూడో టీ20లో నెగ్గి సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకున్నారు. గురువారం నవీ ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు 60 పరుగుల తేడాతో వెస్టిండీస్‌‌ను మట్టికరిపించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 217/4 స్కోరు చేసింది. టీ20ల్లో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. స్మృతి మంధాన(77), రిచా ఘోష్(54) రెచ్చిపోగా.. రోడ్రిగ్స్(39) రఘ్వి బిస్ట్(31 నాటౌట్) పర్వాలేదనిపించారు. అనంతరం ఛేదనలో భారత స్పిన్నర్ రాధా యాదవ్(4/29)ధాటికి తేలిపోయిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 157/9 స్కోరుకే పరిమితమైంది.

మంధాన, రిచా మెరుపులు.. రాధా స్పిన్ మాయ

మూడో టీ20లో స్మృతి మంధాన, రిచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. గత రెండు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు చేసిన మంధాన మూడో టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. రోడ్రిగ్స్(39), రఘ్వి బిస్ట్(31) సహకారంతో రెచ్చిపోయిన ఆమె..27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. ఆమె తర్వాత రిచా ఘోష్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఎడాపెడా సిక్స్‌లు కొట్టిన రిచా 18 బంతుల్లోనే అర్ధ శతకం బాదింది. దీంతో మహిళల టీ20ల్లో సంయుక్తంగా ఫాసెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేసింది. మంధాన, రిచా విధ్వంసంతో భారత్ పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక స్కోరు చేసింది. మరోవైపు, స్పిన్నర్ రాధా యాదవ్ కూడా భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. 4 వికెట్లతో ప్రత్యర్థిని బెంబేలెత్తించింది. విండీస్‌ బ్యాటర్లు ఆమె స్పిన్ ఉచ్చులో చిక్కుకుని పెవిలియన్ బాట పట్టారు. హెన్రీ(43) టాప్ స్కోరర్. డియాండ్రా డాటిన్(25), హేలీ మాథ్యూస్(22) తక్కువ పరుగులకే వెనుదిరిగారు.

బద్దలైన రికార్డులు ఇవే

రిచా ఘోష్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసింది. మహిళల టీ20ల్లో సోఫీ డివైన్, లిచ్‌ఫీల్డ్‌లతో కలిసి సంయుక్తంగా ఫాసెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును నమోదు చేసింది. భారత్ తరఫున వేగంగా అర్ధ శతకం చేసిన క్రికెటర్‌గా ఘనత సాధించింది.

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో స్మృతి మంధాన చేసిన పరుగులు 193. ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత మహిళా క్రికెటర్‌గా ఆమె నిలిచింది

ఈ ఏడాదిలో టీ20ల్లో మంధాన చేసిన పరుగులు 763. 23 మ్యాచ్‌ల్లో 42.38 సగటుతో ఆమె ఈ రన్స్ చేసింది. ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన మహిళా బ్యాటర్‌గా మంధాన రికార్డు నెలకొల్పింది.

టీ20ల్లో మంధాన 30 సార్లు 50కిపైగా స్కోర్లు చేసింది. న్యూజిలాండ్ దిగ్గజం సుజీ బేట్స్(29 సార్లు)ను వెనక్కినెట్టి మహిళా టీ20 క్రికెట్‌లో అత్యధికసార్లు 50కిపైగా పరుగులు చేసిన క్రికెటర్‌‌గా ఘనత సాధించింది.

Advertisement

Next Story

Most Viewed