క్రీడాహబ్‌గా తెలంగాణ : మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Shyam |
Ministers Srinivas Goud, Mallareddy
X

దిశ, శామీర్‌పేట్: తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడా హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపల్ పరిధిలోని హకీంపేట్‌లో తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలో శనివారం మంత్రి మాల్లారెడ్డితో కలిసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ… క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే క్రమంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాల పనిచేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి నాణ్యమైన పౌష్టికాహారంతో పాటు విద్యను అందిస్తూ క్రీడాల్లో ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. క్రీడా ప్రతిపాదికన ఉద్యోగాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు వివరించారు. రూ.9 కోట్లతో క్రీడా పాఠశాల, రూ.13 కోట్లతో పాఠశాల ప్రాంగణం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు వంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడా పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని వివరించారు.

అనంతరం పాఠశాలలోని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి 350 మందికి మందులు పంపిణీ చేశారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆర్టీసీ సంస్థకు కేటాయించిన స్థలంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని జేఎంసీ కార్పొరేటర్ నిహారిక మంత్రులకు వినతిపత్రం రూపంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాట్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ అధికారి సుజాత, తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్‌డీ హరికృష్ణ, తూముకుంట మున్సిపాలిటీ చైర్మన్ కారంగుల రాజేశ్వర్ రావు, వైస్ చైర్మన్ వాణి వీరారెడ్డి, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేటర్ నిహారిక, కౌన్సిలర్లు, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, ప్రిన్సిపల్ ప్రకాష్, క్రీడాకారి ఆర్కే బోస్, మెడివిజన్ ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ ప్రేమ్ కుమార్, కోచ్‌లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed