ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుంది : మంత్రి

by Sridhar Babu |
ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుంది : మంత్రి
X

దిశ‌, ఖ‌మ్మం: రబీలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు గాను ధాన్యం కొనుగోలు కేంద్రాలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు, లింగాల, పోచవరం గ్రామం, పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. పొలంలో హార్వెస్టర్ ఎక్కి స్వయంగా నడిపి వ‌రికోత‌ను మంత్రి ప్రారంభించారు. అనంత‌రం ఆయన మాట్లాడుతూ… రైతులు ఎవరూ అధైర్య పడొద్దని పండించిన ప్రతిగింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ధాన్యం సేకరణకు రూ.35వేల కోట్లు సమకూర్చిందని తెలిపారు. ఖమ్మం జిల్లాలో 444 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, గ్రామ పంచాయతీల వారీగా దాన్యం కొనుగోలు కేంద్రాలు గుర్తించామని చెప్పారు. గ్రామాల్లో రైతుబంధు సభ్యులు, గ్రామ, మండల స్థాయి కమిటీలు పూర్తి స్థాయిలో పాల్గొని సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల డైరెక్టర్లు, అధ్యక్షులు, సభ్యులు అందరూ సహకారం అందించాలని, పద్ధతి ప్రకారం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పారు. వారి పంట కోసేందుకు జిల్లాలో కొత్త యంత్రాలు సిద్ధంగా ఉన్నాయని, కోతల సమయంలో కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, కోతలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయాలని చెప్పారు. 365 హార్వెస్టర్‌లు జిల్లాలో ఉన్నాయని, వరి కోత యంత్రాలు మండల కేంద్రాల్లో సిద్ధంగా ఉంచుతామని, ఎక్కడికి అవసరమైతే అక్కడికి పంపించే ఏర్పాటు చేసేలా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని, ఎక్కడ సమస్య రాకుండా చూడాలని, రైతులకు నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. మొబైల్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఏమైనా సమస్యలు ఉంటే కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ కు లేదా వ్యవసాయ అధికారులకు చెప్పవచ్చన్నారు. రైస్ మిల్లర్లు ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు ఏర్పాటు చేసుకోవాలని, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లర్ల ను అన్ని రకాలుగా ఆదుకుంటుందని తెలిపారు.

Tags: Minister Puvvada Ajay Kumar, started, paddy harvesting, khammam, formers

Advertisement

Next Story