ఎరువులు ఇవ్వకుంటే ఉద్యమం.. మంత్రి నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Shyam |
Minister Niranjan Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో రైతుల అవసరం మేరకు ఎరువులు సరిపోవడం లేదని మంత్రి నిరంజన్​రెడ్డి పేర్కొన్నారు. ఎరువుల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు స్పష్టం చేశారు. యాసంగిలో 20.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేయనున్నట్టు గతంలో కేంద్రం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. కానీ నెలల వారీగా రావాల్సిన ఎరువులు సకాలంలో అందడం లేదన్నారు. అక్టోబరు, నవంబరు నెలలకు 6.4 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇవ్వాల్సి ఉండగా, కేవలం 3.67 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించినట్లు తెలిపారు. దానిలోనూ ఇప్పటి వరకు 1.55 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అందజేసినట్లు ఆయన వివరించారు.

కేంద్ర కేటాయింపుల ప్రకారం మరో 2.12 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రాష్ట్రానికి రావాల్సి ఉందన్నారు. దీంతో ఎరువుల కొరత తీర్చేందుకు ఇతర దేశాల నుండి వచ్చిన వెసెల్స్ నుండి కేటాయించాలని ఆయన మంగళవారం కేంద్ర మంత్రి మాన్ సుఖ్ మాండవీయ కు లేఖ రాశారు. గన్నవరం పోర్టులోని ఐపీఎల్ కంపెనీ వెసెల్ నుంచి 23 వేల మెట్రిక్ టన్నుల యూరియా ,కాకినాడ, విశాఖ పోర్టులలో ఉన్న ఆర్ సీ ఎఫ్, ఛంబల్, ఐపీఎల్ ఫర్టిలైజర్స్ కు చెందిన వెసెల్స్ నుండి 30 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ కేటాయించాలని పేర్కొన్నారు. క్రిబ్ కో కంపెనీ నుండి రెండు అదనపు రేక్ లు యూరియానూ ఇప్పించాలని కోరారు. అక్టోబర్, నవంబర్ నెలలలో తక్కువగా సరఫరా చేసిన ఎరువులను డిసెంబర్ నుండి మార్చిలో చేసే సరఫరాలో భర్తీ చేయాలన్నారు. లేదంటే తమ రైతులకు సమస్యలు వాటిల్లే అవకాశం ఉన్నదని చెప్పారు. సకాలంలో ఎరువులు ఇవ్వకుంటే రైతులతో కలసి ఉద్యమిస్తామని మంత్రి నిరంజన్​రెడ్డి నొక్కి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed