అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ​ఇండ్లు: మల్లారెడ్డి

by Shyam |
అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ​ఇండ్లు: మల్లారెడ్డి
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కృషి చేస్తోందని, అర్హులందరికీ డబుల్​బెడ్రూం ఇండ్లు అందజేస్తామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్ ​కలెక్టరేట్​లో కలెక్టర్ శ్వేతా మహంతితో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పలు అభివృద్ధి పనులపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇల్లు లేని ప్రతీ ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని అన్నారు. ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. జవహార్ నగర్ లో ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించామని, వాటిని న్యాయబద్ధంగా దివ్యాంగులకే అందేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలోని అర్బన్, రూరల్ ప్రాంతాల నుంచి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి ? వాటిలో అర్హులను ఎంత మందిని గుర్తించారు ? డబుల్ బెడ్రూమ్ నిర్మాణాల పురోగతి ఎలా ఉంది అని పూర్తి వివరాలను సంబంధిత శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్రూమ్ నిర్మాణాల పనులు ఇప్పటికే పూర్తి కావాలని, కరోనా నేపథ్యంలో ఆలస్యమైందన్నారు. ప్రస్తుతం పనులను వేగవంతం చేసేలా సంబంధిత కాంట్రాక్టర్లతో సమావేశాలు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. కలెక్టర్ శ్వేతా మహంతి మాట్లాడుతూ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. ప్రత్యేక బృందాలతో క్షేత్ర పరిశీలన నిర్వహించాలని, ఇందుకు సంబంధించి జాబితాను తయారు చేయాలని ఆర్డీవో రవిని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు విద్యాసాగర్, శ్యాంసన్, డీఆర్వో లింగ్యా నాయక్, ఆర్డీవో రవి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed