- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రత్యామ్నాయంతోనే అధిక లాభాలు.. రైతులకు కేటీఆర్ కీలక సూచన
దిశ, సిరిసిల్ల : ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా రైతులు అధిక శాతం లాభాలను గడించవచ్చని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగులో పని తక్కువ, ఫలితం ఎక్కువగా ఉంటుందని, తెలంగాణ రాష్ట్రం మరింత స్వయం సమృద్ధి సాధించాలంటే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ విస్తరణ అధికారులను మంత్రి ఆదేశించారు. సోమవారం సిరిసిల్ల కలెక్టరేట్‌లో 2021-22 యాసంగి పంటల మార్పిడిపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో పంట మార్పిడి, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా కలిగే లాభాలను రైతులకు తెలియ జేయడం, తదితర అంశాలపై మంత్రి వ్యవసాయ విస్తరణ అధికారులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైనదిగా మారిందని, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా రైతులకు చాలా లాభసాటిగా ఉంటుందని, తక్కువ పనితో ఎక్కువ ఫలితం పొందడం ప్రత్యామ్నాయ పంటల సాగు ద్వారానే సాధ్యమవుతుందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రం మరింత స్వయం సమృద్ధి సాధించాలంటే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులను ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు ప్రోత్సహించాలని ఆదేశించారు.
ధాన్యాన్ని పండించడంలో తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశానికే భాండాగారంగా మారిందని, 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని అన్నారు. గతేడాది యాసంగిలో ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, సిరిసిల్లలో గత సంవత్సరం కంటే ఈఏడాది అదనంగా లక్ష ఎకరాలు ధాన్యం పండిందన్నారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డు బియ్యాన్ని కొనుగోలు చేయమని తేల్చి చెప్పిందని మంత్రి తెలిపారు. రైతులు వచ్చే యాసంగి పంట కాలంలో వరి కాకుండా ఇతర ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసేలా వ్యవసాయ అధికారులు ప్రోత్సాహించాలని సూచించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 9 లక్షల పైచిలుకు రైతన్నలకు రుణమాఫీ చేయడం జరిగిందని వెల్లడించారు. ఒకప్పుడు కరువు ప్రాంతమైన సిరిసిల్లలో ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్ళు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
ఎగువ మానేరు జలాశయం, అన్నపూర్ణ జలాశయం, శ్రీ రాజరాజేశ్వర జలాశయాల ద్వారా జిల్లాలో భూగర్భ జలాల సామర్థ్యం గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు. మల్కపేట జలాశయం నిర్మాణం పూర్తయితే భూగర్భ జలాల సామర్థ్యం మరింతగా పెరిగే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో మొత్తం 666 చెరువులు ఉన్నాయని, ఇందులో 85 శాతం చెరువులు ఎప్పటికీ నిండి ఉండేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. తెలంగాణలో హరిత విప్లవం, నీలి విప్లవం, శ్వేత విప్లవం, గులాబీ విప్లవాలు ఆవిష్కృతమయ్యానని మంత్రి తెలిపారు. 4 లక్షల 72 వేల 329 ఎకరాలు మన జిల్లా భూభాగం కాగా, అందులో సాగుకు అనుగుణంగా ఉన్నది 2 లక్షల 48 వేల ఎకరాలని తెలిపారు.
ఆయిల్ పామ్ పంట సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని అన్నారు. జిల్లాలోని 57 క్లస్టర్‌ల పరిధిలో సగటున వంద ఎకరాల ఆయిల్ పామ్ పంట సాగు చేసేలా ప్రతీ వ్యవసాయ విస్తరణ అధికారి రైతులను ప్రోత్సహించాలని, రైతు వేదికల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి అవగాహన సమావేశాలు నిర్వహించాలని అన్నారు. సంయమనం, ఓపికతో రైతులకు ఆయిల్ పామ్ పంట సాగుతో వచ్చే లాభాలను వ్యవసాయ విస్తరణ అధికారులు వివరించాలని మంత్రి సూచించారు. వేరుశనగ, కందులు, పొద్దు తిరుగుడు, కూరగాయలు, ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా దిశానిర్దేశం చేయాలన్నారు.
మోహినికుంట గ్రామంలో పదిహేను ఎకరాల స్థలం తీసుకుని తాను కూడా స్వయంగా ఆయిల్ పామ్ పంటను సాగు చేస్తానని మంత్రి వెల్లడించారు.సెప్టెంబర్ నెలాఖరు కల్లా జిల్లాలోని 57 క్లస్టర్లలో లో 57 సమావేశాలు ప్రణాళిక ప్రకారం ప్రత్యామ్నాయ పంటల సాగుపై జరగాలని అన్నారు.వ్యవసాయ విస్తరణ అధికారులు ముఖ్యంగా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుండాలని మంత్రి సూచించారు. ఎల్లారెడ్డిపేట మండలంలో ఏర్పాటు చేసిన కస్టమ్ హైరింగ్ సెంటర్ మాదిరిగా జిల్లాలో మరొక 5 కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ప్రత్యామ్నాయ పంటల సాగుకు అనుగుణంగా రైతులు ఏ విధమైన పంటలు సాగు చేయాలని అనుకుంటున్నారు అనే విషయాన్ని రాబోయే 15 రోజుల్లోగా జిల్లా యంత్రాంగానికి తెలపాలని, తద్వారా విత్తనాలను సమకూర్చుకోవడంలో ఇబ్బంది లేకుండా ఉంటుందని అన్నారు.క్లస్టర్ వారీగా ఏ గుంటలో, ఏ ఎకరంలో ఏయే పంటలు సాగు అవుతున్నాయనే విషయం స్పష్టంగా తెలియాలన్నారు. క్లస్టర్‌కు ఎంతమంది రైతులు ఉన్నారనే విషయంపై కూడా వ్యవసాయ విస్తరణ అధికారులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు.