రాజకీయాల నుంచి తప్పుకుంటా.. మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2021-09-30 07:02:55.0  )
రాజకీయాల నుంచి తప్పుకుంటా.. మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
X

దిశ, ఏపీ బ్యూరో: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై మంత్రి కొడాలి నాని తనదైన స్టైల్‌లో విరుచుకుపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌కల్యాణ్ జీవితంలో సీఎం జగన్‌ను ఓడించలేరని చెప్పుకొచ్చారు. జగన్‌ను మాజీ ముఖ్యమంత్రిని చేస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానంటూ సవాల్ విసిరారు. ఇంతకీ పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా గెలుస్తాడో లేదో చూసుకోవాలంటూ ఎద్దేవా చేశారు.

‘2024 లో నువ్వు ఏం చేస్తావో చూద్దాం. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌తో కలిసి వచ్చినా తమను ఓడించలేరంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు వైసీపీ నాయకులకు భయం అంటే ఏంటో చూపిస్తానన్న పవన్ వ్యాఖ్యలపైనా ఘాటుగా స్పందించారు. మమ్మల్ని భయపెట్టే దమ్ము, ధైర్యం పవన్‌కు లేదన్నారు. ఇంకో జానీ సినిమా చూపించి భయపెడతావా అంటూ ప్రశ్నించారు. పవన్‌ను చూసి ఆయన అభిమానులు భయపడతారేమో కానీ, సీఎం జగన్‌ గానీ.. వైసీపీ కార్యకర్త గానీ భయపడరంటూ స్పష్టం చేశారు. ఆనాడు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకే జగన్ భయపడలేదని..నువ్వు భయపెడితే భయపడతాడా అంటూ కొడాలి నాని మండిపడ్డారు. చంద్రబాబు బూట్లు నాకే వ్యక్తి పవన్‌ కల్యాణ్ అంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఇచ్చే స్క్రిప్ట్‌లు చదివి భయపెడతాడేమోనంటూ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు.

Advertisement

Next Story