హుజూరాబాద్‌లో నామినేషన్లు పెంచుతూ ఈటల కుట్రలు: హరీష్ రావు

by Sridhar Babu |
హుజూరాబాద్‌లో నామినేషన్లు పెంచుతూ ఈటల కుట్రలు: హరీష్ రావు
X

దిశ, హుజూరాబాద్: ఓటమి భయంతోనే అధిక సంఖ్యలో నామినేషన్లు సమర్పించడానికి ఈటల కుట్ర పన్నారని మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. మండలంలోని ధర్మరాజ్ పల్లి, పెద్దపాపయ్యపల్లి, కందుగుల, కాట్రపల్లి, పోతిరెడ్డిపేట గ్రామాలలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సభల్లో హరీష్ రావు మాట్లాడుతూ.. ఎంపీగా గెలిచినా బండి సంజయ్ రెండేళ్లు గడిచినా.. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏం చేశారని ప్రశ్నించారు. ఓ మంత్రిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని రాజేందర్ ఎమ్మెల్యేగా గెలిచి సాధించేదేమిటన్నారు.

కేసీఆర్ దయతోనే ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు, మంత్రిగా అవకాశాలు వచ్చిన సంగతి మరచి.. ఆయనకే సమాధి కడుతానని అనడం ఈటలకు సబబేనా అని నిలదీశారు. ముఖ్యమంత్రిపై రాజేందర్ అవాక్కులు-చెవాక్కులు పేల్చడం తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన చందంగా ఉందని హరీష్ రావు దుయ్యబట్టారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు తెలంగాణ రాష్ట్రంలో తప్పా.. బీజేపీ పాలిత రాష్ట్రాలలో అమలు చేస్తున్నారా చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్న బీజేపీ కావాలో.. నిత్యం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న కేసీఆర్ ప్రభుత్వం కావాలో నిర్ణయించుకోవాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed