- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అర్హులైన ప్రతిఒక్కరికి ఆసరా, రైతు భీమా’
దిశ, సిద్దిపేట: సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా ఆసరా పెన్షన్ అర్హత వయస్సు 57కు తగ్గించారని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం అందాలన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. ఈ నేపథ్యంలో 57 ఏండ్ల నిండిన వృద్ధులతో పాటు ఆసరా పెన్షన్ క్రింద అర్హులై ఉండి పెన్షన్ లు రాని దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోధకాల వ్యాధిగ్రస్తులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల లో అర్హులైన వారు ఆసరా పెన్షన్ లకు దరఖాస్తు చేసుకునేలా స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. అలాగే రైతుభీమాకు అర్హులై ఉండి భీమాలో నమోదు కానీ రైతులందరినీ ఈ నెలాఖరులోగా నమోదు అయ్యేలా చూడాలన్నారు. ఆదివారం జిల్లాలోని పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యే, ఎంఎల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు మొత్తం 2 వేల మంది తో సిద్దిపేట నుండి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అర్హత కలిగిన వారిని ఆసరా పథకం, రైతు బీమా పథకం లో నమోదు పై ప్రజా ప్రతినిధులు, అధికారులకు మంత్రి హరీశ్ రావు దిశా నిర్దేశం చేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ 57 ఏండ్లు నిండిన వృద్ధులలో అర్హులకు ఆసరా పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేయగా దరఖాస్తుల స్వీకరణ చేపట్టిందన్నారు. 57 ఏండ్లు నిండి అర్హులైన వృద్ధులతో పాటు ఆగస్టు 31వ తేదీ వరకు మీ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని మంత్రి తెలిపారు. ఆసరా పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారి నుంచి ఒక్క రూపాయి కూడ సర్వీసు రుసుం వసూలు చేయొద్దని ప్రభుత్వం విస్పష్ట ఆదేశాలను జారీ చేసిందన్నారు. ప్రభుత్వమే మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు డబ్బులు చెల్లిస్తుందన్నారు. దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ మాత్రమే 57 సంవత్సరాల వయస్సు నిండిన వారికి పెన్షన్ అందించే ఆలోచన చేశారన్నారు. మరింత మందికి ఆసరా పెన్షన్ అందించాలని వృద్దాప్యంలో పెద్ద కొడుకులా పండుటాకులకు అండగా ఉండాలన్న ఉద్దేశంతోనే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
సిద్దిపేట జిల్లాలోనీ 23 మండలాల్లో ఇప్పటికే 1 లక్షా 77 వేల 608 మంది ఆసరా పెన్షన్ లు పొందుతున్నారని అన్నారు. వీరికి ప్రతి నెలా 37 కోట్ల 29 లక్షల రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందాలన్నది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆశయం అని, సీఎం ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తూ సిద్దిపేట జిల్లాలో ఈ నెలాఖరులోగా అర్హులైన వారందరినీ ఆసరా పథకంతో పాటు రైతు బీమా పథకంలో నమోదు అయ్యేలా సర్పంచ్, ఎంపీటీసీ, కార్యదర్శి, కౌన్సిలర్స్, మున్సిపల్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు.
అర్హత క్రింద బోగస్, తప్పుడు ఆధార్ కార్డులు పలువురు వ్యక్తులు అక్కడక్కడ సమర్పిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ సాగుతుందన్నారు. ఆధార్ లో ఉద్దేశ్య పూర్వకంగా వయస్సు ఎక్కువ ఉన్నట్టు సవరణ చేసినా, బోగస్ కార్డులు సృష్టించినట్లు తేలినా బాధ్యులపై చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు. ప్రపంచలోనే రైతులకు బీమాతో ధీమా కల్పించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. భూమి మీద రైతుకు భీమా కల్పించిన ఘనత ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో ప్రారంభమైన రైతు భీమా నాలుగో సంవత్సరంలోకి అదిగిడుతుందన్నారు.
జిల్లాలో 2020-21 ఆర్ధిక సంవత్సరంలో 1 లక్షా 68 వేల 80 మంది రైతులను ఈభీమా క్రింద నమోదు చేశారని మంత్రి తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 763 మంది రైతులు అకాల మరణం చెందితే వారి వారసులకు 38 కోట్ల 15 లక్షల భీమా పరిహారం ప్రభుత్వము చెల్లించిందన్నారు. తడి, పొడి చెత్తను వేరు వేరు గా సేకరించి ప్రతి డంప్ యార్డ్ లో కంపోస్ట్ చేయాల్సిందే అన్నారు. జిల్లాలో అక్కడక్కడ మిగిలిన అసంపూర్తి వైకుంఠ ధామాలు, రైతు వేదికలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రతి రైతు వేదికలో కనీసం వారానికి ఒకసారైనా రైతు చైతన్య సమావేశాలు జరిగాలన్నారు. వీటి పురోగతిని పరిశీలించేందుకు తాను, జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో ఆకస్మిక పర్యటనలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
సాగునీటి సౌలభ్యం పెరగడంతో వరి పంట సాగు విస్తీర్ణం పెరుగుతుందన్నారు. ప్రధానంగా దొడ్డు వరి అధిక సాగు చేయడం వల్ల ఆ మేరకు వచ్చే దిగుబడులను కేంద్రం కొనేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. ఫలితంగా గోదాముల్లో నిల్వలు పేరుకుపోతున్నయన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, అంతర్జాతీయ డిమాండ్ నేపథ్యంలో రైతులు ప్రత్తి, కందుల సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు. అదే విధంగా లాభదాయకమైన ఆయిల్ ఫామ్, మల్బరీ సాగును సాధ్యమైనంత ఎక్కువ మంది రైతులు చేపట్టేలా ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు చైతన్యం చేయాలన్నారు.జిల్లాలో ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. జిల్లా అవసరాలకు సరిపడా స్టాక్ పెట్టుకోవాలన్నారు.
జిల్లాలోని మున్సిపాలిటీ లలో భవన నిర్మాణ అనుమతుల్లో జాప్యం జరగకుండా జిల్లా అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ లు ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు.ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీ కి వైకుంఠ ధామం, ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ మంజూరు చేసినందున నిర్మాణం స్థలం, డిజైన్ లు ఫైనల్ చేసి వెంటనే పనులు ప్రారంభించేలా చూడాలని మంత్రి అధికారులను అదేశించారు. జిల్లా కలెక్టర్ పి వెంకట్రామ రెడ్డి మాట్లాడుతూ… అర్హులందరూ ఆసరా పెన్షన్, రైతు భీమా పథకంలో నమోదు అయ్యేలా చూస్తామని తెలిపారు. టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీమతి రోజా రాధాకృష్ణ శర్మ, ఎంఎల్సీలు ఫారుక్ హుస్సేన్, వేంకటేశ్వర్లు, శాసన సభ్యులు రసమయి బాలకిషన్, రఘునందన్ రావు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు నాగి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.