- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సిద్దిపేట అడ్డాగా హుజురాబాద్ పాలిటిక్స్.. హరీశ్ మంతనాలు ఫలించేనా.?
దిశ ప్రతినిధి, మెదక్ : హుజురాబాద్‌లో కనిపించాల్సిన పొలిటికల్ హీట్ సిద్దిపేటలో కనిపిస్తోంది. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమ వేదికగా నిలిచిన సిద్దిపేట.. ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నికకు అడ్డాగా మారింది. ప్రతిపక్ష పార్టీలు హుజురాబాద్‌లో ప్రచారం చేస్తుండగా.. అధికార పార్టీ మాత్రం సిద్దిపేట వేదికగా హుజురాబాద్ ప్రచారాన్ని మొదలు పెట్టింది. ఇప్పటికే మంత్రి హరీశ్ రావు పలు కుల సంఘాలతో చర్చలు జరిపారు. తాజాగా గురువారం సిద్దిపేట యాదవ సంఘంలో యాదవ, కుర్మ సంఘం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం హజరయ్యారు. హుజురాబాద్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న తపనతో అడిగిందే తడవుగా నియోజక వర్గ ప్రజలకు హామీల వర్షం కురిపిస్తున్నారు.
సిద్దిపేట వేదికగా హుజురాబాద్ రాజకీయం..
హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నికల ఇంఛార్జీగా ఉన్న మంత్రి హరీశ్ రావు.. సిద్దిపేట వేదికగా హుజురాబాద్ రాజకీయ చక్రం తిప్పేందుకు యత్నిస్తున్నారు. ఇందుకు సిద్దిపేట పట్టణంలోని రెడ్డి సంక్షేమ సంఘ భవనం, యాదవ సంఘం, రంగనాయక సాగర్ గెస్ట్ హౌజులను వేదికగా చేసుకున్నారు. రోజుకో చోట హుజురాబాద్ ప్రజల్ని రప్పించుకొని కార్యకర్తలు, సామాన్య ప్రజానీకానికి ఎన్నికల్లో గెలవడానికి చేయాల్సిన కార్యక్రమ వివరాలను వివరిస్తున్నట్టు సమాచారం.
కార్యకర్తల్లో జోష్ నింపే యత్నం..
హుజురాబాద్ కార్యకర్తలు, పార్టీ ముఖ్య నాయకులు, కుల సంఘాల ప్రముఖులతో సమావేశమవుతున్న మంత్రి హరీశ్ రావు.. ఆకట్టుకునే ప్రసంగాలతో వారిలో చైతన్యం నింపేందుకు శ్రమిస్తున్నారు. తాజాగా యాదవ సంఘం సమావేశంలో మాట్లాడుతూ.. ఒకప్పుడు హుజురాబాద్ రక్తం పారిన నేల అని.. రక్తం పారిన నేలపై కాళేశ్వరం నీళ్లు పారించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ మతతత్వ పార్టీతో కలిసి మళ్లీ మాట కలహాలు సృష్టించాలని, రక్తం పారాలని చూస్తున్నాడంటూ ఘాటైన వ్యాఖ్యలే చేశారు. నేనెమైనా తప్పు మాట్లాడితే ఇక్కడే నన్ను నిలదీయండి అంటూ కూడా మాట్లాడటంతో అక్కడున్న వారంతా సైలెంట్ అయిపోయారు. ఇలా ఒక్కో రోజు.. ఒక్కో కుల సంఘంతో సమావేశం నిర్వహిస్తూ వారిలో చైతన్యం నింపేందుకు కృషి చేస్తున్నారు.
యాదవ సంఘ సమావేశంలో మంత్రులు..
హుజురాబాద్ నియోజక వర్గానికి చెందిన యాదవ సంఘం, కురుమ సంఘం సభ్యులు, నాయకులతో బుధవారం సిద్దిపేట పట్టణంలోని యాదవ సంఘంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు హజరయ్యారు. ఈ సందర్భంగా యాదవ సంఘానికి, కురుమ సంఘానికి కల్యాణ మండపం కట్టుకోవడానికి చెరో ఎకరం కేటాయించారు. వాటి నిర్మాణానికి చెరో 2కోట్ల చొప్పున రూ. నాలుగు కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు అందించారు. అనంతరం యాదవ సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఇద్దరు మంత్రులు వివరించారు.
హుజురాబాద్‌కు హామీల వర్షం..
దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమిని చవి చూసిన టీఆర్ఎస్.. ఈ సారి అలాంటి తప్పులు చేయకుండా ముందస్తుగానే ప్రత్యేక ప్రణాళిక రచిస్తోంది. హుజురాబాద్‌లో ఎలాగైనా ఈటలను ఓడగొట్టాలనే సంకల్పంతో పనిచేస్తున్న అధికార టీఆర్ఎస్.. ఇప్పటికే హుజురాబాద్‌కు పలు హామీలు గుప్పించింది. ఇంకా హామీల వర్షం కురిపిస్తోంది. హుజురాబాద్‌లో నెలకొన్న సమస్యలపై దృష్టి సారిస్తూ వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఒక పక్క పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూనే.. మరో పక్క హుజురాబాద్‌లో చేయాల్సిన అభివృద్ధి పనులకు నిధుల వర్షం కురిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇంటలిజెన్స్ ద్వారా రిపోర్టు తెచ్చుకుంటూ హుజురాబాద్ రాజకీయ పరిస్థితిపై లెక్కలేస్తున్నారు. టీఆర్ఎస్ బలహీనంగా ఉన్న చోట ప్రత్యేక కార్యచరణను రచిస్తున్నారు. పలు కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్స్, కల్యాణ మండపాలు, ఆధునిక రోడ్లు, ఇలా అనేక హామీలు ఇస్తూ పోతున్నది. మున్ముందు ఇంకెన్ని హామీలు ఇస్తుందో చూడాలి.