Silver Hallmarking: త్వరలో వెండి ఆభరణాలకూ తప్పనిసరి హాల్‌మార్కింగ్

by S Gopi |   ( Updated:2025-01-06 13:45:58.0  )
Silver Hallmarking: త్వరలో వెండి ఆభరణాలకూ తప్పనిసరి హాల్‌మార్కింగ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: వెండి ఆభారణాలకు కూడా హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేయాలని వినియోగదారుల నుంచి డిమాండ్ వినిపిస్తోందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. సోమవారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) 78వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. వెండి, వెండి ఆభరణాలకు తప్పనిసరి హాల్‌మార్కింగ్‌ను అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. దీనికి సంబంధించి ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని, బీఐఎస్ ద్వారా భాగస్వాములతో సంప్రదింపులు జరిపి, సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి చెప్పారు. దీని కోసం ఆరు నెలల సమయం అవసరమని బీఐఎస్ అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం వెండి ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ వాలెంటరీగా ఉంది. కాగా, 2021, జూన్‌లో దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాలకు బీఐఎస్ హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. అధికారిక అంచనాల ప్రకారం, ఇప్పటివరకు 44.28 కోట్లకు పైగా బంగారం, ఆభరణాలు, కళాఖండాలకు హాల్‌మార్క్ చేశారు.

Advertisement

Next Story