ఇచ్చిన మాట ప్రకారం.. న్యాయం చేస్తాం : మంత్రి

by Shyam |
ఇచ్చిన మాట ప్రకారం.. న్యాయం చేస్తాం : మంత్రి
X

దిశ, ముషీరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తామని, రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న రేషన్ షాపులను త్వరలో భర్తీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, బీసీ సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రజలకు, రేషన్ డీలర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపడతామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 33 జిల్లాల రేషన్ డీలర్ల సర్వసభ్య సమావేశం మంగళవారం ముషీరాబాద్ లోని ఆర్యవైశ్య భవన్‌లో జరిగింది. సంఘం అధ్యక్షుడు నాయకోటి రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డితో కలసి నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా 17వేల రేషన్ షాపులు ఉన్నాయని, వీటిపై 50వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. రేషన్ డీలర్ల కమీషన్‌పై సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రస్తావించారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ తప్పకుండా రేషన్ డీలర్ల కమిషన్ డబ్బులను పెంచుతారని, ఇతర రాష్ట్రాల మాదిరిగా రేషన్ డీలర్ల కమిషన్ డబ్బులు పెంచేందుకు చర్యలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. కరోనా కారణంగా దేశంలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నందు వల్ల కమీషన్ పెంపు విషయంలో జాప్యం జరిగిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ రేషన్ డీలర్లకు న్యాయం చేసేవిధంగా నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఈ పాస్ మిషన్‌లను మరింత ఆధునీకరించి పౌరసరఫరాల వ్యవస్థను మరింత మెరుగుపరుస్తామని చెప్పారు.

Advertisement

Next Story