'నిమ్స్'లో సేవలు మరింత మెరుగుపడాలి: ఈటల

by Shyam |
నిమ్స్లో సేవలు మరింత మెరుగుపడాలి: ఈటల
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంలో ప్రముఖ ‘నిమ్స్’ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలపై మంత్రి ఈటల రాజేందర్ సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. అత్యవసర సేవల కోసం వచ్చే పేషెంట్లకు ప్రస్తుతం ఆసుపత్రిలో అందుతున్న సేవలను అడిగి తెలుసుకుని మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. పేషెంట్లు గంటలకొద్దీ వెయిట్ చేసే పరిస్థితి తప్పనిసరిగా మారాలని, ఆపద సమయంలో వచ్చినా బెడ్ కోసం, అడ్మిషన్ కోసం దేవుని మీద ఆధారపడే పరిస్థితి ఉండొద్దని స్పష్టం చేశారు. పేషెంట్ల ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడంలో వారి కుటుంబ సభ్యులు, అటెండెంట్లు చాలా అవస్థలు పడుతున్నారని, ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని వివరించడం ద్వారా సగం టెన్షన్ తగ్గుతుందని అన్నారు.

‘నిమ్స్’ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మనోహర్, సూపరింటెండెంట్ సత్యనారాయణ, నిపుణుల కమిటీ సభ్యులు డాక్టర్ గంగాధర్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ తదితరులందరితో మంత్రి సమీక్షించారు. మొదటిసారిగా ‘నిమ్స్’ ఆసుపత్రిలోని వివిధ విభాగాల అధిపతులతో కూడా వాటి తరపున అందుతున్న వైద్య సేవల గురంచి మంత్రి ఆరా తీశారు. ప్రజలపై భారం పడకుండా మూత్రపిండాలు, గుండె, కాలేయం, రుమటాలజీ వైద్య సేవలను అందించడంలో ‘నిమ్స్’ సరికొత్త గుర్తింపును తెచ్చుకోవాలని, ఇప్పుడు అందుతున్న సేవలు మరింత మెరుగుపడాలని సూచించారు.

గుండె రంధ్రాలు, చిన్న వయసులోనే కిడ్నీ సమస్యలు,లివర్ ఫెయిల్యూర్, బ్రెయిన్ హెమరేజ్ లాంటి ఎన్నో అనారోగ్య సమస్యలకు చికిత్సలను సకాలంలో అందించగలిగితే 70శాతం పరిష్కారం అయినట్లేనని మంత్రి నొక్కిచెప్పారు. ‘నిమ్స్’కి వచ్చిన ప్రతీ పేషంటుకు చికిత్స అందించాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చినవారు గంటలకొద్దీ వేచిచూసే పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ‘నిమ్స్’ పేరును మరింత ఇనుమడింపచేసేలా డాక్టర్స్ అందరూ పనిచేయాలని కోరారు.

పేషంట్‌కి, పేషంట్ అటెండెంట్‌కి డాక్టర్లు, కౌన్సిలర్లు ఎప్పటికప్పుడు పేషంట్ కండిషన్‌ను వివరించాలని సూచించారు. వారితో ఆసుపత్రి సిబ్బంది ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడాలని సూచించారు. ప్రతి ఆసుపత్రిలో పేషంట్ కౌన్సిలర్స్ ఉంటే మెరుగైన ఫలితాలు వస్తాయని మంత్రి అన్నారు. ఏడున్నర వేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో 80వేల సిబ్బందితో అనునిత్యం ప్రజలతో సంబంధం ఉన్న శాఖ వైద్య ఆరోగ్య శాఖ అని నొక్కిచెప్పారు. ఈ శాఖను మరింత చేరువ చేయాల్సిన భాధ్యత మనందరిదీ అని అన్నారు.

Advertisement

Next Story