నేటి నుంచి మినీ మేడారం జాతర

by Shyam |
నేటి నుంచి మినీ మేడారం జాతర
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: ఆసియాలో అతిపెద్ద గిరిజ‌న జాత‌ర‌గా ప్రఖ్యాతిగాంచిన మేడారం మినీ జాత‌ర నేటి నుంచి ప్రారంభం కానుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో నాలుగు రోజులపాటు జరిగే మినీ మేడారం జాతరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. మండామేలిగే పండుగ సందర్భంగా అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కానీ అమ్మవార్లు గద్దెపైకి రార‌ని పూజారులు పేర్కొన్నారు.

మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఆరంభం

మినీ మేడారం మండమేలిగే పండుగ సందర్భంగా అమ్మవార్లను గ‌ద్దెల‌పైకి తీసుకురారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం మహాజాతర తరువాత మరుసటి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమి రోజున మండ మెలిగే పండగ నిర్వహించడం ఆనవాయితీ. మండ మెలిగే పండగ సందర్భంగా మేడారంలోని సమ్మక్క గుడి, క‌న్నెప‌ల్లిలోని సారలమ్మ గుడిలతో పాటు గోవిందరాజులు, పగిడిగిద్ద రాజు ఆలయాలను పూజారులు శుద్ధి చేస్తారు. అనంత‌రం వనదేవతలకు పూజలు నిర్వహిస్తారు. మొదటి రోజు బుధవారం వనదేవతల ఆలయాలను శుద్ధిచేసి, పసుపుకుంకుమలతో ముగ్గులు వేసి అందంగా అలంకరిస్తారు. గ్రామరక్షణ కోసం మేడారం గ్రామానికి ఇరువైపులా ద్వారా బంధాలు ఏర్పాటు చేసి రక్షాతోరణాలు కడతారు. బుధవారం రాత్రి మేడారం గద్దెల ప్రాంగణంలో సమ్మక్క, సారలమ్మల వడ్డె పూజారులు కుటుంబ సభ్యులతో వనదేవతలకు పూజలు చేస్తూ జాగారం చేస్తారు.

అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి

మినీ మేడారం జాత‌ర‌కు చేరుకునేందుకు భ‌క్తుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఆర్టీసీ హ‌న్మకొండ‌, వ‌రంగ‌ల్‌తో పాటు హైద‌రాబాద్ నుంచి ప్రత్యేక స‌ర్వీసులు న‌డుపుతోంది. హ‌న్మకొండ‌, వ‌రంగ‌ల్ నుంచి ప్రతీ 20 నిముషాల‌కు ఒక బ‌స్సు న‌డిచేలా ఆర్టీసీ అధికారులు చ‌ర్యలు తీసుకుంటున్నారు. ఆన్‌లైన్ టికెట్ రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించారు. మినీ మేడారం జాతరను పురస్కరించుకుని ములుగు జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసింది. డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, ఏఆర్, ఏపీఎస్పీ విభాగాలు కలిపి సుమారు 750 మంది వ‌ర‌కు పోలీసు అధికారులను, సిబ్బందిని విధుల కోసం నియమించారు. పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం జిల్లా యంత్రాంగం మంచినీరు, స్నానఘట్టాలు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసింది. జాతరకు తరలివచ్చే భక్తులకు సత్వరం అమ్మవార్ల దర్శనం కలిగేలా బారికేడ్లు ఏర్పాటు చేశారు. భక్తులు సమర్పించే మొక్కుల కోసం దేవాదాయశాఖ అధికారులు ఇప్పటికే గద్దెల వద్ద, సమీప ప్రాంతాల్లో హుండీలను ఏర్పాటు చేశారు. మినీ మేడారం జాత‌ర‌కు దాదాపు 5 ల‌క్షల మంది భ‌క్తులు వ‌స్తార‌ని అంచ‌నా వేస్తున్నారు.

మండామేలిగే పండుగ కార్యక్రమ వివరాలు

24న గుడిశుద్ధి, పూజలు, గ్రామనిర్బంధన
25న గద్దెలకు పసుపు, కుంకుమార్చన
26న అమ్మవార్ల గద్దెల‌ను భక్తులకు దర్శనం
27న మినీ జాతర ముగింపు

Advertisement

Next Story

Most Viewed