మహిళలపై మైండ్‌సెట్ మారాలి: సుప్రీం

by Shamantha N |
మహిళలపై మైండ్‌సెట్ మారాలి: సుప్రీం
X

ఆర్మీలో మహిళా అధికారులను కమాండ్ విధుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మహిళ అనే కారణంగా కమాండ్ పోస్టుకు దూరం పెట్టడం వారికే కాదు. భారత ఆర్మీ, దేశ గౌరవానికీ భంగమని తెలిపింది. మహిళల శారీరక లక్షణాలకు వారి హక్కులకు సంబంధముండదని, వారి పట్ల సర్కారు ఆలోచనా ధోరణి(మైండ్‌సెట్) మారాలని హితవు పలికింది. లింగవివక్షను వీడి ఆర్మీలోనూ కమాండ్ రోల్స్‌లోకి మహిళా అధికారులను తీసుకోవాలని ఆదేశించింది. పర్మనెంట్ కమిషన్ రూల్స్ పరిధిలోకి తమను తీసుకోవాలని కోరుతూ కొందరు మహిళా అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ విచారిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అజయ్ రస్తోగీల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

2019 సెప్టెంబర్ వరకు ఆర్మీ ఎడ్యుకేషన్ కార్ప్స్, జడ్జి అడ్వకేట్ జనరల్ బ్రాంచ్.. ఈ రెండు విభాగాల్లో మాత్రమే మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ కింద అవకాశముండేది. కానీ, ఆ ఏడాది సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం కమాండ్ అసైన్‌మెంట్స్ ఉండే మరో పది డిపార్ట్‌మెంటుల్లో పర్మినెంట్ కమిషన్‌ అవకాశాన్ని మహిళా అధికారులకు ఆప్షన్‌గా ఇచ్చింది. ఇందులో మహిళా అధికారులకు కమాండ్ రోల్స్‌నూ చేపట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే శాశ్వత కమిషన్‌కు సంబంధించి ఆర్మీలో మహిళాఅధికారులు ఆదేశిస్తే పురుషులు స్వీకరించకపోవచ్చని కేంద్రం తెలిపింది.

ఆర్మీలో పురుషులు చాలామంది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినవారు ఉండటంతో మహిళల ఆదేశాలను వారు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండకపోవచ్చని ఈ పిటిషన్ విచారణలో భాగంగా సుప్రీంకోర్టుకు కేంద్రం సమాధానమిచ్చింది. మహిళల శారీరక లక్షణాలు, బలహీనతలు, ఒకవేళ శత్రుచేతికి చిక్కితే ఉండే మానసిక స్థితిపై ఆందోళనలు వ్యక్తం చేస్తూ మహిళలు కమాండ్ పోస్టుకు సరిపోరన్నట్టుగా అభిప్రాయపడింది. కాగా, కేంద్రం స్పందనపై సుప్రీంకోర్టు మండిపడింది. మహిళల శారీరక లక్షణాలకు వారి హక్కులతో సంబంధం లేదని, ఆర్మీలో అద్భుతమైన సేవలందించిన మహిళా అధికారులున్నారని తెలిపింది. ఆర్మీలో మహిళలు చేరడం ఒక పరిణామక్రమ ప్రక్రియ అని పేర్కొంది. లింగ వివక్ష, సమాజంలో నెలకొన్న అసమానతలను ఉటంకించి వారికి కమాండ్ స్థాయి పోస్టులను ఇవ్వకపోవడం ఆమోదయోగ్యం కాదని వివరించింది.

షార్ట్ సర్వీస్ కమిషన్ కింద రిక్రూట్ అయిన మహిళా అధికారులు తమకు శాశ్వత కమిషన్ వర్తింపజేయాలని ఈ పిటిషన్ వేశారు. తొలుత ఐదేళ్లు, తర్వాత మరో నాలుగేళ్లు సర్కారు వారి విధులను షార్ట్ సర్వీస్ కమిషన్ కిందనే పొడిగించింది కానీ, శాశ్వత కమిషన్ కల్పించలేదు. దీంతో 14 ఏళ్ల సర్వీస్ తర్వాత పురుష అధికారులకంటే తక్కువ బెనిఫిట్స్‌తోనే మహిళా అధికారులు రిటైర్‌మెంట్ కావలసి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మహిళా అధికారులకూ శాశ్వత కమిషన్ కల్పించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పురుషులతో సమానంగా మహిళలకూ అవకాశాలు కల్పించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు మహిళా అధికారులకు సానుకూల తీర్పును వెలువరించింది.

2010లోనే ఢిల్లీ హైకోర్టు మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ కల్పించాలని ఆదేశించింది. కానీ, ప్రభుత్వం ఆ ఆదేశాలను దాటవేస్తూ వచ్చింది. తాజాగా, ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ మహిళలకు శాశ్వత కమిషన్ కల్పించాలని ఆదేశించింది. 2019లో మహిళలకు శాశ్వత కమిషన్ కల్పించిన కేంద్రం సొంత వైఖరికే విరుద్ధంగా ఇప్పుడు శారీరక లక్షణాలను ఉటంకిస్తూ వెనుకడుగు వేయడం సరికాదని అభిప్రాయపడింది.

Advertisement

Next Story

Most Viewed