సొంతూరుకు ‘వలస’ కార్మికులు..

by Shyam |
సొంతూరుకు ‘వలస’ కార్మికులు..
X

దిశ, మెదక్: వివిధ ప్రాంతాల నుంచి పొట్టకూటి కోసం జిల్లాకు వచ్చిన కూలీలు, కార్మికులు నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి విధించిన లాక్ డౌన్‌తో ఇక్కడే లాక్ అయిపోయారు. వారికి ఇప్పుడు మోక్షం లభించింది. సొంతూర్లకు పంపేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో వాళ్లు ఇప్పుడు ఇంటికి పయనమవుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న వివిధ రాష్ట్రాల కార్మికులు, పర్యాటికులను వారి వారి ప్రాంతాలకు తరలించే ప్రక్రియ మొదలైంది. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకోడానికి జిల్లా అధికార యంత్రాంగం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అధికారులు రెండ్రోజుల్లో శిబిరాల్లో ఉన్నవారి తరలింపు కార్యక్రమాన్ని మొదలుపెట్టే సూచనలు కన్పిస్తున్నాయి.

అధికారిక సమాచారం ప్రకారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 2,200 మంది శిబిరాల్లో ఉన్నారు. వీరిలో పర్యాటకులూ ఉన్నారు. వీరుకాక సుమారు 600 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు వివిధ కారణాలతో జిల్లాలో తమ కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. వీరందరినీ వారి వారి రాష్ట్రాలకు పంపించడానికి మార్గదర్శకాలతో కేంద్రం అనుమతులను ప్రకటించింది. దీంతో జిల్లాలో వివిధ ప్రాంతాలలో ఉన్న ఇతర రాష్ట్రీయులలో సందడి మొదలైంది. రెండ్రోజుల కిందట సంగారెడ్డి కంది ఐఐటి కళాశాల వెనుక ఉన్న కాలనీ‌లో ఉన్న 2,500 మంది వలస కూలీలు తమను స్వగ్రామాలకు వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. తమకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదనీ, కడుపు నిండా భోజనం పెట్టడం లేదని ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో ఓ పోలీసు అధికారికి గాయాలు కాగా, ఒక పోలీసు వాహనం ద్వంసమైంది. జిల్లా ఎస్పీ, కలెక్టర్ రంగంలోకి దిగి కార్మికులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింప‌జేశారు.

జార్ఖండ్‌కు చెందిన కార్మికులకు ఏ ఇబ్బందులు తలెత్తకుండా ఆదివారం ఉదయం లింగంపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులు, రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ఇదే కాకుండా జిల్లావ్యాప్తంగా ఉన్న దాదాపు 2,500 మందిని పంపించే కార్యక్రమంపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. శనివారం జరిగిన జిల్లాస్థాయి కొవిడ్ టాస్క్‌ఫోర్స్ సమావేశంలో ఈ అంశంపై జరిగిన చర్యల్లో రైల్వే, ఆర్టీసి, రవాణా, రెవెన్యూ, కార్మికశాఖల అధికారులు, ప్రతినిధులు సానుకూలత తెలిపారు. దీంతో అందరి సమన్వయంతో వీలైతే రెళ్లలో, లేదంటే ప్రత్యేక బస్సులలో తరలించాలని అధికారులు నిర్ణయించారు. రెండ్రోజుల్లో ఇందుకు చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. దీంతో జిల్లావ్యాప్తంగా నెలన్నర రోజులుగా జిల్లాలో లాకైన వారు సొంతూరుకు చేరుకోనున్నారు.

Tags: native place, migrant workers, going, covid 19 affect, lockdown, corona virus

Advertisement

Next Story

Most Viewed