ఈసారైనా లక్ష్యం నెరవేరేనా?

by Shyam |
ఈసారైనా లక్ష్యం నెరవేరేనా?
X

దిశ, మహబూబ్‌నగర్ : జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్ల కొరత, నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) మహమ్మారి కట్టడికి విధించిన లాక్ డౌన్ కారణంగా గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పనులు ఆశించిన మేర నడవడం లేదనే చెప్పాలి. మార్చి నెలలో ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మెకు దిగడంతో జిల్లా వ్యాప్తంగా వారిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. అయితే, వారితోనూ ఆశించిన ఫలితం కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ర్ట ముఖ్యమంత్రి సైతం గ్రామీణ కూలీలు ఇబ్బంది పడకుండా వారికి కూలీ పనులు కల్పించాలని అదేశాలు జారీ చేయడంతో గ్రామాలలో ఉపాధి పనుల ప్రారంభానికి అధికారులు సిద్ధమయ్యారు. ఆయా గ్రామ పంచాయతీల్లో ఉన్న అవకాశాలను అసరగా చేసుకోవడంతో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నర్సరీలలో కూడా ఉపాధి పనులను నిర్వహించేందుకు అధికారులు దృష్టి సారిస్తున్నారు. అయితే, గతేడాది నిర్దేశించుకున్న పనిదినాల లక్ష్యం చేరుకోలేదు. మరి ఈసారైనా లక్ష్యం నెరవేరుతుందో లేదో చూడాలి.

పనుల కల్పనకు ప్రణాళికలు..

ఈ ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,54,19,895 కూలీలకు పని కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 1,29,612 జాబ్ కార్డులు ఉండగా 2,24,588 మంది కూలీలు పనులు చేస్తుండగా వారికి 27,10,890 పనిదినాలు కల్పించాల్సి ఉంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో 1,46,383 జాబ్ కార్డులు ఉండగా 3,30,809మంది కూలీలు పనిచేస్తుండగా వారికి 32,97,376 పనిదినాలు, నాగర్ కర్నూల్ జిల్లాలో 1,79,000జాబ్ కార్డులు ఉండగా 1,12,736 కూలీలు పని చేస్తుండగా వీరికి 42,20,881 పనిదినాలు, నారాయణపేటలో 93,206 జాబ్ కార్డులతో పాటు 1,13,093 కూలీలకు 22,84,609 పనిదినాలు, వనపర్తి జిల్లాలో 1,27,000 జాబ్ కార్డులు, 2,50,000వేల మంది కూలీలకు 29,06,139 పనిదినాలు కల్పించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

సామాజిక దూరం పాటించాల్సిందే..

పనులు చేసే సమయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కూలీలు ఒకే చోట గుంపులుగా లేకుండా దూరం, దూరం ఉండే విధంగా సోషల్ డిస్టెన్స్ (సామాజిక దూరం) ఉన్న పనులను గుర్తించాలని ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. అలాగే కూలీలకు పనులు చేసే చోట తాగునీటి సదుపాయంతో పాటు అత్యవసర వైద్య సదుపాయం, టెంట్లు, ఇతరత్రా వసతులూ కల్పించనున్నారు. పనులను ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుంచి 6గంటల వరకు మొత్తం 6 గంటలే పని చేసే విధంగా ప్రస్తుతం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో గతంలో ఉన్న రూ.211 కూలికి అదనంగా ప్రస్తుతం ప్రభుత్వం రూ.26 జోడించి ఇచ్చేందుకు నిర్ణయించడంతో వారికి రోజు కూలీ రూ.237 అందనుంది. అయితే, అన్నిటికంటే ముఖ్యంగా సామాజిక దూరం పాటించేలా సంబంధిత సిబ్బంది చర్యలు తీసుకోవాలని లేదంటే వారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అధికారులు కిందిస్థాయి సిబ్బందిని హెచ్చరిస్తున్నారు.

ఈ సారైన లక్ష్యం చేరేనా.?

ఇదిలా ఉండగా గత ఆర్థిక సంవత్సరం నిర్దేశించుకున్న పని దినాల లక్ష్యాలను అధికారులు చేరుకోలేకపోయారు.అధికారుల అలసత్వం, పర్యవేక్షణ లోపం, ఫీల్డ్ అసిస్టెంట్ల సమ్మె బాట వెరసి ఉపాధి కూలీలకు శాపంగా మారింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద గత ఆర్థిక సంవత్సరం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు కేటాయించిన పనిదినాల లక్ష్యం పూర్తి కాకపోవడంతో సుమారు 51.17 లక్షల పనిదినాలు మురిగిపోయాయనే చెప్పాలి. గత మార్చి 31 నాటికి ఆర్థిక సంవత్సరం పూర్తి కావడంతో గతంలో కేటాయించిన పనిదినాలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో అధికారులు విఫలం అయ్యారు. గత ఆర్థిక సంవత్సరం అధికారులు యుద్ధప్రాతిపదికన పనులను గుర్తించడంలో విఫలం కావడంతోపాటు చివర్లో ఫిల్డ్ అసిస్టెంట్లు సమ్మె బాట పట్టారు. ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మెకు దిగిన తర్వాత వారి బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించినా ఫలితం మాత్రం రాలేదు.

తూ..తూ..మంత్రంగా పనులు!

గత ఆర్థిక సంవత్సరం ఉపాధి పనికి వెళ్లే వారికి ఒక్క రోజుకు కనిష్టంగా రూ.150 గరిష్టంగా రూ.211 వచ్చే విధంగా పనులను చేయించాలని నిబంధనలు ఉన్నాయి. అయితే, మర్చి నెలాఖరు వరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.222.99 కోట్ల పనులు పూర్తి చేయాల్సి ఉన్నా అది పూర్తి కాకపోవడంతో రూ.76.75కోట్ల పనిని కూలీలు కోల్పోవాల్సి వచ్చింది. ఎక్కువగా కూలీలు ప్రభుత్వం చేపట్టిన నర్సరీ పనులకే పరిమితం అయ్యారనే చెప్పాలి. పనులను గుర్తించడంలో సంబంధిత అధికారులు విఫలం కావడంతో ఎక్కువ మందిని తూతూమంత్రంగా నర్సరీ పనులకు పరిమితం చేయడంతో వారికి కూలీ గిట్టుబాటు కాకపోవడంతో ఉపాధి పనులు మానేసి ఇతర పనులకు వెళ్లారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గత సంవత్సరానికి సంబంధించిన వివరాలు పరిశీలిస్తే మహబూబ్‌నగర్ జిల్లాలో 1.10 లక్షల జాబ్ కార్డులు ఉండగా, నాగర్ కర్నూల్‌లో 1.77లక్షలు, నారాయణపేటలో 0.93లక్షలు, జోగుళాంబ గద్వాలలో 1.38లక్షలు, వనపర్తిలో 1.27 లక్షల కార్డులు ఉన్నాయి. ఈ లెక్కల ప్రకరాం మహబూబ్ నగర్ జిల్లాలో 30.82 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా ఉండగా కేవలం 12 లక్షల పనిదినాలు, నారాయణపేటలో 22.85 లక్షల పనిదినాలకు 14.41 లక్షల పనిదినాలు, వనపర్తిలో 27 లక్షల పనిదినాలకు 23లక్షల పనిదినాలు, నాగర్ కర్నూల్‌లో 42లక్షల పనిదినాలకు 30 లక్షల పనిదినాలు, జోగుళాంబ గద్వాల జిల్లాలో 25.99 లక్షల పనిదినాలకు 18.08 పనిదినాలను మాత్రమే అధికారులు కల్పించారు. కారణాలు ఏవైనా నష్టపోయింది మాత్రం కూలీలనే చెప్పాలి. వారికి కల్పించాల్సిన పూర్తి స్థాయి పనిదినాలను కల్పించకపోవడంతో నిధులు మురిగిపోయ్యాయి. కనీసం ఈ ఆర్థిక సంవత్సరం అయినా పూర్తి స్థాయి పనులు కల్పించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Tags: MGNREGA Act, Works, coolie, field assistant, officers, target, days

Advertisement

Next Story