మెదక్ లో దా'రుణం'

by Shyam |
మెదక్ లో దారుణం
X

దిశ, మెదక్: కరోనా కారణంగా ప్రపంచం ఆందోళన చెందుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది. ప్రభుత్వ, ప్రైవేటు రుణాల చెల్లింపులు వాయిదా పడ్డాయి. కానీ, మహిళా సంఘాలు తీసుకున్న డ్వాక్రా రుణాలు మాత్రం చెల్లించాల్సిందే, లేదంటే మీకు ఇబ్బందులు తప్పవని గ్రూప్ లీడర్లు సభ్యులపై ఒత్తిడి తెస్తూ ఇబ్బందులు పెడుతూ ముక్కు పిండి మరీ వాయిదా డబ్బులు వసూలు చేస్తున్నారు.

కార్పొరేట్ సంస్థలు, బ్యాంకు సైతం ఈఎంఐలకు గడువు ఇస్తూ (మారిటోరియం) కొంత అవకాశం కల్పిస్తుంటే డ్వాక్రా గ్రూప్ రుణాలకు మాత్రం ప్రభుత్వం కానీ, బ్యాంకర్లు కానీ, మహిళా గ్రూప్‌లకు గడువు ఇవ్వటంలేదు. ఫలితంగా గ్రూప్ మహిళలు తీసుకున్న రుణాలకు వాయిదాలు చెల్లించటానికి అప్పు చేస్తున్నారు. తప్పని పరిస్థితులో ఉన్న నగలు కుదువ పెట్టి వాయిదాలు చెల్లిస్తున్నారు. దీంతో స్పష్టంగా అర్థమవుతోంది.. ఏ స్థాయిలో గ్రూప్ లీడర్లు ఒత్తిడి తెస్తుతున్నారో అనేది.

ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆయా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీలలో డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా మహిళలు తీసుకున్న రుణాల వాయిదాలు చెల్లింపుల కోసం ఆ సంఘాల లీడర్లు మహిళా సభ్యులపై తీవ్రమైన స్థాయిలో ఒత్తిడి తెస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు.

కరోనా కారణంగా చేతికి పనిదొరకక పస్తులుండే పరిస్థితి ఓ వైపు వెంటాడుతుంటే మరో వైపు ఆ కుటుంబాలపై మోయలేనీ ఆర్థిక భారంతో సతమతమవుతున్న నిరుపేదలపై డ్వాక్రా రుణాలు మాత్రం పట్టి పీడిస్తున్నాయి. కరోనా కారణంగా ప్రభుత్వం స్టే హోమ్.. బీ సేప్ అంటునే ఇంటికి పరిమితం చేసి ఆ కుటుంబాలకు ఎకనామిక్ గా ఇబ్బందులకు గురిచేస్తూనే … మళ్లీ డ్వాక్రా రుణాల వాయిదాలు చెల్లించాలని గ్రూప్ లీడర్లతో ఒత్తిడి తేవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గ్రామంలో మహిళా గ్రూపు పైసలు కట్టాలని సీఏ లు, గ్రూప్ లీడర్ లు గ్రూప్ సభ్యులపై ఒత్తిడి తెస్తూ పైసల్ కడతారా కట్టారా…. అంటూ ఇళ్ల చుట్టూ తిరుగుతూ… ప్రభుత్వ మహిళా గ్రూపు పైసలు కట్టొద్దు అని ఎక్కడా చెప్పలేదని, గ్రూపు సీఏలు, లీడర్లు బలవంతంగా వాయిదా డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇల్లు గడవటమే కష్టతరంగా ఉంటే డ్వాక్రా వాయిదా డబ్బులు ఎక్కడ నుంచి చెల్లించేదని గ్రూప్ సభ్యులు వాపోతున్నారు.

దేశంలో కరోనా ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే బ్యాంకులకు ఎలాంటి డబ్బులు కట్ట వల్సిన అవసరం లేదని చెప్పుతున్నా డ్వాక్రా సంఘాల అధికారులు మాత్రం ఆ నిబంధనలనేమీ పట్టించుకోవడంలేదు. లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటి నూడి బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో పైసలు ఎలా కట్టాలని సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పని పరిస్థితులో అధిక వడ్డీకి అప్పు తెచ్చి కొందరు వాయిదాలు చేల్లిస్తే, మరికొందరు ఉన్న బంగారం, నగలు కుదవ పెట్టి డబ్బులు చెల్లిస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులు స్పందించి డ్వాక్రా వాయిదాల చెల్లింపులపై క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. .

ఉంటేనే చెల్లించండి..

డ్వాక్రా మహిళా సంఘాల వాయిదా చెల్లింపుల విషయంలో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు.. డబ్బులుంటే వాయిదా చెల్లించండి.. లేకుంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు’ అని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Tags: Women’s association, medak, loan payments, authorities, corona effect

Advertisement

Next Story