బ్రిస్బేన్‌పై మెల్‌బోర్న్ విజయం

by Shyam |
బ్రిస్బేన్‌పై మెల్‌బోర్న్ విజయం
X

దిశ, స్పోర్ట్స్: బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) 2020-21 సీజన్‌లో భాగంగా శుక్రవారం రాత్రి కాన్‌బెర్రాలోని మనుక ఓవల్‌లో బ్రిస్బేన్ హీట్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ జట్టు కౌల్టర్-నైల్ ధాటికి 19.5 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మ్యాక్స్ బయాంట్ (20), క్రిస్ లిన్ (20), టామ్ కూపర్ (26) తప్ప మిగతా ఎవరూ పెద్దగా రాణించలేదు. మెల్‌బోర్న్ బౌలర్ కౌల్టర్-నైల్ 4 వికెట్లు తీయడమే కాకుండా, 2 రనౌట్లు కూడా చేయడంతో బ్రిస్బేన్ జట్టు కోలుకోలేకపోయింది.

ఇక 126 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన మెల్‌బోర్న్ జట్టు తొలి ఓవర్‌లోనే మార్కస్ స్టొయినిస్ వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ ఫ్లెచర్ (12), బెన్ డంక్ (6) తక్కువ స్కోరుకే అవుటయ్యారు. అయితే హిల్టన్ కార్ట్‌రైట్(46 నాటౌట్)తో కలసి కెప్టెన్ మ్యాక్స్‌వెల్ (46) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. మ్యాక్స్‌వెల్ తన ఫామ్‌ను కొనసాగిస్తూ బౌండరీలతో చెలరేగాడు. చివర్లో మ్యాక్సీ అవుటైనా.. నిక్ లార్కిన్ (12)‌తో కలసి కార్ట్‌రైట్ లక్ష్యాన్ని ఛేదించారు. కేవలం 17.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసి మెల్‌బోర్న్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నాథన్ కౌల్టర్-నైల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.

Advertisement

Next Story