తయారీ రంగం విస్తరిస్తేనే ప్రయోజనాలు

by Harish |
తయారీ రంగం విస్తరిస్తేనే ప్రయోజనాలు
X

దిశ,సెంట్రల్ డెస్క్: ఎక్కువ కాలంపాటు అవసరం ఉన్న ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం అంత ప్రయోజనకరంగా ఉండదని, దేశీయంగా ఆయా ఉత్పత్తులు ఎంతమేరకు లభిస్తున్నాయి, నాణ్యత ఎలా ఉంది, ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో పరిశీలించి దిగుమతి చేసుకోవాలని మారుతీ సుజుకి ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ అన్నారు. చైనా ఉత్పత్తులను బహిష్కరించాలంటే ఇండియాలో ఆ స్థాయి మేర తయారీ రంగం విస్తరించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పొరుగు దేశాల ఉత్పత్తులను పట్టించుకోకపోతే అవే ఉత్పత్తుల ధరలు కొండెక్కి, మనం వాటిని కొనే సమయానికి ఎక్కువ చెల్లించే పరిస్థితి ఏర్పడుతుందని భార్గవ హెచ్చరించారు. ఈ అంశాన్ని ప్రజలు కూడా విస్మరించకూడదని ఆయన హితవు పలికారు.

‘రూపాయి విలువ పడిపోయే సమయంలో ఉత్పత్తుల దిగుమతికి అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుందని, పదేళ్ల క్రితం దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల ధరలు నేడు 70 శాతం పెరిగాయని’ భార్గవ గుర్తుచేశారు. అసలు దిగుమతిని దేశీయంగా కొరత ఉన్నప్పుడే చేసుకుంటాం, ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న బహిష్కరణ నినాదానికి దేశీయంగా తయారీ రంగాన్ని మరింత ప్రోత్సహించి, పోటీ తత్వాన్ని మెరుగుపరిచి, విస్తృతం చేయడమే సమాధానమని భార్గవ పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్‌లో ప్రధాని మోదీ ఈ అంశాన్నే ప్రస్తావించారని, తయారీ రంగంలో పోటీ పడే స్థాయిలో ఎక్కువ ఉత్పత్తులు తయారు చేయగలిగినప్పుడు దిగుమతి అవసరం లేకుండా పోతుందని, ప్రజలు కూడా దిగుమతి విషయం ఆలోచించరని భార్గవ అభిప్రాయపడ్డారు.

అలాగే, చైనా ఉత్పత్తులను బహిష్కరించడం వల్ల ఆటోమొబైల్ రంగంపై ప్రభావం ఎలా ఉంటుందనే ప్రశ్నకు బదులిస్తూ.. సరిహద్దు వివాదం ఉన్నప్పుడు ఎవరైనా ఇదే చేస్తారు. ఇంతకుముందు పాకిస్తాన్‌తో ఇలాంటి వివాదం తలెత్తింది. కానీ, ఇలాంటపుడు పాలసీలు మారే అవకాశముండదు. రెండు దేశాల మధ్య ఒక పాలసీని రూపొందించే సమయంలో విధానకర్తలు మనోభావాలను పరిగణలోకి తీసుకోరని భార్గవ స్పష్టం చేశారు. సాధారణంగా పరిశ్రమలకు అవసరమైన వస్తువులు దేశీయంగా అందుబాటులో లేకపోవడం, ఆశించిన స్థాయి నాణ్యతతో దొరక్కపోవడం, ధర అధికంగా ఉండటం లాంటి కారణాలతోనే దిగుమతులపై ఆధారపడతాయని భార్గవ చెప్పారు. అవసరంలేని ఉత్పత్తులను దిగుమతుల నుంచి నిషేధిస్తే ఇండియాపై ప్రభావం ఉండదని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story