ప్రియురాలితో లాంగ్ డ్రైవ్.. కిడ్నాప్‌ను చేధించిన పోలీసులు

by srinivas |
Police
X

దిశ, ఏపీ బ్యూరో: సోషల్ మీడియాలో పరిచయమయ్యాడు. తొలుత హాయ్ అంటూ పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్త ప్రేమ వరకు వెళ్లింది. ఆ యువతిని పీకల్లోతు ప్రేమలోకి దించాడు. ఇదే నిజమైన ప్రేమ కావొచ్చని, ఇలాంటి ప్రియుడు మరొకరికి దొరకడని ఆ అమాయకురాలు నమ్మేసింది. అతడు లేకపోతే నా జీవితం వృధా అనుకునేట్లుగా ఆ యువతిని మాటలతో మాయ చేసేశాడు. ఇలా ఒక నెల కాదు రెండు నెలలు కాదు ఏకంగా ఆర్నెళ్లుగా అమ్మాయిని కల్లబొల్లి మాటలతో గారడీ చేసేశాడు. ఇక ఒకరోజు లాంగ్ డ్రైవ్ పేరుతో బయటకు వెళ్దామని చెప్పాడు.

ప్రియుడుతో లాంగ్ డ్రైవ్ అంటే జాలీరైడ్ అనుకుంది. వెంటనే తలూపేసింది. డేట్, టైం ఫిక్స్ చేసుకున్నారు. ప్రియుడు చెప్పినట్లు ఆమె కాలేజీ బస్ ఎక్కడం.. మధ్యలో దిగి అతడి బైక్ ఎక్కడం.. వెస్ట్ గోదావరి వెళ్లిపోవడం చకచకా జరిగిపోయింది. అయితే సాయంత్రానికి అమ్మాయి ఇంటికి వచ్చేసింది. ప్రియుడు కటకటాల వెనక్కి వెళ్లిపోయాడు. ఈ మధ్యలో ఏం జరిగిందో అనుకుంటున్నారా..? అదే అసలైన ట్విస్ట్.

సోషల్ మీడియాలో పరిచయం

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని(19) ఇంజనీరింగ్ చదువుతోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌‌గా ఉంటుంది. అయితే ఆమెకు ఆర్నెళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. హాయ్ అంటూ పరిచయం పెంచుకున్నాడు. తన పేరు ఫణీంద్ర అని చెప్పుకొచ్చాడు. అలా రోజూ ఆమెను ఫాలో అవుతూ ఉండేవాడు. అలా ఇద్దరూ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. ఇంకేముంది సెల్ ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. నువ్వు లేక నేను లేను అనే స్టైల్లో ప్రేమగీతాలు ఆలపించాడు. ఇన్‌స్టాగ్రామ్, స్నాప్ చాట్ నుంచి, వాట్సాప్ చాట్ దాకా అన్నీ ముచ్చట్లే! ఇంకేముందీ.. ఇదే నిజమైన ప్రేమ కావొచ్చని, ఇలాంటి ప్రియుడు మరొకరికి దొరకడని ఆ అమాయకురాలు నమ్మేసింది. అలా చూస్తుండగానే ఆర్నెళ్లు గడిచిపోయాయి.

వన్ ఫైన్ డే.. బైక్ పై అలా లాంగ్ రైడ్‌కు వెళ్దామా అంటూ ఆహ్వానించాడు. ఇంకేముంది లవ్ లో జాలీ రైడ్‌ను ఊహించుకున్న ఆ అమ్మాయి వెంటనే ఒకే చెప్పేసింది. దీంతో ఇద్దరూ డేట్, టైం ఫిక్స్ చేసుకున్నారు. బుధవారం కాలేజీకని చెప్పి బస్సులో వచ్చి.. మధ్యలో బస్సు దిగి, బండెక్కి వెళ్లాలి. ఇదీ ఇద్దరూ వేసుకున్న ప్లాన్. ఇంజనీరింగ్ యువతి ప్రియుడు చెప్పినట్లుగానే చేసింది. బుధవారం ఉదయం ఇంటి నుంచి కళాశాలకు బస్సులో బయలుదేరింది. కళాశాలకు వెళ్లకుండా.. మార్గం మధ్యలో రాజానగరంలో బస్సు దిగింది. అక్కడ ప్రియుడి బైక్ ఎక్కి వెళ్లింది.

ప్రేమగా నటిస్తూనే కిడ్నాప్ ప్లాన్

ఒకవైపు ఆ యువతితో ఎంతో ప్రేమగా నటిస్తూనే మరోవైపు తన క్రిమినల్ మైండ్‌కు పని చెప్పాడు. యువతిని బైక్‌పై తీసుకెళ్లిన ఫణీంద్ర మధ్యాహ్నానికి తన క్రిమినల్ బుర్రకు పనిచెప్పాడు. మధ్యాహ్నం వేళ ఆ యువతి తండ్రి ఫోన్‌ చేశాడు. మీ అమ్మాయి నా దగ్గర ఉంది. మీ అమ్మాయిని కిడ్నాప్‌ చేశా. రూ.5 లక్షలు ఇవ్వండి. లేకుంటే చంపేస్తాం అంటూ బెదిరించి ఫోన్ పెట్టేశాడు. మరోవైపు యువతిని భీమవరంలోని ఓ గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ అతడిలో మరో వ్యక్తిని యువతి కనిపెట్టింది. అతడు టెన్షన్ పడటం… కోప్పడటం గమనించింది. ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నావని అడగడంతో నాలుగు తగిలించాడు కూడా. అప్పుడు తాను ప్రేమించి మోసపోయానని తెలుసుకుంది. ఉదయం వరకు ఎంతో ప్రేమగా ఉన్న వ్యక్తి ప్రేమ ముసుగు వేసుకున్న వంచకుడని పసిగట్టింది.

Police

ఏం చేసేది లేక సైలెంట్ అయిపోయింది. ఇక రాజానాగరం విషయానికి వస్తే ఫనీంద్ర ఫోన్‌కాల్‌తో భయాందోళనకు గురైన తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం రాత్రి నుంచి వేట మొదలు పెట్టారు. 8 బృందాలుగా విడిపోయి పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మళ్లీ భీమవరం విషయానికి వస్తే ఎలాగో రాత్రి గడిచిపోయింది. గురువారం మధ్యాహ్నం వరకు యువతితోనే ఫణీంద్ర ఉన్నాడు. అయితే డబ్బులు చేతికందకపోయేసరికి ఓ దమ్ము కొట్టేందుకు ఇంట్లో ఇంజనీర్ యువతిని బంధించి వెళ్లిపోయాడు. అతడు బయటకు వెళ్లిపోవడంతో ఇంజనీరింగ్ విద్యార్థిని తలుపులను గట్టిగా తన్నింది.

పెద్ద ఎత్తున కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు స్థానికంగా ఉండే మహిళా పోలీస్ ఎస్.నాగ భవానికి సమాచారం అందించారు. దీంతో ఆమె పోలీసులను అప్రమత్తం చేసింది. పోలీసులు వచ్చి రూమ్‌ను చూడగా గాయాలతో ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థిని ఉంది. తనను రక్షించాలంటూ ఆమె పోలీసులను వేడుకుంది. జరిగిన విషయం చెప్పింది. ఈ క్రమంలో నిందితుడు ఫోన్ కాల్స్ ఆధారంగా ఫణీంద్రను పట్టుకున్నారు. ఆ యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

సోషల్ మీడియాలో పరిచయాలు మంచివి కాదు: ఎస్పీ ఐశ్వర్య రస్తోగి

ప్రేమ పేరుతో వల విసిరి కిడ్నాప్‌కు పాల్పడిన నిందితుడు ఫణీంద్రను అరెస్ట్ చేసినట్లు శనివారం రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ ఐశ్వర్య రస్తోగి వెల్లడించారు. ఫణీంద్రకు నేర చరిత్ర ఉందని చెప్పుకొచ్చారు. భీమవరం పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో అతడిపై చోరీ కేసులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల యువతులు, మహిళలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మోసపోయిన తర్వాత బాధపడే కన్నా ముందుగానే అప్రమత్తమవడం మేలని ఎస్పీ ఐశ్వర్య రస్తోగి సూచించారు.

Advertisement

Next Story