హైదరాబాద్‌లో మరోసారి లాక్ డౌన్.?

by Shyam |
హైదరాబాద్‌లో మరోసారి లాక్ డౌన్.?
X

దిశ ప్రతినిధి ,హైద‌రాబాద్ : క‌రోనా వైర‌స్ సోక‌కుండా వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చింద‌నే భ‌రోసానా ? లేక వేసవి ఎండ‌లు దంచుతున్నాయి క‌రోనా ఏమీ చేయ‌ద‌నే దైర్యమా ? హైద‌రాబాద్ న‌గ‌ర ప్రజలు ఇటీవ‌ల కాలంలో ఎలాంటి కోవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌కుండా ఇంటా, బ‌య‌టా తిరుగుతుండ‌డంతో మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. 2020 మార్చి 23న జ‌న‌తా క‌ర్ఫ్యూ అనంత‌రం లాక్ డౌన్ ప్రక‌టించిన విష‌యం తెలిసిందే. అనంత‌రం కొంత మేర కేసులు త‌గ్గుముఖం ప‌ట్టడం, వ్యాక్సిన్ అందుబాటులోకి రావ‌డంతో ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తి వేసింది. అయితే గ‌త కొన్ని రోజులుగా క‌రోనా కేసులు పెరిగిపోతుండ‌డం అంద‌రినీ క‌ల‌వ‌ర ప‌రుస్తోంది. ఈ నేపథ్యంలో మరో మారు లాక్ డౌన్ ఉంటుందా అనేది అంతటా చ‌ర్చనీయాంశ‌మైంది. దీంతో త‌ల్లిదండ్రులు కూడా త‌మ పిల్లల‌ను స్కూళ్లకు పంపేందుకు ముందుకు రావ‌డం లేదు .

మ‌రోమారు లాక్ డౌన్ ఉంటుందా..?

హైద‌రాబాద్ న‌గ‌రంలో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంతో మరో మారు లాక్ డౌన్ పెడ‌తారా ? అనేది ప్రస్థుతం అంత‌టా చ‌ర్చనీయాంశ‌మైంది. త్వర‌లో పాఠ‌శాల‌లు తిరిగి మూసివేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంద‌నే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేప‌థ్యంలో లాక్ డౌన్ మ‌రోమారు ఉంటుందా అని ఏ ఇద్దరు క‌లిసినా ఇదే అంశంపై మాట్లాడుకుంటుండ‌డం గ‌మ‌నార్హం .

3ల‌క్షలు దాటిన కేసులు..

శ‌నివారం ఉద‌యం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన హెల్త్ బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,02,724 కేసులు న‌మోద‌య్యాయి. వీటిల్లో 2,98,451 మంది కోలుకోగా 1,666 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 2,607 ఉండ‌గా వీరిలో 980 మంది హోం ఐసోలేష‌న్‌లో ఉండి చికిత్సలు పొందుతున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 95,48,685 క‌రోనా ప‌రీక్షలు నిర్వహించారు. ఈ నెల 19వ తేదీ రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా 66,036 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా 364 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు కోవిడ్ బారిన ప‌డి మృతి చెందారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో 75 కేసులు న‌మోద‌య్యాయి .

జాగ్రత్తలే శ‌ర‌ణ్యం..

క‌రోనా వైర‌స్ ను ఎదుర్కొనేందుకు జాగ్రత్తలు పాటించ‌డ‌మే శ‌ర‌ణ్యమ‌ని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చినా, వేస‌వి ఎండ‌లు పెరిగినా ముందు జాగ్రత్త చ‌ర్యలు తీసుకోక‌పోతే వైర‌స్ బారిన ప‌డే ప్రమాద‌ముంద‌ని హెచ్చరిస్తున్నారు. గ‌తంలో వినియోగించిన‌ట్లుగా శానిటైజ‌ర్, సోషల్ డిస్టెన్స్, మాస్కు తప్పనిస‌రిగా ధ‌రించాల‌ని, అవ‌స‌ర‌మైతేనా బ‌య‌ట‌కు రావాల‌ని, కోవిడ్ ఆరంభంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో అలాంటి జాగ్రత్తలు త‌ప్పనిస‌రని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed