పుకార్లతో వ్యాపారం జోరు.. జనం బేజారు

by Shyam |

దిశ, న్యూస్ బ్యూరో: ‘ఈ రోజు రాత్రి నుంచి కూరగాయలు, కిరణా దుకాణాలు మూసివేస్తున్నారు. అందరూ అన్ని వస్తువులు కొనుకెళ్లండి.. లేదంటే ఇబ్బందులు పడక తప్పదు.. ’ అంటూ శనివారం ఉదయం నుంచి హైదరాబాద్‌లో పుకార్లు చెలరేగాయి. దీంతో కుటుంబాలకు కావాల్సిన సరుకులు తీసుకునేందుకు జనాలు దుకాణాల ముందు బారులు తీరారు. దుకాణాలు మూతపడి లాక్‌డౌన్ కాలాన్ని పెంచుతారనే పుకార్లతో ప్రజలు భయాందోళనలతో సరుకులు, కూరగాయల కొనుగోళ్లకు ఎగబడుతున్నారు.

ప్రభుత్వాలు ఏప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేసే దిశగా ఆలోచనలు చేస్తున్నాయి. ఇదే సమయంలో ఏప్రిల్ 3న ఒకే రోజు 75 కరోనా పాజిటివ్ కేసులు తెలంగాణలో బయటపడటంతో ప్రజలు ఈ ప్రచారాన్ని సులభంగా నమ్ముతున్నారు. దీంతో లాక్‌డౌన్ తర్వాత శనివారం రోడ్లపై జనాలు, వాహనాల కదలికలు ఎక్కువగా కనిపించాయి. తాత్కాలిక చెక్‌పోస్టుల్లో ఉన్న పోలీసులు వీరిని గమనిస్తున్నా.. నిత్యావసర వస్తువుల కొనుగోళ్లకు మినహాయింపు ఉండటంతో వారు ఏమీ చేయలేకపోతున్నారు. గత 10 రోజులకు పైగా దుకాణాల్లో ఉన్న స్టాక్ మాత్రమే అమ్ముకుంటున్నారు తప్ప కొత్తగా సరుకులు రావడం లేదు. చివరగా ఉన్న చాలా తక్కువ వస్తువులను కూడా ఎక్కువ ధరకు అమ్ముకునే ప్రయత్నంలోనే ఇలాంటి ప్రచారాన్ని చేసి ఉంటారని అధికారులు చెబుతున్నారు. నిత్యావసర సరుకులను మినహాయించినట్టు ప్రభుత్వాలు, అధికారులు ఇప్పటికే ప్రకటించారు. పూర్తిగా మూసివేస్తున్నట్టు జరిగే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సూచించారు.

Tags: Rumors, GHMC bosses, vegetables, grocery stores, police, officers

Advertisement

Next Story

Most Viewed