అభివృద్ధి పనులపై స్థానికుల డిమాండ్

by Sridhar Babu |
అభివృద్ధి పనులపై స్థానికుల డిమాండ్
X

దిశ, ధర్మపురి: దేశంలోనే గుర్తింపు పొందిన ధర్మపురి క్షేత్రంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులతో పాటు, అంతర్రాష్ట్ర రహదారి కూడా ధర్మపురి మీదగానే వెళ్తోంది. దీంతో పట్టణంలో చేపట్టిన నిర్మాణాలు నాలుగు రోజుల ముచ్చటగా కాకుండా శాశ్వతంగా నిలిచేలా జరిపించాలని కోరుతున్నారు.

పుష్కరాలప్పుడు రూ. 200 కోట్లతో..

పుష్కరాల సమయంలో రూ. 2 వందల కోట్లతో చేపట్టిన వివిధ రకాల నిర్మాణాలు ముణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలాయి. పట్టుమని పదేళ్లు కూడా కాకముందే చెడిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. శాశ్వత నిర్మాణాల విషయంలో పట్టించుకోని వైఖరి అవలంభించడం వల్లే ఈ పరిస్థితి తయారైందని తెలుస్తోంది. మంత్రి కొప్పుల ఈశ్వర్​ ధర్మపురి క్షేత్రం పై ఉన్న మక్కువతో కోట్లాది రూపాయాలతో ధర్మపురి అభివృద్ది పనులు చేయించారు. అయితే వాటిని నిర్మించిన కాంట్రాక్టర్లు నిబంధనలకు తిలోదకాలు ఇవ్వడంతో చెడిపోయాయని అంటున్నారు. అంతేకాకుండా ఈ నిర్మాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ఇంజినీర్లు, క్వాలిటీ కంట్రోల్ అధికారులు మొక్కుబడిగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి తయారైందని పట్టణ వాసులు విమర్శిస్తున్నారు. పుష్కర సమయంలో వేసిన పట్టణంలోని అంతర్గత రోడ్లు అస్థిత్వం లేకుండా పోగా, పుష్కర ఘాట్లతో పాటు నిర్మించిన మెట్లు ఇంజినీరింగ్ నిబంధనల ప్రకారం లేవని స్పష్టం అవుతోంది. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రెస్ చేంజ్ రూముల పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది.

రూ. 35 కోట్లు..

ధర్మపురి క్షేత్రం అభివృద్ధికి మంజూరైన రూ. 35 కోట్లతో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, సెంట్రల్​ లైటింగ్​, శ్మశాన వాటికలు, తంబల్ల కుంట సందరీకరణ వంటి అభివృద్ధి పనులను చేపడుతున్నారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో డ్రైనేజీలు, తారు రోడ్లు, సెంట్రల్​ టైటింగ్​ పనులు చేపడుతున్నారు.

పనులను పర్యవేక్షించాలి

రూ. 35 కోట్లతో అభివృద్ది పనులపై నాయకుల, అధికారుల పర్యవేక్షణ ఉండాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో లాగా నిర్మాణాలు నాలుగు రోజులకే చెడిపోతే ప్రజా ధనం వృథా అవుతుందన్న విషయాన్ని అధికారులు దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నారు.

నాణ్యత పాటించాలి

ధర్మపురిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలి. గోదావరి పుష్కరాల్లో కాంట్రాక్టర్లు చేపట్టిన పనులు నాసిరకంగా చేయడం వల్ల నిధులు వృథా అయ్యాయి. ఏడాదిలోగా పుష్కరాల సమయంలో వేసిన రోడ్లన్నీ కంకర తేలాయి. ఇప్పుడు రూ. 35 కోట్లతో జరుపుతున్న నిర్మాణాల విషయంలోనైనా నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి.

– రంగు లక్ష్మీనరహరి, ధర్మపురి

Advertisement

Next Story