''విజ్ఞాన్‌ నిష్ట్‌ నిబంధ్‌'' పుస్తకంలో సావర్కర్‌ 'ఆవు' గురించి చెప్పిందేమిటి..?

by Vinod kumar |
విజ్ఞాన్‌ నిష్ట్‌ నిబంధ్‌ పుస్తకంలో సావర్కర్‌ ఆవు గురించి చెప్పిందేమిటి..?
X

దిశ, వెబ్‌డెస్క్: సావర్కర్‌ తన పుస్తకం- ''విజ్ఞాన్‌ నిష్ట్‌ నిబంధ్‌''లో ఆవును గురించి కొన్ని వాస్తవాలు రాశాడు. ఈ పుస్తకాన్ని స్వాతంత్య్ర వీర్ సావర్కర్ స్మారక సమితి ప్రచురించింది. వాటిని నేటి ప్రభుత్వ పెద్దలు శ్రద్దగా మళ్ళీ మళ్ళీ చదువుకోవడం అవసరం ఉంది. ఎందుకంటే రాసినవాడు వారి దృష్టిలో మహానాయకుడు గనక.. సావర్కర్‌ తన పుస్తకంలో ఇలా రాశాడు.. '' ఎవరైతే గోవును పూజిస్తారో వారు మానవ జాతి స్థాయి నుండి కిందికి దిగజారిన వారవుతారు. ఇంకా గోవు ఒక జంతువని, దానికి లేని పవిత్రతను ఆపాదించి పూజించడం అంటే అది మూర్ఖత్వమవుతుందనీ' స్పష్టంగా రాశాడు.

'ఆవు ఎంతటి నికృష్టపు జంతువంటే.. అది తన మలంలోనే అది పొర్లుతుంది. దానికి బుద్దీ జ్ఞానం ఉండవు కనకనే తను వేసిన పేడలో అది బొర్లుతుంది' అని తన పుస్తకంలో పేర్కొన్నారు. సావర్కర్‌ మరొక ముఖ్యమైన విషయం వెలుగులోకి తెచ్చాడు.. మొఘులులు లేక ఇతర విదేశీయులు దేశం మీద దండెత్తి వచ్చినప్పుడు.. వారిని ఎదిరించి యుద్ధం చేయకుండా హిందువులు గోవులను పూజిస్తూ కూర్చున్నారనీ, దాని మహిమతో విజయం తమనే వరిస్తుందన్న భ్రమలో ఉండిపోయారనీ, అదెంతో సిగ్గుచేటన్నారు. సైనికులూ పౌరులూ అందరూ గోపూజ చేస్తూ కూర్చున్నందువల్ల యుద్ధం చేయగల ధైర్యం, నైపుణ్యం పోగొట్టుకున్నారని- యుద్ధ కౌశలం పోగొట్టుకున్నాక విజయాలెలా సాధిస్తారనీ- ఒక రకంగా ఈ దేశాన్ని విదేశీయులు ఆక్రమించుకోవడానికి కారణం నిస్సందేహంగా -గోవే!' అని సావర్కర్‌ విశ్లేషించారు. 'ఒకవేళ సైనికులకు యుద్ధ సమయంలో ఆహారం కొరత ఏర్పడితే, గోవుల్ని కోసుకుని తినాల్సింది. అలా చేసైనా తమ తమ రాజ్యాల్ని తాము కాపాడుకోవాల్సింది' - అన్నది సావర్కర్‌ అభిప్రాయం!

''గోపాలన్‌ హవే గో పూజన్‌ నభే'' (మరాఠీ శీర్షిక) గోవుల పాలన అవసరమే కానీ, గోపూజ వద్దు- అనేది ఆ మరాఠీ శీర్షికకు అర్థం. ఈ శీర్షికతో సావర్కర్‌ ఏమి చెప్పారంటే.. గోవు పాలిస్తుంది గనుక, మనుషులు దాన్ని పోషించుకోవాలి. కానీ, వాటిని పూజించడం ఎందుకూ? అన్నది ఆయన ప్రశ్న? ఆయనలాగే గోవుల్ని పూజించడం ఎందుకూ? అని ఈ దేశ ప్రజల్లో కొందరు అనుకుంటే అది పొరపాటు కాదు. తప్పిదం కాదు. గోవుకు ఏ పవిత్రతా లేదు అంటే అది నేరమూ కాదు.

Advertisement

Next Story

Most Viewed