వారం వారం మంచి పద్యం: మమత

by Ravi |   ( Updated:2023-08-13 18:31:00.0  )
వారం వారం మంచి పద్యం: మమత
X

రోజుల్లో ఊరు రాత్రి ఎనిమిది గంటలకే నిద్రపోయేది. అతడు ఠంచనుగా ఆరు గంటలకే నిద్ర లేచేవాడు. పక్షవాతం వచ్చిన చేతిలో నీళ్ల కోసం చెంబు, కుడిచేత కర్రతో మూలుగుకుంటూ వచ్చేవాడు. మాదాకబళం అనేవాడు. అంతకుమించి మాట్లాడేవాడు కాదు. ఎక్కడి నుండి వచ్చాడో ఎవరికి తెలియదు. జబ్బకు వేలాడుతున్న సంచిలోంచి గిన్నె తీసేవాడు. వేడి అన్నం, ఇంత కూర వేస్తే అక్కడే తిని వెళ్ళేవాడు. చల్ల అన్నం ససేమిరా అనేవాడు. అలా మూడు రోజులకోసారి వచ్చేవాడు. మిగతా రోజుల్లో ఇతరుల ఇండ్లకు వెళ్ళేవాడు. ఇంట్లో వండిన అన్నం మా కంటే ముందుగానే అమ్మ అతనికే వడ్డించేది. మామూలు సమయంలో ఎవరు ఏమిచ్చినా తీసుకునేవాడు కాదు. ఎవరినీ ఏమి అనేవాడు కాదు. పిచ్చివాడా, మంచివాడా అర్థం కాకపోయేది. తల్లులు అతన్ని చూపి పిల్లల్ని భయపెట్టేవారు. గుడి మెట్ల మీద కొన్ని రోజులు, మసీదులో కొన్ని రోజులు కనిపించేవాడు.

అతనికి పెళ్లి అయింది. కానీ ఆమె వెళ్ళిపోయింది. చిన్నపిల్లల్ని భయపెట్టేవాడు. కొందరు అతణ్ణి అమాయకుడని, మరికొందరు పిచ్చోడని అనేవాళ్ళు. ఎవరికీ కీడు చేసేవాడు కాదు. ఎవరే పని చెప్పినా చేసేవాడు. ఫలితంగా నాలుగు ముద్దలు ఆశించేవాడు. కొంతమంది ఆటపట్టించేవారు. ఆడవాళ్ళు నవ్వుకొనేవారు. వాళ్ళతో గొడవ పడేవాడు. మొత్తానికి అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. ఆయనకు వడ్ల గిర్నిలో పని దొరికింది. తాడు, బొంగరం లేని అతని జీవితానికి ఊరే సమస్తమయింది.

‘అది ఆనాటి మనుషుల మంచితనం’ అన్నాడు బుంగి. ప్రత్యేక మనస్తత్వం ఉన్నవాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. పిచ్చాసుపత్రుల్లో, ఆనాధ శరణాలయాల్లో ఉన్నారు. మన మధ్య, పని ప్రదేశాల్లో కూడా ఉన్నారు. మరి, తెలియడం లేదేందుకు. తెలుసుకునే తీరిక, ఓపిక, మమత మనకెక్కడిది అన్నాను.

మనిషి మారుట తధ్యము మహిని ఎప్పుడు

మార్పు వేగము కరుణను మంట గలిపె

మనిషి మరుగున పడిపోయె మమత లుడిగి

కశప చెప్పిన కధనమ్ము కాంతి పధము


డా. బి.వి.ఎన్ స్వామి

92478 17732

Advertisement

Next Story