America: భారత్‌పై ట్రంప్ ప్రభావమేమిటీ?

by Mahesh Kanagandla |
America: భారత్‌పై ట్రంప్ ప్రభావమేమిటీ?
X

దిశ, నేషనల్ బ్యూరో: ట్రంప్(Donald Trump) గెలుపుతో భారత్-అమెరికా సంబంధాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? అనే చర్చ జరుగుతున్నది. మొదటి నుంచీ వలసలను వ్యతిరేకిస్తున్నారు ట్రంప్. గతంలో అత్యధిక వేతనాలున్నవారినే దేశంలోకి తీసుకోవాలని కంపెనీలకూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు కూడా వలసలపై కఠిన నిర్ణయాలే తీసుకునే అవకాశముంది. అమెరికాలో గ్రీన్ కార్డు కోసం సుమారు పది లక్షల మంది ఎదురుచూస్తున్నారు. వారిపై కూడా ట్రంప్ గెలుపు ప్రతికూల ప్రభావం వేసే చాన్స్ ఉంది. వలసదారుల పిల్లలకు ఆటోమేటిక్‌గా పౌరసత్వం అందించడానికి వ్యతిరేకంగా ఆయన నిర్ణయం తీసుకునే అవకాశమూ ఉంది. తన ప్రచారంలో ఈ అంశాన్ని ట్రంప్ ప్రముఖంగా ప్రస్తావించారు.

ఇక ఆ దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రసంగిస్తూ ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువులపై దిగుమతి సుంకాలు పెంచుతామని చెప్పారు. బ్రెజిల్, చైనాల్లాగే.. భారత్ కూడా అమెరికా వస్తువులపై సుంకాలు అధికంగా వేస్తున్నదని, తాము కూడా భారత వస్తువులపై ట్యాక్స్‌లు పెంచుతామని వివరించారు. అమెరికా మార్కెట్ పై ఎక్కువగా ఆధారపడే ఐటీ, ఫార్మాస్యూటికల్, టెక్స్‌టైల్ రంగాలకు ఇది ప్రతికూలంగా మారనుంది. ప్యారిస్ ఒప్పందం, న్యూక్లియర్ డీల్ వంటి అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించని ట్రంప్‌తో ఇది వరకు అమెరికాకు సాంప్రదాయ మిత్రపక్షాలుగా ఉన్న దేశాలు సవాళ్లను ఎదుర్కోనున్నాయి. ఇక మిలిటరీ విషయానికి వస్తే మన దేశానికి వచ్చే ముప్పేమీ ఉండదు. చైనాను నియంత్రించడానికి భారత్‌తో అమెరికా మిలిటరీ ఎప్పట్లాగే సమన్వయంతో మసులుకోనుంది. చైనాకు చెక్ పెట్టడానికి వచ్చిన క్వాడ్ కూటమి ట్రంప్ హయాంలోనే ఏర్పడిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed