PKL 2024 : తెలుగు టైటాన్స్ జోరు.. హ్యాట్రిక్ విక్టరీ

by Harish |
PKL 2024 : తెలుగు టైటాన్స్ జోరు.. హ్యాట్రిక్ విక్టరీ
X

దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ జోరు కొనసాగుతోంది. తిరిగి గెలుపు బాట పట్టిన తర్వాత వరుస విజయాలతో దూసుకెళ్తోంది. తాజాగా హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్‌‌ను 35-34 తేడాతో ఓడించింది. చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో టైటాన్స్ ఒక్క పాయింట్‌తో విజయం సాధించింది. మొదటి నుంచి ఇరు జట్లు పాయింట్ల కోసం పోటీపడ్డాయి.

అయితే, ఆరంభం నుంచి టైటాన్స్ కాస్త ఆధిక్యంలోనే కొనసాగింది. ఫస్టాఫ్‌లో ఆ జట్టు 17-20తో లీడ్‌లో నిలిచింది. ఆ తర్వాత తలైవాస్ పుంజుకుని పలుమార్లు స్కోర్లను సమం చేసింది. 26-26తో ఇరు జట్లు సమవుజ్జీలుగా నిలిచిన స్థితితో పవన్ మూడు పాయింట్లు తేవడంతో టైటాన్స్ 29-26‌తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా స్కోరును సమం చేయడానికి తలైవాస్ గట్టిగానే ప్రయత్నించగా.. టైటాన్స్ ఒక్క పాయింట్‌తో పైచేయి సాధించింది.

ఈ సీజన్‌లో ఇరు జట్లు ఎదురుపడటం ఇది రెండోసారి. తొలి మ్యాచ్‌లో తలైవాస్ నెగ్గగా.. ఆ ఓటమికి టైటాన్స్ ప్రతీకారం తీర్చుకుంది. కెప్టెన్ పవన్(12 పాయింట్లు), ఆశిష్ నర్వాల్(9 పాయింట్లు) టైటాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు, తమిళ్ తలైవాస్ జట్టులో రైడర్ సచిన్(17) చేసిన పోరాటం వృథా అయ్యింది. టోర్నీలో 4వ విజయాన్ని ఖాతాలో వేసుకున్న టైటాన్స్ పాయింట్స్ టేబుల్‌లో 21 పాయింట్లతో 4వ స్థానానికి చేరుకుంది.

Advertisement

Next Story