Taliban : ముల్లా ఉమర్ కుమారుడితో భారత విదేశాంగ శాఖ ఉన్నతాధికారి భేటీ

by Hajipasha |
Taliban : ముల్లా ఉమర్ కుమారుడితో భారత విదేశాంగ శాఖ ఉన్నతాధికారి భేటీ
X

దిశ, నేషనల్ బ్యూరో : అఫ్ఘనిస్తాన్‌ను పాలిస్తున్న తాలిబన్ల(Taliban)తో భారత్(India) సంబంధాల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అఫ్ఘనిస్తాన్‌(Afghanistan) రక్షణ శాఖ మంత్రి ముల్లా మహ్మద్ యాకుబ్‌తో భారత విదేశాంగ శాఖ జాయింట్ సెక్రెటరీ (పాకిస్తాన్- అఫ్ఘనిస్తాన్‌- ఇరాన్ డివిజన్) జేపీ సింగ్ తొలిసారిగా బుధవారం భేటీ అయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఈసందర్భంగా చర్చించారు.

తాలిబన్ సుప్రీం నేత ముల్లా ఉమర్ కుమారుడే ముల్లా మహ్మద్ యాకుబ్‌. అఫ్ఘనిస్తాన్‌ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ, అఫ్ఘనిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌లతోనూ జేపీ సింగ్ వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సమావేశాలపై భారత విదేశాంగ శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అఫ్ఘనిస్తాన్‌ రక్షణ శాఖ మాత్రం ఈ సమావేశాల వివరాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. మానవతా సాయం, వివిధ రంగాల్లో ఇరుదేశాల పరస్పర సహకారం వంటి అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగిందని తెలిపింది. కాగా, అఫ్ఘనిస్తాన్‌‌లోని తాలిబన్ ప్రభుత్వాన్ని ఇంకా భారత్ అధికారికంగా గుర్తించలేదు.

Advertisement

Next Story