మమ్మల్ని మనుషుల కిందే లెక్క వేయరు..!

by Ravi |   ( Updated:2024-11-25 00:30:54.0  )
మమ్మల్ని మనుషుల కిందే లెక్క వేయరు..!
X

చాలాకాలం క్రితం సలీం రచించిన ' కొండయ్యమ్మ ' అనే కథ చదివాను. పేద విద్యార్థుల కడుపు నింపేందుకు కొండయ్యమ్మ అనే ఓ హిజ్రా భోజన హోటల్ నడుపుతూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా తన ఆస్తి మొత్తాన్ని ఖర్చు చేయడం కథాంశం. వాస్తవ సంఘటన ఆధారంగా ఈ కథ రచించినట్లు సలీం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. హృదయాన్ని తాకే ఈ కథ చదివిన తర్వాత హిజ్రాల పట్ల నా అభిప్రాయం మారిపోయింది. మహాకవి గురజాడ చెప్పినట్టు మనుషుల్లో మంచీ చెడూ రెండే వర్గాలు ఉంటాయి. చెడు ఆలోచనలు కలిగిన వారు ఉన్నట్లే హిజ్రాల్లో కూడా కొందరు ఉండవచ్చు. కానీ, అందరూ హిజ్రాలూ అలా ఉండరు అనే వాస్తవాన్ని గ్రహించాలి.

మనం పరిశీలించలేని హిజ్రాల జీవన విధానాన్ని తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. కష్టాలు కన్నీళ్లు అవమానాల తోడుగా చిన్న చిన్న కోరికలతో జీవించే హిజ్రాలు ఉంటారు. మానవత్వంతో, విలువలతో బ్రతికే హిజ్రాలూ కనిపిస్తారు. హిజ్రాల నిజజీవితాలను తెలుసుకునే అవకాశం అరుదుగా కొన్ని పుస్తకాల ద్వారా లభిస్తుంది. అటువంటి అరుదైన పుస్తకమే ఒక హిజ్రా ఆత్మ కథ. " ఒక హిజ్రాగా నేను సమాజపు చివరి అంచుల్లోకి నెట్టబడ్డాను. అయినా నా జీవితాన్ని మీ ముందు పెట్టే సాహసం చేస్తున్నాను. హిజ్రాల జీవన విధానం గురించీ వారి ప్రత్యేక సంస్కృతి గురించీ, వారి కలలూ కోరికల గురించీ పాఠకులకు తెలియజెప్పడానికే ఈ పుస్తకం రాస్తున్నాను " అంటూ ఒక హిజ్రా ఆత్మ కథ రచయిత్రి ఎ. రేవతి చెబుతారు.

నిజ జీవితమే ఈ పుస్తకం..

' ఒక హిజ్రా ఆత్మ కథ ' ద్వారా రేవతి జీవితాన్ని చదివినప్పుడు నేటి సమాజంలో కనిపించే ఎందరో హిజ్రాల జీవితాలను కొంతైనా అర్థం చేసుకోవచ్చు. తమిళనాడులోని సేలం జిల్లా నామక్కల్ రేవతి స్వగ్రామం. రేవతి అసలు పేరు దొరైస్వామి. ఆర్థికంగా స్థిరపడిన ఓ కుటుంబంలో ఐదవ సంతానంగా దొరైస్వామి జన్మిస్తాడు. పదేళ్ల వయసున్నప్పుడే తను మగ శరీరంలో ఉన్న స్త్రీనని దొరైస్వామికి అర్థమవుతుంది. వయసుతో పాటు శరీరంలో సహజ సిద్ధంగా కలిగే మార్పులను అణుచుకోలేక, తల్లిదండ్రులతో కలిసి జీవించి వారిని ఇబ్బంది పెట్టలేక ఇల్లు వదిలి ఢిల్లీ చేరుతుంది. అక్కడ హిజ్రాల సమాజంలో కలిసిపోయి తన పేరును రేవతిగా మార్చుకుంటుంది. పూర్తిగా స్త్రీగా మారిపోవాలని భావించిన రేవతి శస్త్ర చికిత్స కోసం ముంబై చేరుతుంది. ముంబైలో ఎంతో ఖర్చు చేసి అత్యంత కఠినమైన శస్త్ర చికిత్స ద్వారా స్త్రీగా మారిపోతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ముంబైలో కొంతకాలం సెక్స్ వర్కర్ గా పనిచేస్తుంది. ఆ తర్వాత బెంగుళూరులోని సంగమ అనే స్వచ్ఛంద సేవా సంస్థ పరిచయం రేవతి జీవితాన్ని మార్చివేస్తుంది. ఆ సంస్థ ప్రోత్సాహంతోనే రేవతి తన నిజజీవిత కథను ' ఉనర్వుమ్ ఉరువమమ్ ' అనే పేరుతో తమిళంలో రచించారు. ఈ పుస్తకమే తెలుగులో 'ఒక హిజ్రా ఆత్మ కథ' గా పాఠకుల ముందుకు వచ్చింది.

వైవిధ్యం హిజ్రాల జీవితం..

ఈ పుస్తకం ద్వారా హిజ్రాల జీవితాన్ని పరిశీలించినప్పుడు వారిది ప్రత్యేక సాంప్రదాయ, ఆచార వ్యవహారాలు గల తెగగా పరిగణించవచ్చు. ఈ పుస్తకం ద్వారా హిజ్రాల జీవితంలోని కన్నీళ్లు, కష్టాలు, అవమానాలు, బ్రతుకు పోరాటాలను ప్రత్యక్షంగా చూడవచ్చు. కుటుంబ బంధాలకు దూరమై ఆత్మీయ పలకరింపు కోసం, నిజమైన ప్రేమ పూర్వక స్పర్శ కోసం తపించే హిజ్రాల అంతరంగాన్ని అర్థం చేసుకోవచ్చు. అత్యంత దుర్భరమైన స్థితిలో కేవలం కడుపు నింపుకునేందుకు సెక్స్ వర్కర్లుగా నెట్టివేయబడిన హిజ్రాల దయనీయ పరిస్థితులను గమనించవచ్చు. ఎలా జీవించాలో అర్థం కాక, ఆదరించేవారు లేక పనిచేయడానికి పని దొరక్క రైళ్లలో బస్టాండ్లలో వీధుల వెంట చప్పట్లు కొట్టుకుంటూ చిల్లర అడిగే హిజ్రాల వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు.

మనుషుల కిందే లెక్కేయరు..!

1985 - 2000 ప్రాంతంలో ఇటువంటి దుర్భరమైన జీవితాన్ని గడిపి, తన నిజ జీవితాన్నే అక్షరీకరించిన రేవతి, "స్త్రీలు పురుషులు అందరూ మమ్మల్ని వింతగా చూడడం ఒక్కొక్కసారి నవ్వుకోవడం వెక్కిరించటం చూసి, హిజ్రా జీవితం ఎంత బాధాకరమో కదా అనిపించింది. సాధారణ స్త్రీ పురుషులు వారి కుటుంబాలతో ఇట్లా బయటకు వచ్చినప్పుడు వారిని ఎవరైనా ఎగతాళి చేస్తారా ? అంగవైకల్యం కలవారిని గుడ్డివాడిని చూసి జాలిపడి సాయం చేస్తారు. ఎవరైనా శారీరకంగా గాయపడితే వారి కుటుంబమూ బయటవారూ కూడా సహాయానికి వస్తారు. మరి మేమో ! మమ్మల్ని మనుషుల కిందే లెక్క వేయరు" అంటూ తన ఆవేదనను ఈ పుస్తకం ద్వారా చెబుతారు.

మీ జాలి మాకొద్దు..!

సమాజంలో మేమూ మనుషులమే, మాకూ జీవించే హక్కు ఉంది, మాపై జాలి పడవద్దు, జాలి పడాల్సిన అవసరం లేనేలేదు, మమ్మల్ని గౌరవించండి అంటూ సమస్త హిజ్రాల గొంతుకగా సమాజానికి వినిపించే ప్రయత్నంలో రేవతి రాసిన ఆమె ఆత్మకథ తమిళ పాఠకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత్రి పి.సత్యవతి తెలుగు అనువాదం చేశారు. అనువాదంలో పూర్తి స్వేచ్ఛను తీసుకొన్న పి.సత్యవతి ఓ నవల చదువుతున్నంత ఆసక్తిగా ఈ పుస్తకాన్ని అనువదించారు.

"హక్కులు నిరాకరించబడి సమాజం అంచులకు నెట్టి వేయబడ్డ ఒక వ్యక్తిని నేను. ఎందుకంటే పురుషుడిగా పుట్టి స్త్రీగా జీవించాలనుకున్నందుకు ! నా జీవితంలో నిత్యం నేను ఎదుర్కొన్న వివక్ష, హేళన, వేదనే కాక నా సహనం, నా సంతోషం కూడా మీ ముందు పరిచేదే ఈ పుస్తకం. నా జీవిత చరిత్ర సమాజంలో మంచి మార్పులు తేగలదని ఆశిస్తున్నాను." అనే రేవతి మాటలు సఫలీకృతమైనట్లు ఈ పుస్తకం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది.

పుస్తకం పేరు : ఒక హిజ్రా ఆత్మ కథ

రచయిత్రి : ఎ.రేవతి

తెలుగు అనువాదం : పి.సత్యవతి

పేజీలు :154

వెల : 130

ప్రతులకు : హైదరాబాద్ బుక్ ట్రస్ట్

ఫోన్ : 040- 23521849


సమీక్షకులు

శిఖా సునీల్ కుమార్

99081 93534

Advertisement

Next Story

Most Viewed