- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాగిన రక్తం కవిత్వమైతే .. 'మణిపూర్ మంటలు'
ఇద్దరు స్త్రీల నగ్నదేహాలను నిస్సిగ్గుగా ఊరేగిస్తున్న దృశ్యం. మణిపూర్ మండుతుంటే, తెలుగునాట కూడా రక్తం సలసలా కాగిపోయింది. కాగిన రక్తం కవిత్వమై లావాలా ప్రవహించింది. 'మణిపూర్ మంటలు- కవిత గ్రహం' అక్షర రూపం ధరించింది. జాతుల మధ్య విభేదాలతో మణిపూర్ నెలల తరబడి తగలబడి పోతోంది. పాలకుల్ని తప్ప ప్రపంచాన్నంతా కదిలించిన దృశ్యం అది.
నగ్న యాత్రాయుగం
'మీ బతుకుంతా మా నగ్నదేహాల నెత్తురుతో చేసిన సంతకాల సోకాల్డ్ విజయాలే కదా! 'అరేయ్! ఎన్ని ఏళ్ళు అయినా మీ ప్రతీకారాలకి మా శరీరమే కదరా యుద్ధభూమి!' అంటారు కుపిత సింహంలా కుప్పిలి పద్మ. ఈ నగ్న ఊరేగింపు స్త్రీ దేహానికి కాదు ఈ దేశానికే అవమానం. అందుకే 'హస్తినాపుర రాజమందిరాలపై తనకు తాను అవనతమయ్యింది సిగ్గుతో జాతీయపతాక' అంటారు శరచ్చంద్ర జ్యోతిశ్రీ. 'నీ రాజదండానికి ఓ దండం, నీ కల్లబొల్లి మాటలకు ఓ దండం, మొత్తంగా నీ పాలన చరిత్రలో ఓ చీకటి అధ్యాయం' అని పి.ఎస్. మల్లేశ్వరరావు వ్యాఖ్యానిస్తే, 'ఉన్మాదుల ఉక్కు బూట్లు తొడుక్కున్న కన్నీరు!'గా అభివర్ణిస్తారు నల్లి ధర్మారావు. ‘నా తొడల మధ్య నీవు గాయపరిచిన నీ నిందా రూపకాన్ని నేను పీకి పారేస్తున్నాను' అంటుంది గుజరాతీ కవయిత్రి ప్రతిష్ట పాండ్య ధిక్కార స్వరం. 'ఈ యాత్ర కొనసాగుతూనే ఉంటుంది. మీరు నలిపిన పాలిండ్లు కటిక శిలలయ్యేవరకూ, గరళ బీజాలు నాటిన గర్భసంచుల్లో గన్నేరు కాయలు కాసేవరకూ! 'మాకు రాతి యుగాలు, లోహయుగాలు లేవు కేవలం నగ్నయాత్రా యుగాలు మాత్రమే' ఉన్నాయంటారు పాటిబండ్ల రజని. కార్గిల్ యుద్ధంలో ప్రాణాలొడ్డి పోరాడిన ఒక సైనికుడి భార్యను చెరబడుతుంటే ఆ వీరుడు నిస్సహాయుడై పోయాడు. 'నగ్న దేహాల నడుమ నిస్సిగ్గుగా నిలబడి చోద్యం చూస్తున్నా.. సిగ్గుబిళ్ళ మాకెందుకు అభిమానం లేని వాళ్ళం' అంటూ అతని ఆత్మఘోషను వినిపిస్తారు వెంకటేశ్వరరావు కట్టూరి. 'నా సహచరిని దిగంబరంగా, అదో సంబరంగా ఊరేగిస్తే, మూకలంతా కలిసి మూకుమ్మడిగా అత్యాచారం చేస్తే, కనీసం కాపాడుకోలేక, చేతగాక చేష్టలుడిగి చూస్తున్నా-అవును నేనో సిపాయిని..అప్పటి వీరసైనికుణ్ణి!! మరి ఇప్పుడో?..నేనొక ఓడిపోయిన సైనికుణ్ణి' అంటూ ఆ సైనికుడి మనోవేదనకు ప్రొఫెసర్ డాక్టర్ పొట్లూరి రవికిరణ్ అక్షరరూపమిస్తారు. 'సరిహద్దులో శత్రువును ఓడించిన సైనికుని భార్యను సహితం రక్షించుకోలేని హీనస్థితి!' అంటారు గొడుగు యాదగిరి రావు.
నాడు గుజరాత్, నేడు మణిపురం
మే 4వ తేదీ జరిగిన మహిళల నగ్న ఊరేగింపు దృశ్యం జరిగితే జులై 19న గానీ బయటికి రాలేదు. ఈ వీడియో చూసిన అత్యున్నత న్యాయస్థానం చలించిపోయి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులిస్తే కానీ, మన ప్రధానమంత్రి మణిపూర్ మారణ హోమంపై 36 సెకండ్లు మాట్లాడి రికార్డు సృష్టించారు. అందుకే 'హిమాలయమంత ఎత్తైన అధికారం మౌన జపం చేస్తున్నది' అని దామరకుంట శంకరయ్య ఎత్తిపొడుస్తారు. ‘నిత్యం న"మో”స్తుతి చేస్తూ 'షా' చేతిలో బందీనై 'మనీబాత్'లో మునిగి తేలుతూ మానాభిమానాలు మరిచిపోయా' అంటారు వెంకటేశ్వరరావు కట్టూరి. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పాలన సాగుతుండడంపై 'నాడు గుజరాత్ నేడు మణిపురం అంతా డబులింజన్ రాజ్యమే' అంటారు బంగారు విబి ఆచార్యులు. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని, ఇది మాత్రమే బైటికొచ్చిందని మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఎంతో స్థిత ప్రజ్ఞుడిలా అంటారు. ‘ద్రౌపది వస్త్రాపహరణకు సాక్ష్యంగా నిలిచిన కాలం తన ఆశక్తతకు తానే సిగ్గుపడింది' అంటారు షేక్ నసీమా బేగం.
మణిపూర్ కొండల్లో 'కొండల్నీ లోయల్నీ మైదానాల్ని విడగొట్టి ఒక్కదానికే పెత్తనమివ్వాలనుకోవడం వికారత్వం' అని దర్భశయనం శ్రీనివాసాచార్య అంటే, 'తెగల నడుమ తగువుబెట్టి సెగలు రేపే నీచులు-మతం మాటున మారణ హెూమం సలిపె రక్తపిపాసులు' అంటారు గంటేడ గౌరినాయుడు. గుజరాత్‌లో మతఘర్షణలను పురిగొల్పి, మారణ హెూమానికి కారణమైన పాలకులే మణిపూర్‌లో నేడు జాతుల మధ్య చిచ్చుపెట్టారన్న విషయాన్ని 'గుజరాత్‌లో నాడు గోధ్రా గాయాల రక్త చరిత-మణిపూరులో తిరిగి నేడు మండుతున్న నిత్య జ్వలిత' అంటారు వేల్పున నారాయణ. 'మీరు జన్మత: చీడపురుగులు చచ్చిపోండి!' అని నిర్మొహమాటంగా చెప్పేస్తారు బెల్లంకొండ ప్రసేన్.
ఒక్కో కవితలో నిప్పుకణికలు..
'అర్ధ నిక్కరు రాజ్యమేలుతున్న దేశం మనది' 'వాళ్ళిప్పుడు మనుషుల నెత్తురు మరిగిన పులులు' అంటారు కెంగార మోహన్. 'మీరు నమ్మే వాస్తు కూడా విస్తుపోతుంది-ముందు మీరు ఈశాన్యం ఖాళీ చేయండి, ఆ తరువాత దేశం మిమ్మల్ని ఖాళీచేయిస్తుంది' అంటారు బొల్లినేని నాగార్జున సాగర్. రామాయణంలో రావణాసురుడు సీతనెత్తుకెళితే, మహాభారతంలో ద్రౌపదిని దుశ్శాసనుడు వివస్త్రను చేశాడు. అందుకే 'మహిళల వస్త్రాపహరణాలు మనకేమీ కొత్తకాదు. దుఃఖపు కావ్యాలలో పుటలుపుటలుగా కనిపిస్తూనే ఉన్నాయి' అంటారు పుత్తూరి సుబ్బారావు. ఆ వారసత్వమేనా ఇది!? 'కీచకుడైనా ఆమె సౌందర్య విభ్రమంలో వివశుడయ్యాడే గాని కొనగోటితోనూ ఆమె దేహ వీణ మీటలేదు' అని మందరపు హైమవతి అంటారు. 'ఆమె దేహం మీద నువ్వొక రాచపుండువి- నువ్వు వివస్త్రను చేసింది ఒక దేహాన్ని కాదు, ఈ దేశాన్ని' అని హెచ్చరిస్తారు రామకృష్ణ సురగౌని.
'కుకీలమే... కుక్కిన పేనులం కాదు' అని బాధితుల తరపున చింతా అప్పలనాయుడు వారి ఆత్మాభిమానాన్ని వ్యక్తం చేస్తారు. 'కుకీ స్త్రీల కాగే కన్నీళ్ళకు దోసిలిపట్టి కవిత్వంపై చిలకరించాను' అంటారు శిఖామణి. 'దిగంబరంగా రాజ్యమేలుతున్న దౌష్ట్యాల భారానికి దేశపు జెండా అవనతమవుతున్నది' అంటారు జి. వెంకట కృష్ణ. ప్రధాని చెప్పిన అచ్చేదిన్ కాదు 'చచ్చేదిన్ కూడా వచ్చేశాయి' అంటారు డాక్టర్ ఎన్. ఈశ్వరరెడ్డి. 'ఇప్పుడు నమోదవుతున్న చరిత్ర అంతా రక్తచారికల మజిలీలేగా..!!” అంటారు డాక్టర్ పెరుగు రామకృష్ణ. మణిపూర్లో జాతి వైరం నగ్న ఊరేగింపులతో ఆగలేదు. 'నివాసాలకు నిప్పుపెట్టి, ప్రార్థనా మందిరాలు కూలగొట్టి జీసస్‌కు శిలువేస్తున్నారు' అంటారు ఉప్పల అప్పల రాజు. 'మీ మనువాదపు పెట్టుబడిదారి నిరంకుశత్వం అంతానికి మా నగ్నదేహాలు, మా శవాలు అణుబాంబులవుతున్నాయి' అని ఒక హెచ్చరిక చేస్తారు కాము.
అరసం ఏలూరు శాఖ అచ్చేసిన ఈ సంకలనంలో 39 కవితలున్నాయి. ఒక్కో కవితలో ఇలా అనేక నిప్పుకణికలున్నాయి. ఈ సంకలనంలోనే ఎం. ఎస్. రమాసుందరి 'లప్టోంమే మణిపూర్' అన్న పేరుతో ఈ కవితలకు హిందీ అనువాదం కూడా చేశారు. జబల్పూర్లో ఆగస్టులో జరిగిన ప్రొగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ జాతీయ సభల్లో 'మణిపూర్ మంటలు'ను ఆవిష్కరించారు. హిందీలోనూ ఉన్న ఈ కవితలు మణిపురి భాషలోకి అనువాదమయ్యే అవకాశాలు లేకపోలేదు.
సమీక్షకులు
రాఘవ శర్మ
సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు
94932 26180
- Tags
- manipur mantalu