పుస్తక సమీక్ష:నేటి కవిత్వానికి అవసరం... 'కవిత్వం-చర్చనీయాంశాలు'

by Ravi |   ( Updated:2023-08-20 18:45:57.0  )
పుస్తక సమీక్ష:నేటి కవిత్వానికి అవసరం... కవిత్వం-చర్చనీయాంశాలు
X

కవిత్వ ప్రేమికులకు, కవిత్వం రాసేవారికి, చదివే వారికి 'కవిత్వం - చర్చనీయాంశాలు' పుస్తకం ఒక మార్గదర్శి. 2021లో ఇది అచ్చయింది. అంతకుముందు రెండు సంవత్సరాల పాటు కవిసంగమం వేదికగా ఫేస్‌బుక్‌లో ధారావాహికగా ఈ శీర్షికతో ప్రతి సోమవారం వ్యాసాలు వచ్చాయి.ఇది రాసింది సాహితీ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు, మహా మేధావి, సుప్రసిద్ధ కవి, విమర్శకుడు, ప్రముఖ వక్త గుంటూరు లక్ష్మీ నరసయ్య రచించిన ఆ వ్యాసాల సమాహారం ఈ కవిత్వం చర్చనీయాంశాలు పుస్తకం.

ఈ వ్యక్తిలో కవి, విమర్శకుడు ఇద్దరూ ఉండటం వల్ల సమకాలీన కవుల కవిత్వంలో గుట్టు మట్లన్నీ అద్భుతంగా విశ్లేషించారు. నిష్పక్షపాత వైఖరితో నేటి కవిత్వాన్ని చదివి, ఏది కవిత్వం అవుతుంది, ఏది కవిత్వం కాదు, కవిత్వం అవటానికి కావలసిన పరికరాలు ఏవి ఇత్యాది విషయాలు స్పష్టంగా వివరించారు. కవిత్వ నిర్మాణ సూత్రాలను, పద్ధతులను ఈ పుస్తకం కూలంకషంగా చెప్పింది. ఈ వ్యాసాలు ధారావాహికగా వచ్చినప్పుడు వీటిపై పాఠకుల నుంచి విశేష స్పందన, ప్రశంసలు, కొన్ని శీర్షికలపై సీరియస్ చర్చ కూడా జరిగింది. పాఠకుల ఉత్తమ ప్రశ్నలకు, ఈ రచయిత వివరణ ఇచ్చారు.

ఆపకుండా చదివించగలిగే శక్తి..

ఈ పుస్తకంలో శీర్షికలు ఒక క్రమపద్ధతిలో, పాఠకులకు పఠనాసక్తి పెంపొందించేలా కూర్చారు. కవిత్వ కళ -కవిత్వనిర్మాణ పద్ధతుల పాత్ర, కవిత్వ రచనలో భాష ప్రమేయం, కవిత్వంలో టెంపర్‌మెంట్, కవిత్వం వివిధ చిక్కుముడులు, యాంటీ పోయెట్రీ ఇలాంటి శీర్షిక లిచ్చి, చివర అసలైన కవిత్వం ఏం చేస్తుంది, కవిత్వ విమర్శ ఎలా చేయాలి అంటూ ఉత్తమ కవిత్వం ఏదో, ఉత్త కవిత్వం ఏదో వివరించారు.

ఈ కవికి ఆధునికాంధ్ర, ఆంగ్ల సాహిత్యంతో విశేష పరిచయం, అధ్యయనం, విశ్లేషించగల నేర్పు, అస్పష్టతకు తావు లేకుండా పాఠక హృదయాలకు నేరుగా విషయాన్ని చేరవేయగల భాషా నైపుణ్యం, రచనా ప్రతిభ ఉండటం వల్ల ఈ పుస్తకం ఆద్యంతం ఆపకుండా చదివించగలిగే గుణం కలిగి ఉంది. ఎంతో మంది కవులను వీరు తమ పరిశీలనకు తీసుకున్నారు. ఎంతెంతో వివరణ ఇచ్చారు. నేడు వస్తున్న కవిత్వం చూడటానికి భాష చాలా సరళంగా, సులభంగా ఉంటుంది. కానీ అందులో ఉండే టెక్నిక్ గాని, ప్రతీకలు గాని కొందరికి ఒక పట్టాన అర్థం కావు.

ఇతర సాహిత్య ప్రక్రియలకు, విమర్శకు భేదం ఉంది. విమర్శ, ఇతర సాహిత్య ప్రక్రియల ఆధారంతో వెలిగే ప్రక్రియ. పాఠకుల బుద్ధికి అందని, తోచని కవిత్వపు లోతులని, కవితా సౌందర్యాన్ని టెక్నిక్‌ని విమర్శ ద్వారా అర్థం చేసుకుని ఆనందాన్ని, ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ పుస్తకం చేసిన పని అదే. ఇందులో ఉల్లేఖించిన కొన్ని కవితలు విషయపరంగా ఆ నేపధ్యాలతో పరిచయం లేని వారికి అర్థం కావు. లక్ష్మీ నరసయ్య చెప్పిన కవితల లోని కవిత్వంశాలతో పాటు విషయ వివరణ కూడా చదివాక పాఠకులకు వాటిపై ఒక సమగ్ర అవగాహన ఏర్పడుతుంది.

ఎందరో కవులకు దిక్సూచి..

కప్పి ఉంచేది కవిత్వం, విప్పి చెప్పేది విమర్శ 'అన్నారు సి. నా. రె. అలా కవిత్వంలో నిగూఢంగా ఉన్న విషయాలను సామాన్యులకు కూడా విప్పి చెప్పిందీ పుస్తకం. లక్ష్మీ నరసయ్య సమాజంలో ఎప్పటికప్పుడు వచ్చే మార్పులను నిశితంగా పరిశీలిస్తారు. ఇప్పటి కవుల కవిత్వంలో జీవిత వాస్తవికత కొరవడుతోందని చెప్పారు. కొంతమంది మాత్రమే క్వాలిటీ కవిత్వం రాస్తున్నారని అన్నారు. కవులు రాసే కవిత్వం వ్యవస్థను మార్చేదిగా ఉండాలని చెప్పారు. కవిత్వం రాయటానికి ఒక నియమిత సమయం అవసరం లేదని, ఎపుడు రాసినా చిత్త శుద్ధి, నిమగ్నత ఉండాలని కవులకు సూచించారు. రోజురోజుకి బలం పుంజుకుంటున్న కులతత్వాన్ని గురించి, మత మౌఢ్యాన్ని గురించి కవులు పట్టించుకోవట్లేదని చెప్పారు.

ఒక కావ్యం గానీ, కవితగానీ దాని గొప్పతనం అందరికీ తెలియాలంటే ఉత్తమ విమర్శకులు అవసరం. ఆ విమర్శకులకు సహృదయం, నిర్మొహమాటంగా చెప్పే తీరు అవసరం. ఇవి లక్ష్మీ నరసయ్యలో పుష్కలంగా ఉన్నాయనడానికి కవిత్వం చర్చనీయాంశాలు గొప్ప నిదర్శనం. ఈ వ్యాసాల పరంపర కన్న చాలా ముందుగా 1994 నుంచి 1997వరకూ ఈ రచయిత ఆంధ్ర జ్యోతి ఆదివారంలో కాలమిస్ట్‌గా కవితా నిర్మాణ పద్ధతులు, సామాజిక కళా విమర్శ గురించి వ్యాసాలు రాసారు. ఈ రెండూ పుస్తకరూపంలో వచ్చాయి.

కవిత్వ నిర్మాణ పద్ధతులలో భావం కవిత్వమయ్యే తీరును అనేక ఉదాహరణలతో వీరు వివరించారు. ఇది కవులకు, కవిత్వ పరిశోధకులకు ఎంతో మేలు చేసిన రచన. దారి చూపిన పుస్తకం. ఒక భావం కవిత్వం ఎలా అవుతుందో చాలా తేలికగా అర్థం అయ్యేలా చెప్పారు. కళ్ళు లోతుకు పీక్కుపోయాయని రాస్తే అది కవిత్వం కాదు. కళ్ల కింద బావులేర్పడ్డాయి అంటే కవిత్వం అవుతుంది. అంటే ఒక బాధ గాని, కోపాన్ని గాని, ఆనందాన్ని గాని ఉన్నది ఉన్నట్లు చెపితే కవిత్వం అవదు. అవి కేవలం భావాలుగానే మిగిలిపోతాయి. అవి ప్రత్యేక కవిత్వనిర్మాణం లోకి మారాలి. కళ్లకు ఏ మాత్రం సంబంధం లేని బావుల్ని తెచ్చి కళ్ల కింద అమర్చటంవల్ల, ఆయా వస్తువుల్ని మామూలు స్థానాల నుంచి వేరే వస్తువుల సరసన భిన్న స్థానాలలో నిలపటం వల్ల అది కవిత్వం అవుతుందని, ఇటువంటి నిర్మాణ పద్ధతిని వస్తు స్థానభ్రంశ పద్ధతి అంటున్నారని చెప్పారు. నిత్య వ్యవహారంలో వాడే కళ్ళు లోతుకీ పీక్కుపోయాయనే భావాన్ని ఎలా కవిత్వం చేయాలో అంత చక్కగా వివరించారు. ఇంకా ఇందులో అనేక ప్రముఖ ఆధునిక కవుల కవిత్వాన్ని తీసుకుని వానిలో కవిత్వంశాలను అద్భుతంగా వివరించారు.

కవిత్వం చర్చనీయాంశాలు ఎందరో కవులకు దిక్సూచి. ఈ పుస్తకం కవుల ఇంటి గ్రంధాలయం లోనూ, పబ్లిక్ గ్రంథాలయాల లోనూ తప్పక ఉండవలసిన పుస్తకం. కొత్తగా కవిత్వం రాస్తున్న కవులకు, భావాలను కవిత్వంగా చేయడానికి ఇబ్బంది పడేవారికి ఒక మార్గం చూపిస్తుంది. రాసేటప్పుడు కలిగే అనేక సందేహాలకు సమాధానం ఇస్తుంది. తెలుగు సాహిత్యం లోని ఉత్తమ గ్రంధాలలో ఒకటిగా నిలిచిపోయే రచన కవిత్వం చర్చనీయాంశాలు.!

ప్రతులకు

ప్రాచీ పబ్లికేషన్స్, ప్రజాశక్తి బుక్ హౌస్,

నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్,

నవచేతన, విశాలాంధ్ర, నవోదయ

వెల రూ. 380


సమీక్షకులు

డా. చెంగల్వ రామలక్ష్మి

63027 38678

Advertisement

Next Story

Most Viewed