- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- వీడియోలు
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిత్య చలనం మానవ జీవిత పరమార్థం
మానవ జీవనం వికాసం చెందాలంటే అంతో ఇంతో చలనశీలతను కలిగి ఉండాలి. ఇది ఎల్లప్పుడూ కొత్తవారితో కలవడం, కొత్త సంస్కృతులను అలవర్చుకోవడం, ప్రయాణాల వలననే సాధ్యపడుతుంది. ఒకప్పుడు ప్రయాణ సాధనాలు ఎక్కువగా లేని కాలంలో ఎక్కడివారక్కడ ఉండిపోవడంతో తెగలు, జాతులు, వర్గాలు ఏర్పడినాయి అంటుంటారు. అలాంటి క్లిష్టమైన సందర్భాల్లో కూడా యువాన్ త్సాంగ్, పాహియాన్, మార్కోపోలో మొదలగు విదేశీ యాత్రికులు కాలినడకన దేశాలు దాటి వచ్చి యాత్రా చరిత్రలను రచించి చరిత్రకు ఆధారాలను సమకూర్చారు.
ఆధునిక భారతదేశంలో ముఖ్యంగా తెలుగు నేలమీద యాత్రలు చేసి రచనను చేపట్టిన మొదటి వ్యక్తి ఏనుగుల వీరస్వామయ్య. ఇతడు 1830లో చెన్నై నుంచి వందమందితో ‘కాశి’ వరకు కాలినడకన నాలుగు వేల కిలోమీటర్లు యాత్ర కొనసాగించి ఆ తర్వాత ‘కాశీయాత్ర చరిత్ర’ను రాశాడు. మనకు తెలిసిన మొదటి తెలుగు యాత్రా చరిత్ర ఇదే. ఆ తర్వాత కాలంలో అదే చెన్నై నుండి ‘కోలా శేషాచలం’. ఇంగ్లీష్ అధికారుల వేసవి విడిది నీలగిరి (ఉదకమండలం)కి మరికొందరితో కలిసి కాలినడకన, ఎడ్ల బండి మీద వెళ్లి ‘నీలగిరి యాత్ర’ను రాశాడు. మరికొన్ని సంవత్సరాలకు ‘పోతం జానకమ్మ’ భర్తతో కలిసి ఇంగ్లాండ్ వెళ్లి వచ్చి ‘జానకమ్మ ఇంగ్లాండ్ యాత్ర’ అనే యాత్ర రచనలు చేశారు. ఒక స్త్రీ ఇంటి గడప దాటడం కూడా ఒక వింత అయిన 1873 నాటి రోజుల్లో ఆమె రచన ఒక డాక్యుమెంటరీగా నిలిచింది. ఆ తర్వాత నాయిని కృష్ణకుమారి గారి ‘కాశ్మీర దీపక కళిక’ వర్ణనాత్మక యాత్రారచనగా విమర్శకుల మన్ననలు పొందింది.
ఆధునిక యాత్ర రచన ప్రక్రియకు తర్వాత అనేకమంది సాహితీవేత్తలు కొత్త సొగసులు సమకూర్చుతూనే ఉన్నారు. అలాంటి ఒక ‘ఆధ్యాత్మిక నగ’నే ‘కూరెళ్ళ పద్మాచారి’ రచించిన ‘ఆధ్యాత్మిక దారుల్లో చార్ధామ్ యాత్ర’. ఆకర్షణీయమైన ముఖచిత్రంతో, చార్ధామ్ గురించిన అనేకమైన ఆశ్చర్య గొలిపే విశేషాలతో సాహితీపరులను విశేషంగా ఆకర్షిస్తున్నది ఈ యాత్ర చరిత్ర. 2022 మే నెల నాలుగో తారీఖున రచయిత తన కుటుంబంతో కలిసి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని 'చార్ధామ్' ను సందర్శించి వచ్చాడు. సాధారణంగా జీవితంలో పెళ్లి రోజులకు, పుట్టిన రోజులకు విశిష్ట ప్రాధాన్యతనిస్తారు. ఆ సందర్భంగా విందులు, వినోదాలతో గడుపుతుంటారు. పద్మాచారి మాత్రం తన 25వ పెళ్లిరోజును ప్రత్యేకంగా జరుపుకోవాలని ఈ యాత్రను తలపెట్టాడు. ఊహ తెలిసినప్పటి నుంచి ‘యాత్రాభిలాషి’ అయిన రచయిత ఈ ప్రత్యేక దినాన్ని ఇలా గాక ఎలా జరుపుకుంటాడు?
హైదరాబాదులో మొదలైన దగ్గర నుండి ఢిల్లీ, హరిద్వార్, యమునోత్రి, ఉత్తరకాశి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ మాన, రుషికేశ్ మీదుగా యాత్ర కొనసాగి తిరిగి ఢిల్లీకి చేరుకుని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తన రచన ముగుస్తుంది. రచయిత ఇంతకుముందు ఎలాంటి పుస్తకం రాసిన దాఖలాలు లేవు. అయినా సరే మొదటి ప్రయత్నంలోనే అక్కడి మంచు పర్వతాలను, మందాకిని, అలకనంద, గంగా నదుల సోయగాలను చూసి ఆత్మ ప్రేరితమయి మనోహరంగా ఈ యాత్ర రచన చేశాడు.
తెలుగు సాహిత్యాన్ని చదువుకొని వేల మంది విద్యార్థులకు సాహిత్య స్పర్శ కలిగించిన అనుభవంతో రచయిత తన యాత్ర చరిత్రకు సాహిత్య విలువలను కలిగించారు. విమానంలో వెళ్తూ మబ్బులను చూసి కాళిదాసు ‘మేఘసందేశాన్ని’, తోటి ప్రయాణికుల యాత్రాభిలాషను అర్థం చేసుకొని ‘మను చరిత్ర’లోని సిద్ధుడిని, హిమాలయాల అందాన్ని చూసి అల్లసాని పెద్దన ‘అటగనికాంచే’ పద్యాన్ని, డాక్టర్ సి.నారాయణరెడ్డి గారి...‘అహో... హిమవన్నగము’ అనే పాటను, గౌరీ కుండ్‌లో పార్వతి తపస్సు సందర్భంగా ‘ఎక్కడ లేరే వేల్పులు...’ అనే పద్యాన్ని మనసులో స్మరించుకున్నాడు. సాహిత్య లోతులను చూసిన వారికే ఇలాంటి సందర్భోచిత భావన కలుగుతుంది. ఒక సందర్భంలో మందాకిని నది పరవళ్లతో ఆడుకుందామనుకున్న రచయిత బస్సు నుండి దిగి లోయలోకి పరిగెత్తడంతో బస్సులోని వారందరూ అతన్ని అనుసరించారు. ఆ సందర్భంగా రచయిత ‘వైకుంఠమే కదిలింది’ అనడంలో పోతన భాగవతంలోని గజేంద్రమోక్షం సన్నివేశం తలుపులోనికొస్తుంది. ఇలా సాహిత్య సుగంధాలతో నిండిన ఈ యాత్ర చరిత్ర సాహిత్య ప్రేమికులను అలరిస్తుందనడం లో సందేహమే లేదు.
తన యాత్ర చరిత్రను చార్ధామ్ యాత్ర-సంసిద్ధత, అక్షరధామ్, హరిద్వార్, యమునోత్రివైపు ప్రయాణం, యమునోత్రి, ఉత్తరకాశి, గంగోత్రి, కేదార్నాథ్ ప్రయాణం, కేదారేశ్వర క్షేత్రం, రాంపూర్ కు తిరుగు ప్రయాణం, బద్రీనాథ్ ప్రయాణం, బద్రీనాథ్, బద్రీనాథ్ చుట్టుపక్కల, ఢిల్లీకి తిరుగు ప్రయాణం, ఢిల్లీ సందర్శన అనే 15 ప్రకరణాలుగా పేర్లు పెట్టడం రచయిత కచ్చితత్వానికి నిదర్శనంగా తెలుస్తుంది. తద్వారా యాత్ర మార్గదర్శిగా ఈ పుస్తకం ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.
ఏ విధంగానైతే ఏనుగుల వీరాస్వామి, కోలా శేషాచలం కవులు తమ యాత్ర చరిత్రలను తమ స్నేహితులకు అంకితమిచ్చుకొని ‘స్నేహ చరిత్ర’లో నిలిచిపోయారో అలాగే పద్మాచారి కూడా తన స్నేహితుడు, నిత్య యాత్రాభిలాషి, కరీంనగర్ అదనపు కలెక్టర్ గాజుల శ్యాంప్రసాద్ కి అంకితమిచ్చి తన స్నేహాన్ని ఈ పుస్తకం మనుగడలో ఉన్నంతవరకు చిరస్థాయిగా నిలుపుకున్నాడు.
దారి పొడవునా రచయిత ఆధ్యాత్మిక దృష్టే కాకుండా మానవీయ కోణంలో కూడా యాత్ర సాగిందని చెప్పవచ్చు. ఉత్తరాఖండ్ పర్వతాల రాష్ట్రం కాబట్టి చలికాలం వచ్చిందంటే కొండలన్నీ మంచు ముసుగులు వేసుకుంటాయి. యాత్రలోని గుడులన్నీ ఆ సమయంలో మూసుకొనిపోతాయి. మరి అక్కడ ప్రజలు ముఖ్యంగా గుర్రం నడిపేవాళ్ళు, పల్లకీలు మోసే వాళ్లు, చిరు వ్యాపారుల జీవనమెట్లా అనే కోణంలో రచయిత మనసు పరిపరి విధాలపోతుంది. అదే విషయం వారినే అడిగితే ఆరు నెలలు రోడ్డు మరమ్మత్తు పనులకు, వ్యవసాయంలో కూలీ పనులకు వెళ్తామని చెప్పారు. పొట్ట చేత పట్టుకొని నేపాల్ మరికొన్ని ఈశాన్య దేశాల గుండా కూలి పని కోసం చార్ధామ్ వస్తారట. ‘ఆకలి దేశాన్ని దాటిస్తుంద’ని రచయిత నిర్వేదంతో చెబుతాడు.
తన యాత్ర గమనంలో తోటి ప్రయాణికుడికి కుక్క కరవడం, ప్రశాంత హృదయంలో దుఃఖానికి యమునా నది(యమున కన్నీరు) ప్రవాహానికి లంకె పెట్టి సారూపాన్ని సాధించడం, కుతుబ్మినార్ ను మాస్కులతో సందర్శించి బస్సు ఎక్కగానే ఊపిరాడక మాస్కులను తీసేసరికి పోలీసులు ఫైన్ వేసి రసీదులు ఇవ్వకుండానే ఉడాయించడం ఇవన్నీ ప్రయాణంలో పదనిసలే. ముఖ్యంగా ఢిల్లీ సందర్శనలో అక్షరధామ్ యాత్ర కన్నుల కమనీయం. సృష్టికి ప్రతి సృష్టి చేసే మానవ మేధస్సును మన కళ్ళముందు ఆవిష్కరించాడు రచయిత. పుస్తకంలో రచయిత సాహిత్య చెనుకులు అక్కడక్కడ పాఠకులను అలరిస్తాయి. నదుల కలయికను రాజకీయ సమీకరణాలతో పోల్చడం, కాలం కర్పూరంలా కరిగిపోవడం, కాలం బస్సు చక్రాల కింద పడి నలిగిపోవడం, గొంతు దిగిన కాఫీ ఆనంద భైరవి రాగాన్ని ఎత్తుకోవడం, సుందర దృశ్యాలను చూసి బస్సు గవాక్షం నుండే తోడుకొని గుండెల్లో నింపుకోవడం, ఉత్సాహం ముందు కొండలు చిన్నవవుతుండడం, గుర్రాల మెడలో కంచు గంటల శబ్దం అలకనంద నది మద్దెల చప్పుడు- రెండూ కలిసి సంగీత జుగల్‌బందిలా ఉందనడం, హెలికాప్టర్లు తుమ్మెదల్లా ఎగురుతుండడం మొదలగు వాక్యాలు రచయిత కల్పనా శక్తికి ఉదాహరణలు.
ఈ విధంగా ‘ఆధ్యాత్మిక దారుల్లో చార్ధామ్ యాత్ర’ అనే రచన పూర్తిగా సాహిత్య గుబాళింపులతో పాఠకులను అలరిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. .‘తిరిగే తుమ్మెదకే తేనె దొరుకుతుంద’నే ప్రొ. ఆదినారాయణ అభివ్యక్తితో పుస్తక రచన మొదలుపెట్టిన రచయిత, తన పుస్తకం ఎలా ఉండబోతుందో ముందే ఆవిష్కరించాడు. ఇంకా పరిపుష్టం చేయవలసిన ‘యాత్ర చరిత్ర’ అనే ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తున్న ‘కూరెళ్ల పద్మాచారి’ నిజంగా అభినందనీయుడు. ఇదే స్ఫూర్తితో మరికొన్ని యాత్రలు చేసి పాఠకులను రంజింపచేస్తాడని, సాహిత్య లోకంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడని అభిలాషిద్దాం.
పుటలు 120, వెల రూ. 150.
ప్రతులకు: కె. మంజుల
98855 87783
సమీక్షకులు
దాసోజు జ్ఞానేశ్వరాచారి
99121 38152