Sabarimala: తెరుచుకున్న శబరిమల ఆలయం.. రేపటి నుంచి దర్శనానికి అనుమతి

by Mahesh Kanagandla |
Sabarimala: తెరుచుకున్న శబరిమల ఆలయం.. రేపటి నుంచి దర్శనానికి అనుమతి
X

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలో మండల-మకరవిళక్కు వార్షిక పండుగ సీజన్ శనివారం ప్రారంభమైంది. శుక్రవారం సాయంత్రం శబరిమల ఆలయ(Sabarimala Temple) ద్వారాలు తెరుచుకున్నాయి. మధ్యాహ్నం నుంచి పంపా బేస్ నుంచి శబరిమల కొండ ఎక్కడానికి పోలీసులు అనుమతించారు. శనివారం ఉదయం నుంచి శబరిమల అయ్యప్ప(Lord Ayyappa) దర్శనానికి భక్తుల(Devotees)కు అనుమతి ఉంటుందని వివరించారు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ గర్భగుడిని ప్రధాన అర్చకుడు అరుణ్ కుమార్ నబూద్రి తెరుస్తారని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు(Travancore devaswom board) తెలిపింది. దర్శనం కోసం వర్చువల్ క్యూ బుకింగ్‌లు నవంబర్ 29వ తేదీ వరకు పూర్తయ్యాయని పేర్కొంది. వర్చువల్ స్లాట్ బుక్ చేసుకోనివారికోసం స్పాట్ బుకింగ్స్ ఏర్పాటు కూడా చేశామని, ఇక్కడ అదనంగా ప్రతి రోజు 10 వేల మంది భక్తులకు దర్శనం కోసం బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్టు వివరించింది. శబరిమలకు వచ్చిన ప్రతి భక్తుడు.. కేవలం ఇరుముడికట్టుతో వచ్చినవారు కూడా దైవదర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశామని హామీ ఇచ్చింది. ట్రాఫిక్ ఎక్కువైనా పరిస్థితులను సమర్థవంగా నియంత్రించడానికి అదనపు ఏర్పాట్లు చేయడానికీ సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. శనివారం ఉదయం నుంచే అధికారికంగా మండల ఫెస్టివ్ సీజన్ ప్రారంభమవుతుంది. ఇది వచ్చే నెల 26వ తేదీ వరకు కొనసాగుతుంది. వచ్చే నెల 30వ తేదీన మకరవిళక్కు సీజన్ ప్రారంభమై వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ వరకు సాగుతుంది. ఈ ఫెస్టివ్ సీజన్‌లో ప్రతి రోజూ 18 గంటలపాటు దర్శనాలకు అనుమతి ఉంటుంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తుల దర్శనాలు ఉంటాయి. ఈ సీజన్‌లో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి కేరళ పొరుగు రాష్ట్రాల నుంచీ పెద్ద మొత్తంలో భక్తులు తరలివస్తారు.

Advertisement

Next Story

Most Viewed