తెరపైకి కొత్త మున్సిపాలిటీలు..?

by Sumithra |
తెరపైకి కొత్త మున్సిపాలిటీలు..?
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 2 మున్సిపల్ కార్పొరేషన్లు 12 పురపాలక సంఘాలను ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయం మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా పురపాలక సంఘాలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తెరపైకి వస్తున్నది. మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్ గా ప్రకటించిన నేపథ్యంలో పాత ఉమ్మడి జిల్లా కేంద్రం ఆదిలాబాద్ ను సైతం కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా వినిపిస్తున్నది. మేజర్ గ్రామపంచాయతీలుగా ఉన్న అనేక గ్రామపంచాయతీలను కొత్తగా మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

ఇందుకు ఆయా మేజర్ పంచాయతీల తాజా మాజీ సర్పంచులు సహా ఇతర ప్రజాప్రతినిధులు సంబంధిత నియోజకవర్గాల ఎమ్మెల్యేల పై ఒత్తిడి పెంచుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఉమ్మడి జిల్లాలో పలు మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చాలన్న విజ్ఞప్తులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పురపాలక సంఘాలకు మళ్ళీ గ్రేడ్లు ఖరారు చేస్తున్న నేపథ్యంలో గతంలో ఉన్న నగర పంచాయతీల ఏర్పాటు పై కూడా చర్చ మొదలైంది. ఇప్పుడు ఉన్న మేజర్ పంచాయతీలను పంచాయతీరాజ్ పరిధి నుంచి పురపాలక శాఖ పరిధిలోకి మార్చి నగర పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని లేదంటే గ్రేడ్ 3 మున్సిపాలిటీలుగా మార్చాలని కోరుతున్నారు. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ తో పాటు శాసనసభ్యులు పార్లమెంటు సభ్యుల ఒత్తిడి పెరిగితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 10 కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది.

మున్సిపాలిటీల ఏర్పాటుకు పెరుగనున్న డిమాండ్.. ఉమ్మడి జిల్లాలో పదికి పైగానే...

గత ప్రభుత్వంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖానాపూర్, లక్షెట్టిపేట, చెన్నూర్, క్యాతన్ పల్లి, నస్పూర్, ఆసిఫాబాద్ తదితర మున్సిపాలిటీలు ఏర్పాటు అయ్యాయి. అప్పటి జనాభా ప్రాతిపదికన మరికొన్ని మున్సిపాలిటీలుగా ఏర్పాటు అయ్యే అవకాశం ఉన్నప్పటికీ అప్పటి రాజకీయ సమీకరణలు, ప్రభుత్వ నిర్ణయం మేరకు మరికొన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు కాకుండా నిలిచిపోయాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీలను ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో మరిన్ని మున్సిపాలిటీల ఏర్పాటుకు డిమాండ్ పెరుగుతోంది. నిర్మల్ జిల్లాలో పాత తాలూకా కేంద్రం ముధోల్, కుబీర్ , నర్సాపూర్ జి, దిలావర్ పూర్ గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో బోథ్, ఇచ్చోడ, మావల పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చాలన్న డిమాండ్ పెరగనుంది అయితే ఏజెన్సీ కేంద్రం ఉట్నూర్ కూడా మున్సిపాలిటీ ఏర్పాటు అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ 1/70 చట్టం అడ్డంకిగా మారుతున్నది. ఆసిఫాబాద్ జిల్లాలో వాంకిడి, సిర్పూర్ టి పంచాయతీలతో పాటు మంచిర్యాల జిల్లాలో జన్నారం, దండేపల్లి లను మున్సిపాలిటీలుగా మార్చాలన్న ప్రతిపాదనలు తెరపైకి రావచ్చు.

చిన్న, పరిసర గ్రామాలను కలిపితే సరి..!

కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న రేవంత్ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే పట్టణాభివృద్ధి నిధులను సహేతుకంగా వినియోగించేందుకు అనేక గ్రామపంచాయతీలను పురపాలక సంఘాలుగా ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతుండడంతో త్వరలోనే మరిన్ని మున్సిపాలిటీలు ఏర్పాటుకు దారులు సుగమం అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్న మేజర్ పంచాయతీల జనాభా ఓటర్ల జాబితా ప్రకారం పక్కనే ఉన్న చిన్న పరిసర గ్రామాలను విలీనం చేస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కచ్చితంగా 10కి పైగా కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు నిర్మల్ జిల్లాలోని ముధోల్ మేజర్ గ్రామపంచాయతీ తీరును పరిశీలిస్తే... 2011 జనాభా లెక్కల ప్రకారం ఆ పంచాయతీ జనాభా 12, 777 గా ఉంది. వాస్తవానికి ప్రస్తుతం ఆ పంచాయతీ జనాభా సుమారు 18 వేలు ఉన్నట్లు అంచనా. ఓటర్లు సైతం 10070 మంది ఉన్నారు. ఈ మేజర్ పంచాయతీకి సరిగ్గా కిలోమీటర్ పరిధిలోనే విట్టోలి, తరోడ గ్రామాలు ఉన్నాయి ఈ రెండింటిని విలీనం చేస్తే మరో 5 నుంచి 6 వేల జనాభా పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే అటు ఇటుగా 25 వేల జనాభాతో ముధోల్ పురపాలక సంఘం గా ఏర్పడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇదే రీతిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 10 పురపాలక సంఘాల ఏర్పాటుకు అవకాశం ఉందని అధికార వర్గాలు అంగీకరిస్తున్నాయి. రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు జరుగుతున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులపై ఒత్తిడి పెరగనుంది.

ఆదిలాబాద్ కార్పొరేషన్..?

మంచిర్యాల పురపాలక సంఘం ఇటీవలనే కార్పొరేషన్ గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి పాత జిల్లా కేంద్రం ఆదిలాబాద్ ను కార్పొరేషన్ గా మార్చాలన్న డిమాండ్ కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది గతంలోనే అన్ని జిల్లా కేంద్రాలను పురపాలక సంఘాలుగా మార్చినప్పటికీ అప్పటి ప్రభుత్వం ఆదిలాబాద్ ను విస్మరించింది. అప్పట్లోనే ఆదిలాబాద్ కార్పొరేషన్ పై చర్చ కూడా జరిగింది. తాజాగా మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆదిలాబాద్ ను పక్కనే ఉన్న మావల మేజర్ పంచాయతీ, బట్టి సావర్ గావ్ సహా పట్టణాన్ని ఆనుకుని ఉన్న మరో నాలుగు గ్రామాలను కలిపితే కార్పొరేషన్ గా అవతరించే అవకాశం ఉంది. ఎంపీ నగేష్ అక్కడి శాసనసభ్యులు చిత్తశుద్ధితో ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తే ఆదిలాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు కావడం ఖాయం అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మున్సిపాలిటీలుగా మార్చిన తర్వాతనే ఎన్నికలు జరపాలి.. వెంకటాపూర్ రాజేందర్, తాజా మాజీ సర్పంచ్, ముధోల్

సీఎం రేవంత్ నేతృత్వంలో గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ముధోల్ సహా ఉమ్మడి జిల్లాలో అనేక మేజర్ పంచాయతీలు మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి 2011 లెక్కల ప్రకారం జనాభా తక్కువగా చూపుతున్నారు సుమారు 15 సంవత్సరాల క్రితం జరిగిన జనాభా లెక్కలతో గ్రామపంచాయతీలను అలాగే ఉంచడం సరికాదు తాజాగా జరుగుతున్న కుల గణన సర్వే మేరకు అన్ని గ్రామాల జనాభా లెక్క తేలుతుంది. ముధోల్ సహా అనేక మేజర్ పంచాయతీలు మున్సిపాలిటీలు గా మారేందుకు అవకాశం ఉంటుంది అయితే మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీలుగా ప్రకటించిన తర్వాతనే ఎన్నికలు జరిపితే బాగుంటుంది.

Advertisement

Next Story

Most Viewed