అంతరంగం: బహుజనులను ఆలోచనల్లో పడేసే పుస్తకం!

by Ravi |   ( Updated:2023-08-27 19:15:33.0  )
అంతరంగం: బహుజనులను ఆలోచనల్లో పడేసే పుస్తకం!
X

ప్రఖ్యాత చరిత్ర పరిశోధకుడు రచయిత డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ ఎప్పుడూ కొత్త కొత్త చరిత్రాత్మకమైన పుస్తకాలు వెలువరిస్తరు. మొన్ననే ‘రెడ్లు, వెలమలేనా! బీసీలు సీఎం కావద్దా’ అనే పుస్తకం విడుదల చేసిండు. ఈ పుస్తకం చదివితే వెనుకబడేసిన కులాల వారు ఆలోచనల్లో పడుతరు.

అంతటా బీసీలే..కానీ

నిజానికి దేశంలో బహుజనులు అంటే వందల ఏళ్ళ నుంచి చేతివృత్తులు, సేవా వృత్తులు చేస్తూ సమాజానికి అంకితమైన వాల్లు. వాల్లను బీసీలు అంటరు. బీసీలు అంటే వెనుకబడిన వర్గాలు అనే అర్థంలో వాడుతారు కానీ వాల్లను వెనుకకు ఉంచేసిన కులాలు. ఏమీ శ్రమ చెయ్యకుండా ఏ ఉత్పత్తిలో సంబంధం లేకుండా ఏ సేవతోనూ సంబంధం లేక పైగా పెత్తనం చెలాయించే వర్గాలు కొన్ని ఉంటాయి. వాల్లదే అధికారం అవుతుంది. రాజకీయ పార్టీలు వాల్లవే, పరిపాలనా వాల్లదే... నిజానికి ఆ వర్గం వాల్లు తిప్పి తిప్పి కొడితే పదిహేను శాతం మందే ఉంటరు. అంతటా ఆధిపత్యం. విధానాల కాడ, నిర్ణయాల కాడ వాల్లు, జెండాల కాడా, ఫ్లెక్సీలు కట్టే కాడ బీసీలు. ఇట్లా నడుస్తున్న విషయాలు లెక్కలతో సహా పుస్తకంలో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ గానీ తెలంగాణ గానీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ వర్గం ముఖ్యమంత్రి అవుతారు ఇట్లా రెడ్లు, వెలమలు అక్కడైతే కమ్మలదే రాజ్యం అవుతుంది. ఒకరు ముఖ్యమంత్రిగా పాలన చేపట్టిండంటే ఆ వర్గం పెద్ద పెద్ద కాంట్రాక్ట్‌లు, పెద్ద పెద్ద హోదాల నామినేటెడ్ పోస్టులు అన్నింటిలో ప్రాతినిధ్యం ఎక్కువ ఉంటది. మిగతా కులాల కూడా ఉంటాయి గానీ అసలు కాడికి రానివ్వరు.

ఆధిపత్య కులాలే ముందు..

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే కమ్మలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే రెడ్లు, బీఆర్ఎస్ అధికారంలో ఉంటే వెలమలు ప్రాబల్యంలో అన్ని రంగాల్లో దూసుకపోతారు. బీజేపీ, కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే ఒక వర్గం కులాల ప్రాబల్యం కనిపించదు. అవి సిద్ధాంతం మీద పనిచేస్తాయి. వాల్ల సిద్ధాంతాలు వాల్లను నడిపిస్తాయి. కమ్యూనిస్టులు అధికారంలోకి రానూ రానూ దూరం అవుతున్నారు గానీ బీజేపీ అధికారం వైపు తను హిందూ రాష్ట్ర సిద్ధాంతం ప్రచారంగా ముందుకు సాగుతుంది. అయితే ఈ రెండు పార్టీలు పవర్‌లోకి వచ్చినా బహుజనుల ప్రాబల్యం ఉండది. ఎక్కడ చూడు ఆధిపత్య కులాలే ముందు వరుసలో ఉంటాయి.

కానీ బీసీలు ఎప్పుడూ ఆయా పార్టీల్లో నాయకత్వంలోకి రాకుండా వ్యూహాలు ఉంటాయి. ప్రజా ప్రతినిధులుగా ఎదగకుండా అడ్డంకులు సృష్టిస్తారు. రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ కులాలకు తెగలకు ఎన్నికల్లో రిజర్వేషన్ ఉండటం వల్ల ఆ వర్గాలకు తప్పనిసరిగా ప్రాతినిధ్యం దొరుకుతుంది. మరి బీసీలకు ఈ వెసులుబాటు లేదు. పైన ఉన్నవాల్ల నిర్ణయం వల్లను టికెట్లు ఇస్తే గెలిస్తే పరమపదసోపానం దాటి పైకి వెళ్ళాల్సిందే.

ఓట్లు మావి..సీట్లు మీవా?

ఈ సంవత్సరం చివరలో తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల టికెట్లలో కేవలం 23 మంది మాత్రమే బీసీ అభ్యర్థులున్నారు. అందులో అతి తక్కువ జనాభా గల ఇతర ఆధిపత్య కులాలకు 58 మందికి కేటాయించారు. దాదాపుగా ఇతర పార్టీల్లోనూ ఇలాగే ఉండవచ్చు. బహుజనుల జనాభా శాతం ఎక్కువ. ఇదివరకటిలాగా కాకుండా అన్ని రంగాల్లో ముందున్నారు. కానీ రాజకీయ అధికారం మాకే కావాలనే కలలు మాత్రం కనడం లేదు. బహుజనులు బహుజనేతర పార్టీ చత్రి కింద పని చేయడానికే మిగిలిపోయారు. అందుకే కాన్షీరాం ‘ఓట్లు మావి సీట్లు మీవా’ అన్ని నినాదం 1980 ప్రాంతంలో అన్ని రాజకీయ పక్షాలను కదిలించింది. కానీ ఆ పార్టీ వెనక సమాజం ఓట్ల రూపంలో పోలరైజేషన్ కాలేదు.

ఈ సందర్భంలో తెలంగాణ అస్తిత్వం బహుజన అస్తిత్వ కోణంలో సంగిశెట్టి శ్రీనివాస్ గత రెండు దశాబ్దాలుగా గొప్ప పరిశోధన కొనసాగిస్తున్నారు. తాను ఇదివరకు ‘ఫూలే జీవిత చరిత్ర’ జర్నలిస్ట్‌గా అంబేద్కర్, తొలి సంస్కర్త గాజుల లక్ష్మీనరసు శెట్టి, సోషల్ సైంటిస్ట్ సావిత్రిభాయి పుస్తకాలు రాసి వెలువరించారు మరిన్నో విలువైన పుస్తకాలకు సంపాదకత్వం వహిస్తున్నారు. 'ఈ రెడ్లు వెలమలేనా! బీసీలు సీఎంలు కావొద్దా' అనే పుస్తకం అన్ని రాజకీయ పార్టీల్లోని బహుజనులు కొనుక్కొని తెప్పించుకొని చదవాల్సిన అవసరం ఉన్నది.

సంగిశెట్టి శ్రీనివాస్ ఫోన్ నెం-98492 20321. ఈ పుస్తకం ఫోరమ్ ఫర్ కన్సర్న్‌డ్ బీసీస్ అనే సంస్థ ప్రచురించింది.

-అన్నవరం దేవేందర్

94407 63479

Advertisement

Next Story