దసరాకు అలా.. దీపావళికి ఇలా.. వారు ఆ మధ్యం షాప్‌ను వదలట్లే

by Sridhar Babu |
దసరాకు అలా.. దీపావళికి ఇలా.. వారు ఆ మధ్యం షాప్‌ను వదలట్లే
X

దిశ, అశ్వారావుపేట టౌన్: ఊరి పొలిమేరలో నిర్మానుష్య ప్రాంతంలో ఉండే దుకాణం కావడం వల్లనో, ఆంధ్రా సరిహద్దు కావడమో.. మద్యానికి ఎక్కువ డిమాండ్ కారణమో లేదా స్థానిక మద్యం సిండికేట్ మాయాజాలమో తెలియదుగానీ..? నెల రోజుల వ్యవధిలోనే వరుసగా రెండుసార్లు ఓ మద్యం దుకాణం చోరీకి గురైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో ఉట్లపల్లి రోడ్డులోని సరమ్మ మద్యం దుకాణం‌లో బుధవారం రాత్రి దొంగలు పడ్డారు. వెనుక భాగంలోని గోడకు రంధ్రం చేసి దుకాణం లోకి ప్రవేశించిన దొంగలు సుమారు లక్ష రూపాయలు విలువ చేసే ఖరీదైన మద్యాన్ని దోచుకుపోయారు. గురువారం ఉదయం దుకాణం తెరిచిన నిర్వాహకులు మద్యం చోరీకి గురైనట్లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న అశ్వారావుపేట ఎస్‌ఐ ఊకే రామ్మూర్తి ఘటనా స్థలానికి చేరుకొని చోరీ జరిగిన విధానాన్ని పరిశీలించి, షాపు నిర్వాహకుల వద్దనుంచి వివరాలు సేకరించారు.

నెలరోజులు కాకముందే రెండోవసారి చోరీ

గత నెల అక్టోబర్ 6వ తారీఖున ఇదే మద్యం దుకాణంలో చోరి జరిగి సుమారు రెండు లక్షల రూపాయలు విలువ చేసే మద్యం సీసాలను దుండగులు ఎత్తుకు పోయారు. దీంతో హుటాహుటిన జిల్లా కేంద్రం నుంచి క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించి వెళ్లారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఆ కేసు చిక్కుముడి ఇప్పటికీ ఇంకా వీడలేదు. అంతలోనే మరోమారు అదే దుకాణంలో నెల రోజులు గడవక ముందే మళ్లీ దొంగలు పడి దోచుకుపోవడం గమనార్హం. అయితే మొదటిసారి చోరీలో చీప్ లిక్కర్ ఎత్తుకెళ్లిన దొంగలు, రెండవ సారి జరిగిన చోరీలో మాత్రం కాస్ట్లీ మద్యాన్ని అపహరించుకుపోవడం విశేషం. మొదటి చోరీ దసరా పండుగ సీజన్ ప్రారంభంలో జరిగితే రెండవ చోరీ దీపావళి పండుగ ముందు రోజు జరగడం మరో విశేషం. దీంతో సరమ్మ మద్యం దుకాణం టార్గెట్‌గా దొంగలు పండగ చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 31తో ముగిసి పోవాల్సిన మద్యం దుకాణాదారుల లైసెన్సులను నవంబర్ 30 వరకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్థానిక మద్యం సిండికేట్ విభిన్న తరహాలో బెల్ట్ షాపుల ద్వారా వ్యాపారాన్ని నిర్వహిస్తుంటారు. ఇలా పలు నేపథ్యాల మధ్య వరుసగా చోరీలు జరగడం ప్రాధాన్యతను సంతరించుకుని, సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed