- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Disha Special Story: మీ ఫుడ్ ప్రొడక్ట్స్ కి ఓ దండంరా.. ఇదెక్కడి కల్తీ బాబోయ్ (వీడియో)
దోసెలో బొద్దింక.. బిరియానీలో బల్లి.. చట్నీలో పురుగు.. వెజిటేరియన్ ఫుడ్‌లో నాన్ వెజ్ పీసులు.. బేగంపేటలో 700 కిలోల కుళ్లిన చికెన్ సీజ్..
ఇటీవల టీవీ బ్రేకింగ్ న్యూస్ లో ఎక్కువగా కనిపిస్తున్నవి ఇవే. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రతిరోజూ హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార పదార్థాల తయారీ కేంద్రాలపై దాడులు చేస్తున్నా.. నిర్వాహకుల్లో మార్పు రావడంలేదు. కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్లు.. ఇంట్లోకి కావలసిన నిత్యావసరాలు నుంచి స్వీట్స్, స్నాక్స్, ఫ్రూట్స్ అన్నీ కల్తీనే. ఫాస్ట్ ఫుడ్స్ సంగతైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో ఇలాంటి పరిస్థితులు లేవా? అంటే ఇప్పటికంటే ఎక్కువేనని అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఓ పక్క నిత్యం అధికారులు దాడులు చేస్తున్నా.. ఈ దందా ఆగలేదంటే ఏ స్థాయిలో వేళ్లూనుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఆహార పదార్థాల కల్తీపై దిశ స్పెషల్ స్టోరీ.
- రాణి యార్లగడ్డ
వంటిల్లంతా కల్తీనే..
మన వంటిల్లంతా కల్తీమయం. తాళింపు దినుసుల నుంచి వంటలో వాడే నూనె వరకూ అన్నీ కల్తీ అవుతున్నాయి. అసలు ఎటు పోతున్నాయి మన ఆహారపు అలవాట్లు ? ఏం సాధించాలని ఉద్యోగాలంటూ పరిగెడుతున్నాం ? నాలుగు రాళ్లు వెనకేయాలన్నా, పిల్లల్ని చదివించాలన్నా, ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి. మనం తినే ఆహారం నాణ్యంగా ఉండాలి. ఒకప్పటి ఆహారంలో ఉన్న నాణ్యత ఇప్పుడు లేదంటారు కదా. కానీ.. కొద్దో గొప్పో నాణ్యంగా ఉన్న ఆహారం మనం ఎవరం తినడం లేదు మరి. చాలామంది వంటింటి ముఖం చూసి ఎన్నాళ్లైందో.. క్షణం తీరిక లేని ఉద్యోగాలతో పిల్లల బాగోగులు పట్టించుకోలేనంత బిజీ. పెద్దవాళ్లుంటే వాళ్లదే పిల్లల బాధ్యత. లేకపోతే మనతోపాటు వాళ్లకీ బయటి ఫుడ్డే. అడిగింది ఇస్తున్నామన్న ఆలోచనే తప్ప.. పసిప్రాయం నుంచే మన చేతులతో మనమే వాళ్ల ఆరోగ్యాన్నీ చేజేతులా నాశనం చేస్తున్నామన్న ఆలోచన ఎవరికీ రావడంలేదు.
రెడీ టు కుక్
కొందరు బయటి ఫుడ్డుకి అలవాటు పడితే.. మరికొందరు రెడీ టు కుక్ ఫుడ్‌కి అలవాటుపడ్డారు. మీరు ఆలోచించండి. మన చిన్నప్పుడు ఎంతకష్టమైనా సరే.. అమ్మ మనకోసం ఏదికావాలంటే అది ఇంట్లోనే వండిపెట్టేది. అందుకే ఇప్పటికైనా కాస్తో కూస్తో ఆరోగ్యంగా ఉన్నాం. బయటి ఫుడ్డంటే.. ఖర్చుతో కూడుకున్న పని, పైగా అనారోగ్యం.. ఆ ఖర్చేదో పెట్టి కావలసినవన్నీ తెచ్చుకుంటే ఇంటిల్లిపాది తింటామన్న వాళ్ల ఆలోచనే నేడు మనల్ని నిలబెట్టింది. ఉదయాన్నే చద్దన్నం తిని పనికెళ్లేవారు అమ్మనాన్నలు. వాళ్లతోపాటు మనకీ అదే పెట్టేవారు. కొందరైతే ఇడ్లీ, దోసెలు వేసుకునేవారు. ఇవన్నీ ఇంట్లో తయారు చేసిన పిండితోనే చేసేవారు. కానీ ఇప్పుడేం చేస్తున్నారు ? ఇడ్లీ నుంచి పరోటా వరకూ, పులిహోర నుంచి బిరియానీ వరకూ, గరం మసాలా నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ వరకూ.. అన్నీ రెడీ మేడే. వాటిపై క్వాలిటీ ప్రొడక్ట్ అని ఉన్నా లేకపోయినా ఈజీగా వంటైపోతుందని కొనేస్తున్నారు. కానీ.. వాటిని ఎలా తయారు చేస్తున్నారు. ఏమేం కలుపుతున్నారని ఎప్పుడైనా ఆలోచించారా? అబ్బే తింటే అరిగిపోయేదానికి అంత ఆలోచన ఎందుకంటారా? అయితే మీరు షరామామూలుగా షాపులో కొని తెచ్చుకునే అల్లం వెల్లుల్లి పేస్టులో అల్లమే ఉండదని తెలుసా? అందులో ఏం కలుపుతారో తెలుసా?
ఆ ధరలను చూస్తే తేడా తెలిసిపోదా..?
రూ.10కి, రూ.20కి కాదు కదా.. రూ.100కి అమ్మే అల్లం వెల్లు్ల్లి పేస్ట్ ఆరోగ్యానికి అంత క్షేమం కాదు. కుళ్లిన అల్లం, వెల్లుల్లితో పేస్టు తయారు చేసి అమ్మే ముఠాలు నగరంలో బోలెడు ఉన్నాయి. ఇలాంటి కేసులు చాలానే వచ్చాయి. అలాగే.. అల్లం లేకుండా.. దానికి బదులుగా సిట్రిక్ యాసిడ్, ఉప్పు, పసుపు కలిపి అల్లం-వెల్లుల్లి పేస్టును తయారు చేసి.. యథేచ్ఛగా షాపులు, రెస్టారెంట్లకు అమ్మేస్తున్నారు. ఈ విషయాన్ని ఎవరో కాదు.. స్వయంగా టాస్క్ ఫోర్స్ పోలీసులే చెప్తున్నారు. తాజాగా సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్‌పల్లిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై దాడులు చేసి.. 1500 కిలోల పేస్ట్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. అయితే, అదంతా అల్లం లేకుండానే రసాయనాలతో కలిపి చేయడం అందరినీ షాక్ కి గురి చేసింది. అసలు మార్కెట్లో కేజీ అల్లం, వెల్లుల్లి రేటు వందల్లో ఉంటుంది. అలాంటిది మీకు 200 గ్రాముల పేస్ట్ రూ.20కి ఎలా వస్తుంది? ఈ విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అదేసమయంలో రూ.100 పెట్టినా అది నాణ్యమైనదని చెప్పడానికి లేదు.. ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన సంస్థలు తయారు చేసినవి కొనడం కొంతలోకొంతైనా మేలు.
కల్తీ కానిది ఏదైనా ఉందా...?
మనం స్వచ్ఛమైనది అని నమ్మి లీటరు రూ.100, కిలో రూ.1000 పెట్టి కొంటున్న పాలు, నెయ్యి కూడా కల్తీ అవుతున్నాయి. సాధారణంగా నెయ్యిలో డాల్డా కలిపి అమ్ముతారంటారు. కానీ.. పొయ్యి వెలిగించకుండానే నెయ్యి తయారు చేస్తున్నారు తెలుసా. అదేం మ్యాజిక్కో.. జిమ్మిక్కో కాదు. అంతా కల్తీ. హుజురాబాద్ పట్టణంలోని కొత్తపల్లి శివారులో కల్తీ నెయ్యి తయారుచేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నెయ్యి తయారీ కేంద్రాన్ని ‘దిశ’ గుర్తించింది. నెయ్యి ఎలా తయారు చేస్తున్నారని అడిగితే.. నిర్వాహకులు నీళ్లు నమిలారు. డాల్డా, పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ కలిపి నెయ్యిలా తయారు చేస్తున్నారు. అందులో నెయ్యి రుచి రంగు రావడానికి ఆరోగ్యానికి హాని చేసే రసాయనాలను కలుపుతున్నారు. ఆ కల్తీ నెయ్యినే రెస్టారెంట్లు, స్వీట్ హౌస్ లు, దేవాలయాలకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. కంపెనీ పేరుతోనే కవర్లలో హాఫ్ లీటర్, లీటర్ ప్యాక్ చేసి.. షాపులకు కూడా సరఫరా చేస్తున్నారు. నామమాత్రంగా ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తీసుకుని నాగేశ్వరరావు ఈ దందా చేస్తున్నా.. ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదని వాపోతున్నారు స్థానికులు. ఇదొక్కటే కాదు. తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో ఇలాంటి కల్తీ వ్యాపారాలు కోకొల్లలు.
తెలంగాణలో ‘కల్తీ’ మరణాలు
ఇటీవల కాలంలో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో షవర్మా, బిర్యానీ, మోమోలు తిని కొందరు అస్వస్థతకు గురవ్వగా.. ముగ్గురు, నలుగురు చనిపోయారు కూడా. వారి మరణానికి కారణం ఫుడ్ పాయిజన్ అని తేల్చారు వైద్యులు. ఈ ఫుడ్ పాయిజన్ ఆహారాన్ని ఎక్కువ నిల్వ ఉంచినందుకే కాదు.. వాటి తయారీకి కల్తీ పదార్థాలను వాడినా జరుగుతుంది. తక్కువకే వస్తున్నాయని.. రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అలాంటి వాటికే ప్రయారిటీ ఇస్తాయి. వాటితో వండినవే మనమూ తిని ఆస్పత్రుల పాలవుతున్నాం.
కల్తీ చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి ?
ఆహార పదార్థాలను తయారు చేసి వ్యాపారం చేసే ఏ వ్యక్తి అయినా సరే.. వాటిని కల్తీ చేసినట్లు నిర్థారణ అయితే ఆ వ్యక్తిపై ఐపీసీ 272 లేదా భారతీయ న్యాయ్ శిక్షా స్మృతి చట్టం 272 ప్రకారం కేసు బుక్కవుతుంది. నేరం రుజువైతే.. ఆరు నెలల నుంచి 2 సంవత్సరాల వరకూ జైలు శిక్ష పడొచ్చు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2006 యాక్ట్ కింద జీవితఖైదు పడే అవకాశం ఉంది. ఒక్కోసారి దానితోపాటే రూ.10 లక్షల జరిమానా కూడా పడొచ్చు.
ఇవి.. ప్రాణాంతకం
కల్తీ అయిన ఆహారాలను తింటే.. శరీరానికి ఎలాంటి పోషకాలు అందవు. ఫలితంగా మనం వినని, చూడని వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.
- స్వీట్లలో శాక్రిన్ అనే పదార్థాన్ని మిక్స్ చేస్తారు. దీని మోతాదు ఎక్కువైతే జన్యు సంబంధమైన వ్యాధులు, అజీర్తి, కడుపునొప్పి వస్తాయి.
- పిండి పదార్థాలు.. శనగపిండి, పెసర పిండి, కంది పిండి వంటి వాటిలో కేసర పప్పు పిండిని కలుపుతారు. దీని వల్ల పక్షవాతం, బెరిబెరి వ్యాధులు వస్తాయి.
- వంటనూనెల్లో ఆముదం, అరియ నూనె కలిపి కల్తీ చేస్తారు. ఇవి వాడితే శరీరంపై దురదలు వస్తాయి. వాంతులవుతాయి.
- మనం ప్రతిరోజూ వాడే పాలు కూడా కల్తీనే. సబ్బు నీళ్లు, యూరియా గుళికలు కలిపి పాలు తయారు చేస్తున్నారు. ఇవి చేదుగా ఉంటాయి. పిల్లల్లో ఎదుగుదల తగ్గుతుంది.
(ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా 1.6 మిలియన్ల ప్రజలు కలుషిత ఆహారాన్ని తిని అనారోగ్యానికి గురవుతున్నారు. ఏడాదికి 4,20,000 మంది కల్తీ ఆహారం కారణంగా చనిపోతున్నారు.)
అసలు ఏది ? నకిలీ ఏది?
మీరు ఊరెళ్లేటపుడు రైల్వే స్టేషన్లోనో, బస్ స్టేషన్లోనో వాటర్ బాటిల్ కొన్నప్పుడు ఇది Kinley నే సర్, ఇది Bisleri నే సర్ తీనుక్కోండని మీ చేతికో బాటిల్ ఇస్తాడు షాపు వాడు. వాడిచ్చింది కరెక్టే అని ఆ బాటిల్ డిజైన్, లేబుల్ కలర్ చూసి తీసుకుంటుంటారు. కానీ వాటిపై ఉండే స్పెల్లింగ్స్ చూస్తే.. అది నకిలీ అని తెలుస్తుంది. రూ.2 కే దొరికే బాటిల్లో ఫ్రీగా నల్లా నీళ్లు పట్టేసి.. రూ.20 కి దర్జాగా అమ్ముతున్నారు. కాచిగూడలో ఉన్న ఓ సంస్థ గోడౌన్‌పై ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన దాడుల్లో Brislehri, Kelvey, Nature’s Pure పేర్లతో నకిలీ వాటర్ బాటిళ్ల తయారీ జరుగుతున్నట్లు గుర్తించారు. 19,268 లీటర్ల వాటర్ బాటిళ్లను సీజ్ చేశారు. సాఫ్ట్ డ్రింక్స్, మిల్క్ ప్యాకెట్ల తయారీలోనూ ఇదే కల్తీ జరుగుతున్నది. బ్రాండెడ్ నేమ్స్ లో ఒక్క లెటర్ మార్చేసి.. రంగు, రుచి అచ్చం అలానే ఉండేలా కల్తీవి తయారు చేస్తున్నారు. సో బయట ఏదైనా వస్తువులు కొనేటప్పుడు జర భద్రం.
పాలలో కల్తీ గుర్తించండిలా..
పాలలో కల్తీ జరిగిందో లేదో తెలియాలంటే.. కొన్ని పద్ధతులున్నాయి. పాలలో యూరియా కలిస్తే.. వాటిలో సోయాబీన్ పిండిని కలిపి 5 నిమిషాలు వదిలేయాలి. అందులో రెడ్ లిట్మస్ పేపర్ ను ముంచితే నీలిరంగులోకి మారితే అవి కల్తీ అయినట్లు. టీ స్పూన్ పాలలో కొన్ని చుక్కల అయోడిన్ ను కలిపితే బ్లూ కలర్ వస్తుంది. ఆ పాలు పిండి పదార్థాలతో తయారు చేసినవని అర్థం.
నెయ్యిలో కల్తీ కనిపెట్టండి..
నెయ్యి కల్తీ జరిగితే.. గోరు వెచ్చని నీటిలో ఒక చెంచా నెయ్యి వేసి చెంచాతో కలపండి. అసలైన నెయ్యి నీటిలో కరగదు. ఒరిజినల్ నెయ్యి కంటే కల్తీ నెయ్యి జిడ్డుగా ఉంటుంది. ఒక స్పూన్ నెయ్యిలో అయోడిన్ ద్రావణాన్ని వేయండి. అది రంగుమారితే నెయ్యి కల్తీ జరిగినట్లు అర్థం.
నగరంలో భారీగా కల్తీ
ఒకప్పుడు ఫుడ్డులోనూ, స్వచ్ఛతలోనూ నంబర్ వన్ గా ఉన్న హైదరాబాద్.. ఇప్పుడు కల్తీలో నంబర్ 1 గా ఉంది. బిర్యానీ పేరు చెప్పగానే అందరికీ మొదట గుర్తొచ్చేది హైదరాబాదే. అలాంటి హైదరాబాద్ ఇప్పుడు ఫుడ్ క్వాలిటీలో లీస్ట్ కి, కల్తీలో టాప్ లో ఉంది. బిర్యానీలో ప్రమాదకరమైన కలర్స్ వాడుతుండటంతో హైదరాబాద్ బిర్యానీ ఇమేజ్ దెబ్బతింటోంది. గడిచిన 2 నెలల కాలంలోనే 84 శాతం ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైనట్లు క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. 62 శాతం హోటల్స్ లో కాలం చెల్లిన ఆహార పదార్థాలను వాడుతున్నట్లు గుర్తించింది. దీంతో హైదరాబాద్ లో ఫుడ్ తినాలంటే.. బయటి ప్రాంతాల నుంచి వచ్చేవారు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా బిర్యానీకి గిరాకీ ఉంది కదా అని నాసిరకం పదార్థాలతో తయారు చేస్తుండటం.. హైదరాబాద్ పేరునే దెబ్బతీస్తున్నది.
ఆరోగ్యంగా ఉండాలంటే..
కాబట్టి మీరు వీలైనంతవరకూ ఇంట్లోనే ఆహారాన్ని తయారు చేసుకోండి. అందుకు నాణ్యమైన ఆహార పదార్థాలను వాడండి. బయటి ఆహారం తినడానికి పెట్టే ఖర్చు.. ఇంట్లోనే వండుకునేందుకు పెట్టండి. ఆ వంటలు రాకపోతే కుకింగ్ ఛానల్స్ చూసి నేర్చుకోండి. ఈ రోజుల్లో వాటికి కొదువలేదు. ఈ ఖర్చు మనం అనారోగ్యంతో ఆస్పత్రుల పాలయ్యాక పెట్టే దానిలో సగం కూడా ఉండదేమో కదా. వంటిల్లే వైద్యశాల అని ఊరికే అనలేదు పెద్దలు. కాస్త ఆలోచించండి.