Commute Enjoyable : నో బోరింగ్..! మీ ప్రయాణాన్ని మరింత ఆనందదాయకంగా మార్చుకోండిలా !

by Javid Pasha |
Commute Enjoyable : నో బోరింగ్..! మీ ప్రయాణాన్ని మరింత ఆనందదాయకంగా మార్చుకోండిలా !
X

దిశ, ఫీచర్స్ : ఉదయం లేచించి మొదలు రాత్రి పడుకునే వరకు అనేక అనుభవాలు, ఆలోచనలు మనల్ని ప్రభావితం చేస్తుంటాయి. వీటిలో కొన్ని ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించేవైతే.. మరి కొన్ని నిరాశా, నిస్పృహలకు గురిచేసేవి కూడా ఉండవచ్చు. ఓ వైపు వ్యక్తిగత బాధ్యతలు, మరోవైపు ఆఫీసు వర్క్‌‌ మధ్య బ్యాలెన్స్‌ చేసుకోలేక ఇబ్బందులు పడుతుండవచ్చు. ఈ నేపథ్యంలో ప్రతికూల ఆలోచనలు, అనుభవాలు, పనులు మిమ్మల్ని మరింత ఒత్తిడికి గురి చేసే అవకాశం లేకపోలేదు. కాగా వీటి నుంచి బయటపడే ఒక అద్బుత మార్గంగా మీ రోజువారీ ప్రయాణాన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చునని, సృజనాత్మక మార్గంగా మల్చుకోవచ్చునని నిపుణులు అంటున్నారు. అదెలాగో చూద్దాం.

మెసేజ్‌లు, మెయిల్స్ చెకింగ్

మీరు చేసే వర్క్ ఎక్కువగా మెసేజ్‌లు, ఈ మెయిల్స్‌తో నిండిపోయి ఉండవచ్చు. సమయం సరిపోకనో, ఓపికలేకనో ఆఫీసులో ఉన్నప్పుడు చెక్ చేయడం సాధ్యం కాలేకపోవచ్చు. అయితే మీరు బస్సు, ట్రైన్, కారు ఇలా ఏ వాహనంలో వెళ్తు్న్నా, ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా సరదా సరదాగానే మీ వర్క్ ఫినిష్ చేసుకోవచ్చు. నిండిపోయిన మెయిల్స్, మెసేజెస్ ఖాళీ చేసేయవచ్చు. అలాగే మీ ప్రియమైన వారితో, మీ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడవచ్చు. మరొక విషయం ఏంటంటే.. మీరు ఇంటిలో, ఆఫీసులో ఉన్నప్పుడు సరైన రెస్ట్ తీసుకోలేకపోయి ఉంటే.. ప్రయాణం అందుకు అనువైన మార్గం. గమ్యం చేరేవరకు విశ్రాంతి తీసుకోవచ్చు. కంటి నిండా కునుకు తీయవచ్చు. ఇది మీలోని ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. మీ తర్వాతి వర్కింగ్‌ డేను పాజిటివ్‌గా, ఎనర్జిటిగ్‌గా మారుస్తుంది.

స్మార్ట్ డ్రెస్ వేసుకోండి !

మీరు ప్రజా రవాణాను ఉపయోగిస్తుంటే.. వాతావరణాన్ని బట్టి అది ఊహించని అనుభవానికి దారితీయవచ్చు. అంటే బస్సు వేడెక్కినప్పుడు లేదా ఎయిర్ కండిషనింగ్ మరీ చల్లగా ఉన్నప్పుడు అందుకు తగిన సౌకర్యం ముఖ్యం. కాబట్టి మీరు కంఫర్టబుల్‌గా ఉండాలంటే తగిన లేయర్స్ కలిగిన డ్రెస్ వేసుకుంటే బెటర్. కాబట్టి ప్రయాణానికి ముందు మీరు ధరించే దుస్తులు ఆ రోజు వెదర్ లేదా మీరు ప్రయాణించే వాహనాన్ని బట్టి ఏవి అయితే బాగుంటాయో ఆలోచించుకోవడం మీ ప్రయాణాన్ని మరింత ఎంజాయ్‌బుల్‌గా మారుస్తుంది.

‘సెల్ఫ్ కేర్’ ప్రాక్టీస్

పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లేదా సుదీర్ఘ ప్రయాణమైతే.. అక్కడ మీ సెల్ఫ్‌కేర్ అంశాలను ప్రాక్టీస్ చేయవచ్చు. జర్నీలో ఉన్నప్పుడు మీ లక్ష్యాలు, చేయాల్సిన పనులు, రాబోయే రోజుకోసం ఎలాంటి వ్యూహం అనుసరించాలి వంటి విషయాల గురించి ఆలోచించండి. రకరకాల ప్రణాళికల గురించి ప్రయాణంలో ఉండే ఆలోచించుకోవచ్చు. అవసరం అయితే వాటిని రాసుకునేందుకు జర్నల్ లేదా నోట్ బుక్‌ను తీసుకెళ్లండి. ప్రయాణాన్ని ఆహ్లాదంగా మార్చే మరో అంశం ఏంటంటే.. మీరు బైక్‌పై ప్రయాణిస్తుంటే గనుక.. కొత్త మార్గాలలో వెళ్తూ కొంగ్రొత్త దృశ్యాలను తిలకించవచ్చు కూడా.

కొత్త నైపుణ్యాలు నేర్చుకునే చాన్స్

కొత్త స్కిల్స్‌ను ప్రాక్టీస్ చేయడం లేదా నేర్చుకోవడం ప్రయాణంలో ఉంటూ కొనసాగించవచ్చు. అంతేకాకుండా ఆసక్తి ఉన్న మరో రంగం గురించి, మరో సబ్జెక్ట్ గురించి తెలుసుకోవడానికి, స్కిల్స్ అలవర్చుకోవడానికి ఇంటిలో, ఆఫీసులో ఉన్నప్పుడు సమయం ఉండకపోవచ్చు. కాబట్టి మీ ప్రయాణాన్ని అందుకోసం యూజ్ చేసుకోవచ్చు. ట్యాబ్ లేదా ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్ ఇలా ఏ పరికమైనా మీ స్కిల్స్ మెరుగు పర్చుకోవడంలో యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లయితే రిలాక్స్ అయ్యేందుకు మెడిటేషన్, డీప్ బ్రీతింగ్ వంటివి కూడా బస్సు, ట్రైన్‌, కారు వంటి వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కొనసాగించవచ్చు. లాంగ్ జర్నీ అయితే మీకు విశ్రాంతిని ఇవ్వడంలో మరింత సహాయపడుతుంది.

ప్రస్తుత పరిస్థితిని ఆస్వాదించండి

ఇంటికి రాకపోకలు కొనసాగించే క్రమంలో మీరు డైలీ వర్క్ ఫ్రస్టేషన్స్‌లో ఉండటం సహజమే. కొన్ని ఆలోచనలు, అనుభవాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉండవచ్చు. మీ భావోద్వేగాలను ప్రభావితం చేసేవి అయినప్పుడు గత విషయాలు, రేపు జరగబోయే సమావేశాలు, ప్రణాళికలు వంటి ఆలోచనలు మిమ్మల్ని నిరాశలో ముంచెత్తవచ్చు. కాబట్టి ప్రయాణంలో ఉన్నప్పుడు ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. భూత, భవిష్యత్ అంశాలను వదిలేసి వర్తమానంలోనే ఉండండి. ప్రస్తుత పరిస్థితిని ఆస్వాదిస్తూ ఉండండి అంటున్నారు నిపుణులు.

వాకింగ్, లిజనింగ్

ప్రయాణ సమయాన్ని మీ వాకింగ్, లిజనింగ్ సమయంగానూ వినియోగించుకుంటూ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందవచ్చు. వర్క్‌ప్లస్ మీ ఇంటికి అరకిలోమీటర్ వరకు దూరంలో ఉంటే నడుచుకుంటూ వెళ్లొచ్చు. అదే సందర్భంలో మీరు ఇష్టమైన సంగీతం మోటివేషన్ ఉపన్యాసాలు లేదా ఆఫీసుకు సంబంధించిన ఆడియో మెసేజెస్ వంటివి వినవచ్చు. దీంతో మీ ప్రయాణం ప్రయోజనకరంగా, ఆహ్లాదంగా, ఆరోగ్య కరంగానూ మారుతుంది. నచ్చిన ట్యూన్‌లను, మంచి పాడ్ కాస్ట్ లేదా ఆడియో మ్యూజిక్ లు వినడం మీలోని విసుగును పోగొడుతుంది. ఆనందాన్ని కలిగిస్తుంది.

భాషపై పట్టు సాధించండి

ప్రయాణం ద్వారా కూడా కొత్త భాష నేర్చుకోవడం, కొత్త విషయాలను తెలుసుకోవడం, భాషా పరిజ్ఞానాన్ని పెంచుకోవడం కొనసాగించండి. దీంతో మీరు మరింత ఆనందాన్ని పొందవచ్చు అంటున్నారు నిపుణులు. బస్సు, ట్రైన్, కారు.. వాహనం ఏదైనా సరే సుధీర్ఘ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆడియో లెస్సన్స్ వినవచ్చు. పుస్తకాలు వెంట తీసుకెళ్లి చదవవచ్చు. మొబైల్ యాప్ ద్వారా పుస్తకాలు చదవడం, ఆడియోలు వినడం వంటివి చేయవచ్చు. మీలో భాషా నైపుణ్యాలను పెంచడంలో ఇవి అద్భుతంగా సహాయపడతాయి.

మెంటల్లీ ప్రిపేర్ అవండి

ఆ రోజు ఏం చేయాలనే విషయంలో మీరు ఒక్కోసారి సరైన ప్రణాళిక కలిగి ఉండకపోవచ్చు. మీ ప్రయాణ సమయాన్ని అందుకు సద్వినియోగం చేసుకోండి. చేయబోయే వర్క్ లేదా గోల్స్ విషయంలో మెంటల్లీ ప్రిపేర్ అవండి. ఏం సాధించాలనుకుంటున్నారో క్లారిటీకి రండి. మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఇది మంచి సమయం. అలాగే సాంకేతిక రహితంగా సమయం గడపడం ద్వారా మానసిక, శారీరక ప్రయోజనం పొందడానికి కూడా మీ ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. జర్నీలో ఉన్నంత సేపు ఫోన్ స్విచ్చాఫ్ చేయండి. పరిసరాలను ఆస్వాదించండి. ముందుగా బయలు దేరడం, ప్రయాణంలో ఇతరులతో సరదాగా మాట్లాడటం, పజిల్స్ పరిష్కరించడం, ఫోన్‌లో ప్రియమైన వారితో మాట్లాడటం, ఒత్తిడి నుంచి ఉపశమనానికి మెడిటేషన్ చేయడం ఇలాంటివన్నీ ప్రయాణ సమయంలో పాటిస్తూ మీ రోజువారీ దినచర్యను మరింత ఆహ్లాదంగా, ఆనంద దాయకంగా మార్చుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

Advertisement

Next Story