కల్తీ ప్రొడక్ట్స్‌ను ఇలా ఈజీగా గుర్తుపట్టొచ్చు... తెలుసా?

by S Gopi |   ( Updated:2022-11-23 15:30:01.0  )
కల్తీ ప్రొడక్ట్స్‌ను ఇలా ఈజీగా గుర్తుపట్టొచ్చు... తెలుసా?
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: కాదేదీ కల్తీకి అనర్హం అంటూ కల్తీ రాయుళ్లు మనం తినే ఆహార పదార్ధాలను యధేచ్ఛగా కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ఒకదాంట్లో ఉంది, మరో దాంట్లో లేదనేలా నేడు అన్నింటా కల్తీమయమైంది. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న కల్తీరాయుళ్లను అరికట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తుండడంతో వారి వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం అందరూ ఇష్టంగా తినే పప్పులు, వేకువజామున నిద్రలేవగానే తాగే టీ, కాఫీలలో ఇలా ఎందులో చూసినా కల్తీ జరుగుతున్నా పట్టించుకునేవారు లేకుండా పోయారు. ఎప్పుడో ఒకప్పుడు దాడులు చేసే అధికారులంటే వ్యాపారులలో భయం లేకుండా పోయింది. దీంతో యథేచ్ఛగా కల్తీలకు పాల్పడుతున్నారు. కందిపప్పులో కేసరి పప్పు, పాలు చిక్కగా కన్పించడం కోసం బియ్యం పిండి కలుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇవే కాకుండా శనగపిండి, ధనియాల పొడి, కారం పొడి, వక్కపొడి, నెయ్యి, పంచదార, ఉప్పు, పసుపు, కాఫీ, టీ పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంట నూనెలు ఇలా నేడు మనిషి తీసుకునే ప్రతి ఆహార పదార్థంలోనూ కల్తీ రాజ్యమేలుతోంది.

ప్రముఖ బ్రాండ్ల పేరుతో విక్రయాలు..

కల్తీరాయుళ్లు పేరొందిన కంపెనీల బ్రాండ్లను పోలినట్లుగా ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లో విక్రయాలు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అసలు, నకిలీది పక్క పక్కన పెడతే ఏది అసలో, ఏదీ నకిలీనో తెలుసుకోనట్లుగా ఉంటున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా వంట నూనెలలో జంతువుల వ్యర్ధాల నుంచి తీసిన నూనెను కలుపుతున్నారు. ఇలా తయారు చేసిన నూనెను నగరంలోనే కాకుండా జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. నకిలీ వస్తువులను మార్కెట్ చేసుకునే క్రమంలో ప్రముఖ కంపెనీల బ్రాండ్ల పేర్లను వాడుకుంటున్నారు. హైదరాబాద్ వంటి మహానగరంలో కాలుష్యం మూలంగా గాలి, నీరు కలుషితమౌతుండగా మరోవైపు కల్తీ వస్తువుల తయారీ కొనుగోలుదారులను ఆందోళనలకు గురిచేస్తోంది. ఏది కొనాలన్నా ఆలోచించవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఏది తింటే ఏమౌతుందోననే భయంతో ప్రజలు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల అంతటా నిరసన వ్యక్తమౌతోంది.

కల్తీనీ గుర్తించేందుకు కొన్ని చిట్కాలు...

కారం

కారం ఎక్కువ ఎర్రగా, పొడిపొడిగా ఉంటే కల్తీ జరిగినట్లుగా నిర్ధారణకు రావచ్చు. ఇటుకల పొడి, కర్ర పొట్టుతోపాటు నిషేదిత రంగులను కలిపి కారాన్ని కల్తీ చేస్తుంటారు. దీన్ని గుర్తించేందుకు కొద్దిగా కారం పొడిని తీసుకుని నీటిలో వేస్తే ఇటుకల పొడి నీటి అడుగుకు చేరుతుంది.

పాలు..

పాలలో డిటర్జెంట్, యూరియా, సింథటిక్ మిల్క్ వంటివి కలిపి కల్తీ చేస్తుంటారు. కొద్ది పాలలో అంతే పరిమాణంలో నీటిని కలిపితే డిటర్జెంట్ కలిపిన విషయం తెలిసిపోతుంది. అంతే కాకుండా పాలను వేడి చేసినప్పుడు లేత పసుపు రగులోకి మారడం, తాగినప్పుడు చేదుగా అనిపిస్తే కచ్చితంగా అందులో కల్తీ ఉన్నట్లుగా తెలుసుకోవాలి. ఇలాంటి పాలను తాగితే జీర్ణకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

ఐస్ క్రీం..

పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఐస్ క్రీంను సైతం డుప్లీకేటుగాళ్లు వదలడం లేదు. కల్తీ ఐస్ క్రీం తింటే రోగాల బారినపడే ప్రమాదముంది. ఇందులో కల్తీని గుర్తించాలంటే ఐస్ క్రీంపై నిమ్మరసం వేస్తే నురగ, బుడగలు వస్తాయి. ఇలా వస్తే కల్తీ జరిగిందని నిర్ధారించుకోవాలి.

తేనె..

తేనెలో బెల్లం పాకం కలపడం ద్వారా కల్తీ చేస్తుంటారు. తేనెలో ముంచిన అగ్గిపుల్లను వెలిగించాలి. ఒకవేళ అది వెలగకపోయినా, టప్‌మని శబ్దం వచ్చి ఆరిపోయినా అందులో కల్తీ జరిగినట్లుగా గుర్తించాలి. స్వచ్ఛమైన తేనెలో ముంచిన అగ్గిపుల్ల వెలిగించగానే మండుతుంది. కల్తీ తేనే తాగడం వల్ల అజీర్ణ సమస్యలు వస్తాయి.

ఉప్పు..

ప్రతి వంటలో ఉప్పు లేకుండా తినలేం. వంటిట్లో ఉప్పుది ప్రధాన పాత్ర. ఇందులోనూ కల్తీ ఆందోళన కల్గిస్తోంది. సాధారణ ఉప్పులో సుద్దను కలుపడం, అయోడైజ్డ్ ఉప్పులో మామూలు ఉప్పు కలిపి కల్తీ చేస్తుంటారు. ఉప్పు కలిసిన నీటిని వేడి చేస్తే సుద్దపైకి తేలుతుంది.

పసుపులో కల్తీని గుర్తించడమెలా..

పసుపులో కల్తీని గుర్తించేందుకు ముందుగా గ్లాసు నీరు తీసుకోవాలి. అందులో కాసింత పసుపు పొడిని కలపాలి. ఒకవేళ పసుపు కల్తీ చేస్తే నీరు మరింత పసుపు రంగులోకి మారి పసుపు స్థిరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

శానిటరీ ప్యాడ్స్ వాడే వారికి షాకింగ్ న్యూస్.. క్యాన్సర్, పిల్లలు పుట్టే ఛాన్స్ తక్కువంటూ రిపోర్ట్!

Advertisement

Next Story