Satirical folk song on Pushpa టికెట్లు మేమే కొనాలి.. చప్పట్లు మేమే కొట్టాలి.!

by Daayi Srishailam |
Satirical folk song on Pushpa   టికెట్లు మేమే కొనాలి.. చప్పట్లు మేమే కొట్టాలి.!
X

ఇయర్ ఏదైనా..

పార్టీ ఎక్కడైనా..

స్వామికి ఊపురావాలంటే ఫోక్ ఉండాల్సిందే.

స్టేజీ ఊగిపోవాల్సిందే.

అంత దమ్ముంది కాబట్టే..

సినీ ఇండస్ట్రీనే తనవైపు తిప్పేస్కుంది జానపదం.

యూట్యూబ్ చెక్ చేయండి తెలుస్తుంది.

వారానికి ఓ 10 సాంగ్స్ రిలీలైతే వాటిలో 8 ఫోక్ సాంగ్సే.

అలాంటి ఫోక్ సాంగ్‌తో పుష్పరాజ్‌కే సెటైర్ పాడిన సింగర్ ప్రభ పరిచయం.

- దాయి శ్రీశైలం

పుష్ప-2 కాంట్రవర్సీ ఇంకా నడుస్తూనే ఉంది. ఎవరు చేసే కామెంట్లు వాళ్లు చేస్తున్నారు. కౌంటర్లూ ఇచ్చి కథను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ గ్యాప్‌లో ఒక సాంగ్ దూసుకొచ్చింది. టికెట్లు మేమే కొనాలె.. చప్పట్లు మేమే కట్టాలె.. సావులు మేమే సావాలె.. సంపాదన మీరే కావాలె అనే సాంగ్. గుర్తొచ్చింది కదా. ఆ సాంగ్‌ను పాడి ఉర్రూతలూగించిన సింగరే ప్రభ.

నా పాట నా ఇష్టం..

"ఆ సాంగ్ పాడింది నేనే కానీ, కాన్సెప్టంతా శ్రీనివాసన్నది. పాటను రాసిందీ, జనాల్లోకి తీసుకెళ్లింది ఆయనే. నా వరకు నేను పాడానంతే. కాకపోతే పాట జనాల్లోకి చాలా వేగంగా వెళ్లింది. అందరూ ఓన్ చేసుకోవడంతో నాకూ మంచి పేరొచ్చింది. వందల ఫోన్ కాల్స్ వచ్చాయి. బాగుందని మెచ్చుకున్నవాళ్లున్నారు. అసలలా ఎందుకు పాడావు అన్నవాళ్లూ ఉన్నారు. నేనొక సింగర్‌గా నా పని నేను చేశానంతే. నేనే కాదు, ఏ సింగరైనా ఇలాగే చేస్తారు. ఏదేమైనా 2024ను జనాదరణ పాటతో సాగనంపినందుకు సంతోషంగా ఉంది. ఒకవైపు వివాదం జరుగుతుండగానే అంత స్పాంటినిటీతో ఈ పాటొచ్చింది కాబట్టీ త్వరగా రీచ్ అయ్యింది. పాటను రాసిన శ్రీనివాస్ అన్నకు సొసైటీ మీద కన్సర్న్ బాగనే ఉన్నట్టుంది మరీ".

మామూలు ఆదరణా.?

"ఇప్పటివరకు చాలా పాటలు పాడాను. ఈ బిజీలో అసలెన్ని పాటలు పాడానో కూడా లెక్కపెట్టుకోవడం మర్చిపోయా. రోజూ 4-5 సాంగ్స్ పాడుతూ ఉన్నాను. ఒక్కోసారి తినడానికి కూడా సమయం ఉండదు. జానపదాలకు ఈ రకమైన ఆదరణ వస్తుందని నేనుకోలేదు. నేను పాడిన పాటలన్నీ దాదాపు జనాలకు రీచ్ అయినవే. ఇప్పటికీ వందల పాటలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఎంతలేదన్నా 3000 సాంగ్స్ పాడి ఉంటా. ఈ ఒక్క 2024లోనే 1000కి పైగా పాడాను. అందుకే నాకు 2024 ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఒకొక్క రోజయితే 5 సాంగ్స్‌కు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటివరకైతే పాడటం, రాయడం వరకు నడుస్తోంది. స్ర్కీన్ మీద కనిపించడం లేదనే వెలితైతే ఉందిగానీ, కుదరడం లేదు".

సిటాపట సినుకులకు..

"పార్టీ అయినా, ఫంక్షన్ అయినా, ఇన్‌స్టా రీల్ అయినా ఓ పిలగ వెంకటేశు పాట లేకుండా అయితే నేను ఇప్పటివరకు చూడలేదు. అంత ఊపింది ఆ సాంగ్. చిన్నప్పటి నుంచి మా అమ్మ పాడితే వింటూ నేను జానపదాలు నేర్చుకున్నా. అయితే యూట్యూబ్‌లో మాత్రం 2021 నుంచి పాడుతున్నా. చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్న పాటలు, సేకరణ పాటలు, సొంతంగా రాసినవి చాలా ఉన్నాయి. నేను పాటలు పాడుతా అని మాత్రం సిటా పటా సినులకు ఏడ తిన్నవ్‌రో రాతిరీ అనే సాంగ్ ద్వారానే అందరికీ తెలిసింది. ఆ పాటతోనే నేను ఫేమసయ్యాను. ఆ పాటనే నాకు మరిన్ని పాటలు పాడే అవకాశాన్ని తీసుకొచ్చింది. కాబట్టీ అది నాకు ఎవర్ గ్రీన్".

ఓ పిలగ ఎంకటేశు..

"జానపద పాటల ప్రస్థానంలో ఇవాళ నన్ను ఒక ఫోక్ స్టార్‌గా నిలబెట్టిందయితే ఓ పిలగ ఎంకటేశు సాంగే. దీనిన నేనే రాశాను, నేను ట్యూన్ కట్టాను. మామూలుగా వేరేవాళ్లు రాసిన పాటలు చాలా హిట్ అయ్యాయి, నాకు మంచి పేరు తీసుకొచ్చాయి. మంచి అవకాశాలను కూడా ఇచ్చాయి. అయితే ఓ పిలగ ఎంకటేశు పాటను నేనే రాశాను. నేను రాసి, పాడిన పాట హిట్టయిందంటే ఆ సంతోషం ఏ లెవల్లో ఉంటుందో అర్థం చేసుకోండీ. ఇప్పటివరకు నేను రాసి, పాడినవి 80 పాటల వరకు ఉన్నాయి. జబర్దస్త్ ఫేం నూకరాజు ఛానెల్‌లో రిలీజయిన గుంటకింద గుంపు సెట్లు పాటను కూడా నేనే రాసి, పాడాను".

నా పేరే ఎల్లమ్మా..

"నా పేరే ఎల్లమ్మా సాంగ్ నన్ను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి, ఇవాళ నా టాలెంట్ నిరూపించుకొని మా కుటుంబం అంతటికీ గర్వకారణంగా మారడం నా దృష్టిలో చిన్న విషయమేం కాదు. నా ఈ ప్రస్థానంలో నా వెంటే ఉండి నడిపిస్తున్నది మాత్రం మా భర్త. పిల్లలు చాలా చిన్నవాళ్లు. ఒకానొక దశలో పిల్లల గురించి ఆలోచిస్తుంటే నేనున్నా అనే ధైర్యాన్నిచ్చి ఎంకరేజ్ చేస్తు్న్నాడు. మరింత కష్టపడి మాకంటూ ఒక ఛానెల్ పెట్టుకొని, భవిష్యత్‌లో స్టూడియో ఏర్పాటు చేసుకోవాలన్నది మా లక్ష్యం. చూడాలి మరీ ఎప్పటికి ఆ కల నెరవేరుతుందో.?"

Advertisement

Next Story

Most Viewed