- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Happy New Journey: అందమైన జీవితానికి తొమ్మిది మెట్లు
'రాజన్నొచ్చినాడూ.. రాత్రి న్యూ ఇయర్ పార్టీలో ఎంజాయ్ చేసిన రాంబ్రహ్మమొచ్చినాడూ ఒకసారి వచ్చిపోవమ్మా మెరుపుతీగా'... అనగానే ఠక్కున వచ్చేసింది 2025వ సంవత్సరం. రమ్మనగానే వచ్చింది కదా అనీ ఈ సంవత్సరాన్నీ గత సంవత్సరంలా కొవ్వత్తిని కరిగించినట్లు కరగనీయకండీ అంటూ తమ స్వీయ అనుభవాల్ని పంచుకున్నారు కొందరు. గతేడాది చేసిన పొరపాట్ల నుంచి ఈయేడు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో వివరంగా చెప్తున్నారు. వారి ప్రైవసీకి భంగం కలగొద్దని పేర్లు మార్చాం.
Take responsibility for family
'సుఖమొస్తే మొకం కడుక్కోవడానికి కూడా తీరికలేదట'. కుటుంబం పట్ల బాధ్యతలేనివాళ్లే ఇలా చేస్తారు. అది 2024 అయినా, 2025 అయినా.. ఇంకో యేడాదయినా మన బాధ్యతే పిల్లల భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని చెప్తోంది సరళ. ఆమె ఒక ఐటీ ఎంప్లాయ్.
"నా భర్త ఏ పనీ చేయడు. నేను జాబ్ చేసి ఫ్యామిలీని పోషిస్తుంటే పైగా నన్నే తిడతాడు. నేను ఆఫీస్‌కు వెళ్లి ఇంటికొచ్చేదాక సోఫాలో పడుకొని వీడియో గేమ్స్ ఆడతాడు. కనీసం తిన్న ప్లేట్‌ను కూడా తీసి సింక్‌లో వేయనంత బాధ్యతారాహిత్యం. నేను విసిగిపోయానబ్బా. కొత్త సంవత్సరంలోనూ ఇలాంటివి భరించే ఓపిక లేదు. అందుకే 2025వ సంవత్సరంలో కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్నా".
అర్థమయ్యిందా.? బాధ్యతలేని భర్త వల్ల ఏమవుతుందో.? ఒక్క భర్త విషయంలోనే కాదు. ఇది అందరికీ వర్తిస్తుంది. కాబట్టీ బంధం తెగిపోయేలా కాకుండా కలకాలం నిలిచేలా ఉండటం మంచిది. దానికి కొత్త సంవ్సరాన్ని వేదికగా మార్చుకోండీ.
Follow the principle of thrift
'పోశమ్మ కూడవెడితే మైసమ్మ మాయంజేసినట్లు' ఉంటుంది కొందరి కథ. 'ఉన్నప్పుడు ఉట్ల పండుగ.. లేనప్పుడు లొట్ల పండుగ'లా చేతిలో డబ్బులుంటే హద్దుల్లేకుండా ఖర్చుపెడతారు. తీరా జేబు ఖాళీ అయ్యేసరికి నెత్తికి చేతులు పెట్టుకొని అప్పుల వెంట పరుగులు తీస్తుంటారు. దునియా మొత్తం నడిచేది డబ్బుతోనే అని తెలిశాక కూడా దుబారా అవసరమా.? అంటోంది గృహిణి అనిత.
"నేను కొత్త సంవత్సరంలో డబ్బు పొదుపు చేయాలనుకుంటున్నా. 2024లో అవసరానికి మించి డబ్బులు ఖర్చు చేశాను. దానికితోడు అద్దె పెరిగింది. నిత్యవసర సామాగ్రి ఎక్కువ అవసరమయ్యింది. టూత్ పేస్టో ఇంకేదో చిన్న వస్తువు అవసరమైతే మార్ట్‌కు వెళితే అక్కడికి వెళ్లాక అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. ఆఖరికి పర్సు ఖాళీ అవుతుంది. గిఫ్టులు.. గిలాసలూ అనీ ఏవేవో తీసుకున్నా. కానీ 2025లో అలా కాకుండా పొదుపు సూత్రాన్ని అమలు చేయాలనుకుంటున్నా".
సో.. 'బీడిబిచ్చెం కల్లు ఉద్దెర' అన్నట్లు కాకుండా పర్సులోని పైసలను జాగ్రత్తగా కాపాడుకోండీ.
Reduce unnecessary anger
'నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది' అంటారు. ఒక్కోసారి అవసరం లేకున్నా ఇతరులమీద గయ్యిమని లేస్తుంటారు. చీటికీమాటికీ చిరాకుపడి కోపానికి కొడుకులా మారిపోతుంటారు. 2024 ఏదో అలా గడిచిపోయింది. 2025లో ఆ కోపం ఎవరికీ శాపంగాకుండా చూసుకోవాలని అంటున్నాడు వెంకటేశ్.
"నాకు కోపమెక్కువ. అదే నాకు శాపమై కూర్చుంది. చిన్నదానికీ పెద్దదానికీ, అయిందానికీ కానిదానికీ కోప్పడుతుంటాను. ఆ కోపం వల్లనే నేను ఉద్యో్గం కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత ఎన్నిసార్లు పశ్చాత్తాప పడ్డా పోయిన కొలువైతే తిరిగి రాలేదు. ఇప్పుడు కొత్త కొలువు కోసం ప్రయత్నిస్తున్నా. నా కోపాన్ని పూర్తిగా తగ్గించుకొని 2025లో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను".
తన కోపమే తనకు శతృవు అంటే ఇదే కావచ్చు. ఇక్కడ వెంకటేశ్ రియలైజ్ అయ్యాడు కాబట్టీ కుటుంబం ఊపిరి పీల్చుకుందీ. తనకు ఎదురైన అనుభవం వల్ల జీవితంలో మళ్లీ అనవసరంగా కోప్పడడు కావచ్చు వెంకటేశ్.
Don't float in the past
'దరిద్రుడి పెండ్లికి వడగళ్ల వాన' అన్నట్లు కొందరు మారదామనుకుంటారు. మధ్యలోనే ఎత్తేస్తారు. పెండ్లయ్యాక, ఫ్యామిలీ ఉన్నాక కూడా బయట చెడు తిరుగుళ్లు మానరు. అలాంటివే కొంపలు ముంచుతాయని చెప్తున్నాడు మాధవ్. మైకంలో పడితే మనిషివే మారిపోతావ్ అని హెచ్చరిస్తున్నాడిప్పుడు.
"నాకు ఒకప్పుడు వేరే అమ్మాయి పట్ల ఇష్టం ఉండేది. కానీ, నేను పెద్దలు కుదిర్చిన పెండ్లి చేసుకున్నాను. నా మ్యారేజయ్యి కూడా ఏడు సంవత్సరాలు అవుతోంది. అనుకోకుండా నా మాజీ లవర్ లైన్‌లోకి వచ్చింది. ఆమెకు కూడా పెండ్లి జరిగింది కానీ, ఎందుకో నాపై ఆసక్తి చూపిస్తోంది. నేను కాదనలేకపోయాను. కానీ నాకు ఇది తప్పు అనిపిస్తోంది. ఆమెతో చనువుగా ఉండటానికి ప్రయత్నించినందుకు చింతిస్తున్నా. గతంలోకి తొంగిచూడటం వల్లనే ఇలా జరిగిందేమో అనిపిస్తోంది. 2025 నా జీవితానికి రీఫ్రెష్ లాంటిది అవుతుందని ఆశిస్తున్నాను".
కాబట్టీ.. పాత సంబంధాలను తవ్వుకొని జీవితాన్ని వృథా చేసుకోవద్దు.. కుటుంబాన్ని ఆగం చేయొద్దని మాధవ్ సంగతి చూసయినా నేర్చుకోవచ్చు.
Health is the greatest wealth
'బతికుంటే బలుసాకయినా తినొచ్చు'. కరోనా సమయంలో చూశాం కదా.? కోట్ల రూపాయలు చేతిలో ఉండికూడా ప్రాణాలు కాపాడుకోలేకపోయారు చాలామంది. అందుకే ఆరోగ్యం ముఖ్యం. హెల్త్ బాగుంటే ఎంతటి సమస్యనయినా జయించొచ్చు అంటోంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే శృతి.
"2024 నాకు లైఫ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే సంవత్సరం. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్ల రూపాయలు పెట్టాను. వ్యాపారమేమో అంతంత మాత్రంగానే సాగింది. దీంతో నాకు ప్రెజర్ ఎక్కువైంది. మానసికంగా వీక్ అయిపోయాను. ప్రతీ చిన్నదానికే ఎమోషన్ అయ్యాను. శారీరకంగా కూడా బలహీనంగా మారిపోయాను. నాకేమైనా అయితే పిల్లలు ఆగమైపోతారని ఒక్కసారిగా భయమేసింది. వ్యాపార ఒత్తిడివల్ల బీపీ, షుగర్ కొనితెచ్చుకున్నట్లయింది. ఇప్పుడు నా లక్ష్యం ఒక్కటే. 2025లో నా ఆరోగ్యాన్నీ కాపాడుకుంటా. మానసికంగా, శారీరకంగా, భావోద్వేగ పరంగా ఫిట్ అవుతా".
అర్థమైంది కదా..? ఆరోగ్యం ఎంత ముఖ్యమో. ఆరోగ్యాన్ని సంపాదించుకున్న తర్వాత డబ్బును సంపాదించుకోవచ్చు. కోట్ల రూపాయలు సంపాదించి వాటిని అనుభవించకపోతే ఫాయిదా ఏముంటుంది చెప్పండీ.?
Stay away from bad people
'అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు' పట్టుకునే రకం మనుషులు ఎప్పటికైనా ప్రమాదమే. అలాంటివాళ్లతో సహవాసం పాముకు పాలు పోయడం లాంటిదే అని అంటున్నాడు రామకృష్ణ. ఇత్తడిని బంగారమని మోసపోవద్దనేది అతడు చెప్పే ఫిలాసఫీ. తెలిసి కూడా నమ్మితే మాత్రం నట్టేటా మునుగుడేనట.
"బయటివాళ్లెవరో కాదు. నా అనుకున్నవాళ్లే నన్ను మోసం చేశారు. మనవాళ్లే కదా ఎప్పటికైనా అర్థం చేసుకుంటారనుకున్నా. కానీ మనుషుల కంటే డబ్బే ముఖ్యంగా భావించి వ్యాపారంలో నన్ను మోసం చేశారు. జీతాలు ఇచ్చిన చేత్తోనే అప్పులు చేయాల్సి వచ్చింది. అలాంటి వారికి దూరంగా ఉంటున్నా. ఇప్పుడు నా దగ్గర డబ్బుల్లేకుండ పోవచ్చు. కానీ వ్యాపారంలో మంచి అనుభవం ఉంది. నా పరిచయాలే నన్ను నిలబెడతాయి. మళ్లీ ఆ మోసకారులు నాతో కలవడానికి ప్రయత్నిస్తారు. కానీ నేను రానివ్వను. నాకు చెడు చేసేవాళ్లు ఎవరైనా సరే 2025 నుంచి నా దగ్గరికి రానివ్వనంతే".
రామకృష్ణ చెప్పినది అక్షరాల నిజం. మనం నాశనం కావాలీ అని కోరుకునే వాళ్లు మనవాళ్లయినా సరే సహించొద్దు. అలాంటివారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో.. 2025లో దీని గురించి ఒక పేజీ రాసిపెట్టుకోండీ.
Sleep peacefully
'క్షణం తీరికలేదు.. దమ్మిడి ఆదాయం లేదు' అన్నట్లు సాగుతుంటుంది కొందరి జీవితం. 'కడుపునిండ తినీ, కంటినిండ నిద్ర' పోవడానికి కూడా సమయం ఉండదు. కానీ ప్రశాంతమైన నిద్రే ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదిస్తుందని తెలుసుకోవాలంటున్నది శిరీష. ఆమెది ప్రముఖ కంపెనీలో నైట్ టెలికాలర్ జాబ్.
"హమ్మయ్యా.. 2024 పోయింది. నేను దీన్ని క్రోధి నామ సంవత్సరంగా కాకుండా నిద్రలేమి నామ సంవత్సరంగా చూస్తాను. ఔను మరీ.. నేను ఈ సంవత్సరంలో సక్రమంగా నిద్రపోలేదు. ఏడాది పొడవునా నైట్ డ్యూటీనే చేశాను. 2025వ సంవత్సరం మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నా. ఐతే ఈ సంవత్సరం నైట్ డ్యూటీ అస్సలు చేయనని అగ్రిమెంట్ చేసుకున్నా. గతేడాది కోల్పోయిన నిద్రనంతా వడ్డీతో సహా ఈ కొత్త సంవత్సరంలో పొందాలి అనుకుంటున్నాను. నిద్ర లేకపోతే మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. నాడీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తమవుతుందని తెలుసుకున్నా".
తెల్లవార్లూ మొబైల్ ముందేసుకొని నిశాచర జీవులుగా బతుకుతున్న సార్లూ.. ఒకసారిటు చూడండయ్యా. నిద్రలేకపోతే జీవితమెంత అంధకారం అవుతుందో తెలుసుకొని కంటినిండా నిద్రపోయండయ్యా బాబూ.
Go the right way
'అంటనప్పుడు ఆముదం రాసుకున్నా అంటుకోదు'. జీవతమైనా, వాహనమైనా కాలం కలిసిరాక సరైన దిశా నిర్దేశంలో వెళ్లకపోతే సమస్యలు ఎగిరి తంతాయి అంటున్నాడు ప్రదీప్. అతనొక క్యాబ్ డ్రైవర్. ఎంతకైనా మంచిది కొత్త సంవత్సరంలో మనం ఎటువెళ్తున్నామో చెక్ చేసుకోవడం మంచిదంటున్నాడు ప్రదీప్.
"డ్రైవింగ్‌లో నాది సుదీర్ఘ అనుభవం. కానీ ఎక్కడైనా కొత్త ప్రదేశాల్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తీవ్ర ఆందోళన చెందుతా. నాకు జీపీఎస్ ఉంది, ఇంతకుముందు తిరిగిన ప్రదేశాలే వెళ్తుంటాను. కానీ ఎందుకో కొత్తగా ఫీల్డ్‌లోకి వచ్చినవారికంటే ఎక్కువ గాబరా పడతా. అదే ఎన్నోసార్లు నాకు నెత్తినొప్పి తీసుకొచ్చింది. కానీ 2025లో నేను దాన్ని మార్చుకోవాలి అనుకుంటున్నా. అదెంత లాంగ్ డ్రైవ్ అయినా దృష్టి, ఏకాగ్రత తప్పకుండా సురక్షితమైన డ్రైవింగ్ చేస్తా అనే నమ్మకం ఉంది. వాస్తవానికి ఇదెప్పుడో చేయాలి, కానీ చేయలేదు. ఇప్పటికైనా చేయపోతే కొంప కొల్లేరవుతుంది కదా మరీ".
డ్రైవింగ్ అనే కాదు. జీవతపు ప్రయాణంలో కూడా బెరుకులేకుండా సరైన డెరక్షన్‌లో ముందుకు సాగితే అదే మీ జీవితానికి శ్రీరామ రక్ష.
Live for yourself
'చుట్టమై చూడొచ్చి దయ్యమై పట్టుకుంటారు' కొందరు. మన తిప్పలేంటో మనం పడుతుంటే వాళ్ల సమస్యలనూ మనపై రుద్దుతారు. కానీ తప్పదు, కొన్ని పరిస్థితుల కారణంగా అందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. కాకపోతే ఆ జాగ్రత్తలో మనల్ని మనం మరచిపోతాం అంటున్నాడు విశ్వ మోహన్.
"అబ్బా.. భార్యా పిల్లలతో కలిసి బయటకు వెళ్లకు ఏండ్లకేండ్లు అవుతోంది. మొదలు వాళ్లకేం కావాలీ, వీళ్లకేం కావాలీ అని బంధువులు, స్నేహితుల కోసం జీవితంలో మంచి సమయాన్నంతా వెచ్చించాను. పాపం, నా పిల్లలతో విలువైన సమయం గడపలేదు. కానీ, 2025లో అలా కాదు. ఎవరి కోసమో కాకుండా నా విలువైన సమయాన్ని నా పిల్లల కోసమే కేటాయించాలి అనుకుంటున్నా. నా 38 ఏండ్ల వయసులో ఎంతలేదన్నా ఇంకో 20 సంవత్సరాలు మాత్రమే నా ముందు ఉన్నాయి. మా కుటుంబానికి అల్జీమర్స్ చరిత్ర కూడా ఉంది. అందుకే జాగ్రత్తపడి నా కోసం నేను బతకాలి అనుకుంటున్నా".
ఉద్యోగం, వ్యాపారం, చుట్టాలు, స్నేహితులు అని చాలామంది తనను తాను మరచిపోతుంటారు. అలాంటివారెవరైనా ఉంటే 2025వ సంవత్సరాన్ని పూర్తిగా మీ కోసమే కేటాయించుకోండీ.
Stop the political fights
'అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడినట్లు'.. కొన్నిసార్లు పనికిమాలిన విషయాలల్లో తలదూర్చి అభాసుపాలవుతుంటాం. ఆ వ్యక్తిత్వం ఉన్నవాళ్లు కొత్త సంవత్సరం నుంచి మార్పు దిశగా అడుగేయాలని చెప్తున్నాడు మురళి. 'కూరకొచ్చేది కాదు, బువ్వకొచ్చేది కాదు'గానీ ఈ రానిపోని రాజకీయ చర్చలు మనకెందుకు చెప్పండీ అని అంటున్నాడు.
"అనవసర చర్చల వల్లనే నేను మంచి స్నేహితులను కోల్పోయాను. వాటితో మనకొచ్చేదేమీ ఉండదు. అవేవీ మనకు పైసా ఫాయిదా చేయవు. కానీ మా లీడర్ ఇలా అంటే మా లీడర్ ఇలా అని తగవులాడుకుంటాం. ఇకపై ఈ పనికిమాలిన చర్చలు నేను చేయను. 2025వ సంవత్సరాన్ని ఫ్రెష్‌గా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా. గతంలో కోల్పోయిన నా పాత స్నేహ ప్రపంచానికి దగ్గరవుతా. నా నియంత్రణలో నేనుండి రాజకీయ తగవులు పెట్టుకునేవారి మనసునూ మార్చాలి అనుకుంటున్నా".
ఇదీ లెక్క. ఎందుకండీ పనికిమాలిన చర్చలు. కెరీర్ మీద కాన్‌సెంట్రేషన్ చేయాలిగానీ దేనికీ ఉపయోగపడని వాటి గురించి ఎందుకు చెప్పండీ.
సో.. ఫైనల్‌గా చెప్పేదేంటంటే.. 2024 నుంచి మనం కొన్ని నేర్చుకోవాలీ. ఆ సంవత్సరంలో చేసిన పొరపాట్లను 2025లో సరిదిద్దుకోండీ. నష్టాలను పూడ్చే ప్రయత్నం చేయండీ. నియంత్రణలో ఉండి నిజ జీవితానికి ఉపయోగపడే వాటి కోసమే సమయం కేటాయించండీ. అప్పుడే 2025 కొత్త సంవత్సరం నిత్య నూతనంగా ఉండి.. ఎప్పటికీ గుర్తుండిపోయే స్వీట్ మెమొరీస్‌ను 2025 డైరీలో పొందు పరుస్తుంది.
విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.. హ్యాపీ న్యూ జర్నీ..!!