BJP: రైతులు భూమి కోల్పోవడం ఆరోసారి

by Gantepaka Srikanth |
BJP: రైతులు భూమి కోల్పోవడం ఆరోసారి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ట్రిపుల్ ఆర్ అలైన్ మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం మార్చాలని, లేదంటే దక్షిణం వైపు ఉన్న రైతులు భూములు కోల్పోవడం ఇది ఆరోసారి అవుతుందని బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సర్కార్ రైతులపై కొంచెమైనా సానుభూతి చూపించాలని ఆయన అన్నారు. అలైన్ మెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పున:సమీక్షించుకోవాలన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ను తొలుత చౌటుప్పల్, మోటకొండూర్, ఆలేర్, యాదాద్రి, గజ్వేల్‌కు అవతలివైపు నిర్మించాలని ప్రతిపాదించారని, అయితే బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం వల్ల చౌటుప్పల్, వలిగొండ, భువనగిరి, గజ్వేల్‌ వైపు అలైన్‌మెంట్ మార్చారని మండిపడ్డారు.

భువనగిరి రైతులు ఇప్పటికే హైటెన్షన్ విద్యుత్ లైన్, ఎన్‌హెచ్ 163, రెండు బైపాస్ రోడ్లు, యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యకలాపాలకు భూములు ఇచ్చారన్నారు. ప్రస్తుతం ఉన్న అలైన్ మెంట్ ద్వారా కొత్తగా వాణిజ్య సదుపాయాలకు ఏమాత్రం ఉపయోగకరంగా ఉండదని, ఎందుకంటే ఆల్రెడీ ఆ రూట్ వాణిజ్య సదుపాయాలకు అనుగుణంగానే ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోసమే అలైన్ మెంట్ ను మార్చారని ఆయన గూడూరు నారాయణ రెడ్డి విమర్శలు చేశారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా అలైన్‌మెంట్‌ను మార్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story